'నో' చెప్పేందుకు గిల్టీగా ఫీలవుతున్నారా? నిపుణులు సూచిస్తున్న 6 చిట్కాలు

ఎదుటివారు బాధపడతారనే భయంతో 'నో' చెప్పలేకపోతున్నారా? ఇతరులను మెప్పించే క్రమంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, అపరాధ భావనను దాటుకుని సరిహద్దులు నిర్దేశించుకోవడానికి జస్‌లోక్ ఆసుపత్రి సైకాలజిస్ట్ రితికా అగర్వాల్ అందించిన 6 మార్గాలు ఇవే.

Published on: Nov 10, 2026, 21:45:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సరిపడా సమయం లేకపోయినా, శక్తికి మించి అలసిపోయినా ఇతరులు అడిగిన పనికి 'కాదనలేక' సరేనంటున్నారా? ఎదుటివారు ఎక్కడ నిరాశ చెందుతారో అనే భయంతో సొంత అవసరాలను, విశ్రాంతిని పక్కన పెడుతున్నారా? మానసిక శాస్త్రంలో దీనిని 'పీపుల్ ప్లీజింగ్' (ఇతరులను మెప్పించే ధోరణి) అంటారు. నిరంతరం ఇతరుల కోరికలకే ప్రాధాన్యం ఇస్తూ పోతే మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. జస్‌లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ రితికా అగర్వాల్ దీని వెనుక ఉన్న మానసిక కారణాలను, దీని నుంచి బయటపడే మార్గాలను వివరించారు.

'నో' చెప్పేందుకు గిల్టీగా ఫీలవుతున్నారా? నిపుణులు సూచిస్తున్న 6 చిట్కాలు
'నో' చెప్పేందుకు గిల్టీగా ఫీలవుతున్నారా? నిపుణులు సూచిస్తున్న 6 చిట్కాలు

'నో' చెప్పడానికి భయం ఎందుకు?

అలసిపోయినప్పటికీ ఇతరులకు సాయం చేయడం, షెడ్యూల్ నిండిపోయినా అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకోవడం, ఇష్టం లేకపోయినా కేవలం ఎదుటివారి కోసం వేడుకలకు హాజరుకావడం.. ఇవన్నీ స్పష్టమైన సరిహద్దులు గీయలేకపోవడానికి సంకేతాలు. ఇతరుల నుంచి తిరస్కరణ ఎదురవుతుందనే భయం, ఘర్షణలు వస్తాయేమోననే సందేహం లేదా తమను స్వార్థపరులుగా భావిస్తారనే ఆందోళన వల్ల చాలామంది కాదనలేకపోతుంటారు. 'మంచి వ్యక్తి అంటే ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండటమే' అనే నమ్మకం చిన్నప్పటి నుంచే మానసికంగా బలపడటం కూడా ఇందుకు కారణమవుతుంది.

అపరాధ భావన నేరం కాదు

మనుషులు సంఘజీవులు కావడంతో ఇతరులను నిరాశపరచడం అంత తేలిగ్గా అనిపించదు. "ఎదుటివారు బాధపడ్డారంటే మనం ఏదో తప్పు చేశామని భావించడమే అసలు సమస్య" అని సైకాలజిస్ట్ రితికా అగర్వాల్ తెలిపారు.

విశ్రాంతి అవసరమని తెలిసినా, సమయం లేదని స్పష్టత ఉన్నా 'నో' చెప్పిన తర్వాత ఒకవిధమైన అపరాధ భావన (గిల్ట్) వేధిస్తుంది. ఇతరులను ఎప్పుడూ సంతోషపెట్టడానికి అలవాటుపడిన వారికి, కొత్తగా స్వీయ సరిహద్దులు విధించుకోవడం విచిత్రంగా, ఆందోళనకరంగా అనిపిస్తుంది. అయితే ఆ అసౌకర్యం ఒక కొత్త ప్రవర్తన వల్ల వచ్చిందే తప్ప, తీసుకున్న నిర్ణయం తప్పు కాదని గుర్తించాలి.

'నో' చెప్పడం ఎలా? 6 సులువైన మార్గాలు

స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం అంటే మొరటుగా ప్రవర్తించడం కాదు. మర్యాదపూర్వకంగానే మన పరిమితులను తెలియజేయవచ్చు. ఇందుకు నిపుణులు ఆరు సూచనలు చేస్తున్నారు.

వెంటనే ఒప్పుకోవద్దు: ఇతరులు ఏదైనా సహాయం అడిగినప్పుడు ఆలోచించకుండా వెంటనే 'సరే' అని చెప్పకండి. ఆ పని చేసేందుకు తగినంత సమయం, ఓపిక ఉన్నాయో లేదో ఆలోచించుకోవడానికి కాస్త సమయం తీసుకోండి.

స్పష్టంగా, మర్యాదగా తిరస్కరించండి: "క్షమించండి, ప్రస్తుతం నేను ఈ బాధ్యతను తీసుకోలేను" అని సూటిగా చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతీ వ్యక్తిగత నిర్ణయానికి సుదీర్ఘమైన వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.

అపరాధ భావనను ప్రశ్నించండి: 'నో' చెప్పాక గిల్ట్ అనిపిస్తే.. "నేను నిజంగా ఏదైనా తప్పు చేశానా? లేక ఎదుటివారు అసంతృప్తి చెందుతారనే భయంతో అసౌకర్యంగా భావిస్తున్నానా?" అని మీకు మీరు ప్రశ్నించుకోండి.

అందరూ ఏకీభవించరని గ్రహించండి: తీసుకునే నిర్ణయం పట్ల అందరూ సంతోషంగా ఉండాల్సిన పనిలేదు. ఒకరు అసంతృప్తి చెందితే మీరు తప్పు చేసినట్లు కాదు.

చిన్న విషయాల నుంచి ప్రారంభించండి: ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పడం, ఐచ్ఛిక బాధ్యతలను తిరస్కరించడం, ఆలోచించడానికి సమయం అడగడం వంటి చిన్న చిన్న మార్పులతో సరిహద్దులను నిర్మించుకోవడం ప్రారంభించండి.

సందర్భాన్ని బట్టి స్పందించండి: అన్ని వేళలా ఒకే రకమైన నిబంధన పనిచేయదు. పరిస్థితిని బట్టి నిజాయితీగా, గౌరవప్రదంగా మాట్లాడటమే ఆత్మవిశ్వాసానికి సంకేతం.

ఈ అపరాధ భావన నిరంతరం వేధిస్తూ మానసిక ప్రశాంతతను, సంబంధాలను దెబ్బతీస్తుంటే కౌన్సెలింగ్ లేదా థెరపీ ద్వారా నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More