కేవలం ప్రొటీన్ మాత్రమే కాదు.. పాలు ఎందుకు పరిపూర్ణ ఆహారమో తెలుసా?
కేవలం కడుపు నిండటమే కాకుండా సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడమే భారతదేశానికి ప్రస్తుత అత్యవసరమని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సీఈఓ శ్రీదీప్ కేశవన్ స్పష్టం చేస్తున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు, పాలు, పాల ఉత్పత్తుల ఆవశ్యకతను వివరిస్తూ ఆయన అందించిన ప్రత్యేక విశ్లేషణ.
దశాబ్దాలుగా భారతదేశంలో పోషకాహార లక్ష్యం అనేది ఒకే ఒక ప్రాథమిక అంశం చుట్టూ తిరిగింది. అది అందరికీ తగినంత ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం. ఈ దిశగా చేపట్టిన చర్యలు దేశంలో ఆహార భద్రతను (Food Security) గణనీయంగా సాధించాయి. అయితే కాలంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా మారాయి. ప్రజల ఆదాయాలు పెరిగి, ఆహార ఎంపికలు విస్తరించిన ప్రస్తుత తరుణంలో.. మనం ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నామనే దానికంటే, ఆ కేలరీలు మనకు సరైన పోషకాలను అందిస్తున్నాయా లేదా అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఒక దేశం ఆహార భద్రతను సాధించినంత మాత్రాన, ఆ దేశ ప్రజలు పోషకాహార పరంగా సురక్షితంగా ఉన్నారని చెప్పలేం.

ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత వైపు..
భారతీయుల ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఇటీవలి 'గృహ వినియోగ వ్యయ సర్వే' (Household Consumption Expenditure Survey) ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 2011-12, 2023-24 మధ్య కాలంలో కుటుంబాల మొత్తం ఖర్చులో ధాన్యాల (బియ్యం, గోధుమలు) వాటా గణనీయంగా తగ్గింది. గ్రామీణ భారతదేశంలో ఇది 10.69 శాతం నుంచి 4.97 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 6.61 శాతం నుంచి 3.74 శాతానికి పడిపోయింది.
అయితే ధాన్యాల స్థానంలో ప్రజలు దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారనేదే అసలు ప్రశ్న. పాలు, పాల ఉత్పత్తులపై చేసే ఖర్చు శాతం పెద్దగా మారకుండా స్థిరంగా ఉంది. కానీ పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బయట కొనుగోలు చేసే సిద్ధాహారాలపై ఖర్చు భారీగా పెరిగింది. 2023-24లో ఈ ప్రాసెస్ చేసిన ఆహార విభాగం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 9.84 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 11.09 శాతంగా ఉంది. ఇది పాలు, పాల ఉత్పత్తులపై పెట్టే ఖర్చు (గ్రామీణంలో 8.44%, పట్టణాల్లో 7.19%) కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఈ గణాంకాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. భారతీయులు సాంప్రదాయ ఆహార పదార్థాల నుంచి ఇతర ఆహారాల వైపు మళ్లుతున్నారు. అయితే ఆహారంలో విభిన్నత పెరిగినంత మాత్రాన పోషకాహారం లభిస్తుందని చెప్పలేం. మారుతున్న ఆహారపు అలవాట్లలో మేలైన పోషకాలు ఉండేలా చూసుకోవడమే మన ముందున్న ప్రధాన అవకాశం.
పాల ఉత్పత్తుల ప్రాధాన్యం ఏంటి?
భారతీయ ఆహార వ్యవస్థలో పాల రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలను మనం సాధారణంగా ప్రొటీన్ వనరుగానే చూస్తాం. కానీ పాల వల్ల లభించే ప్రయోజనాలు అంతకుమించినవి. తొమ్మిది రకాల ఆవశ్యక అమైనో ఆసిడ్లతో కూడిన నాణ్యమైన ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సహజంగానే సమృద్ధిగా లభించే పరిపూర్ణ ఆహారం పాలు.
ఈ పోషకాల కలయిక శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రొటీన్ శరీర ఎదుగుదలకు, కండరాలు, కణజాలాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది. కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, దంతాల దృఢత్వానికి పునాదులు. పాలలోని కొవ్వు శక్తిని అందించడమే కాకుండా కొవ్వులో కరిగే విటమిన్లను శరీరానికి అందిస్తుంది. పాలకు విటమిన్ ఎ, విటమిన్ డి లను జోడించడం (Fortification) ద్వారా ఈ సూక్ష్మపోషకాల లభ్యతను మరింత పెంచవచ్చు.
జీవితంలో ప్రతి దశకూ పాల ఉత్పత్తులు అవసరం
పోషకాహార అవసరాలు అందరికీ ఒకేలా ఉండవు. వయస్సును బట్టి మారుతుంటాయి.
- ఎదిగే పిల్లలు: శారీరక, మానసిక వికాసానికి ప్రొటీన్, ఖనిజాలు, శక్తి అవసరం.
- కౌమారదశ (టీనేజర్లు): వేగంగా పెరిగే శరీర తత్వానికి అదనపు పోషకాల మద్దతు కావాలి.
- పెద్దలు: సౌలభ్యంతో పాటు నిరంతర శక్తిని ఇచ్చే ఆహారం అవసరం.
- వయోవృద్ధులు: కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యుత్తమ ప్రొటీన్, కాల్షియం అవసరం.
ఈ అన్ని వర్గాల అవసరాలను సహజంగా, అతి తక్కువ ఖర్చుతో తీర్చగల ఆహార విభాగం పాల ఉత్పత్తులు మాత్రమే. ప్రస్తుతం పాలు మాత్రమే కాకుండా పెరుగు, పన్నీర్, మజ్జిగ, ప్రొబయోటిక్స్, ప్రోటీన్ రిచ్ ఉత్పత్తులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. మన సాంప్రదాయ వంటకాల పద్ధతిని మార్చుకోకుండానే ఆహారంలో పోషక విలువలను పెంచుకోవడానికి ఇవి తోడ్పడుతున్నాయి.
పోషకాహారం కొందరికే పరిమితం కాకూడదు
నాణ్యమైన పోషకాహారం అనేది కేవలం ఖరీదైన సప్లిమెంట్లు లేదా ప్రత్యేక ఆహార పదార్థాల ద్వారా మాత్రమే లభించే విలాసవంతమైన వస్తువు కాకూడదు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి.
భారతీయ పాల రంగానికి ఉన్న అతిపెద్ద బలం.. నాణ్యమైన పోషకాలను నగరాల నుంచి పల్లెల వరకు అత్యంత సులభంగా, తక్కువ ధరలోనే చేర్చగలగడం. విస్తారమైన పాడి రైతుల నెట్‌వర్క్, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్ వ్యవస్థల వల్ల ఇది సాధ్యమవుతోంది.
దేశంలో ఒకవైపు పోషకాహార లోపం, మరోవైపు జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేవలం కేలరీలు పెంచడం కంటే, మనం తీసుకునే ప్రతి కేలరీలో పోషక విలువలను పెంచడమే అసలైన పరిష్కారం. 'జాతీయ పోషకాహార వారోత్సవాలు' మనకు ఈ మార్పును గుర్తుచేస్తున్నాయి. ఆకలిని జయించిన భారత్, ఇప్పుడు పోషకాహార దిశగా బలమైన అడుగులు వేయాల్సి ఉంది. ఆ లక్ష్య సాధనలో పాల రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యాసకర్త:
- శ్రీదీప్ కేశవన్,
సీఈఓ, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


