మగవారిలో సంతానలేమి: అస్సలు విస్మరించకూడని కీలకాంశాలు.. గైనకాలజిస్ట్ హెచ్చరిక

మగవారిలో సంతాన లేమి లక్షణాలు, కారణాలు, చికిత్స వివరాలను వడోదర గైనకాలజిస్ట్ డాక్టర్ విశాల్ ఠాకూర్ వివరించారు. చాలా మంది దంపతులు బిడ్డను కనేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఏ లక్షణాలను విస్మరించకూడదో వడోదరకు చెందిన డాక్టర్ విశాల్ ఠాకూర్ వివరించారు.

Published on: Nov 3, 2025, 07:39:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా జంటల్లో సంతాన సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే, సంతానలేమి అనేది మహిళలతో పాటు పురుషుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది పురుషుల్లో ఈ సమస్య ఆలస్యంగా, ముఖ్యంగా బిడ్డ కోసం ప్రయత్నించేటప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఆరోగ్యం లేదా శారీరక విధుల్లో జరిగే చిన్నపాటి మార్పులు కూడా ఈ సమస్యకు సంకేతాలుగా ఉండొచ్చు.

మగవారిలో సంతానలేమి: అస్సలు విస్మరించకూడని కీలకాంశాలు.. గైనకాలజిస్ట్ హెచ్చరిక (Freepik)
మగవారిలో సంతానలేమి: అస్సలు విస్మరించకూడని కీలకాంశాలు.. గైనకాలజిస్ట్ హెచ్చరిక (Freepik)

గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ విశాల్ ఠాకూర్.. అక్టోబర్ 31న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పురుషుల సంతానలేమికి సంబంధించిన కీలక లక్షణాలను అస్సలు విస్మరించకూడదని పేర్కొన్నారు.

మగవారిలో సంతానలేమికి కారణాలేంటి?

మీరు, మీ భాగస్వామి ఎంత ప్రయత్నించినా బిడ్డ కలగకపోతే, సంతానలేమిని కేవలం మహిళల సమస్యగా చూడవద్దు. ఈ విషయంలో డాక్టర్ విశాల్ కీలక వివరాలు పంచుకున్నారు.

"సుమారుగా ప్రతి మూడు జంటల్లో ఒక జంటకు సంతానం కలగకపోవడానికి మగవారిలో సంతానలేమి ప్రధాన కారణం" అని డాక్టర్ విశాల్ స్పష్టం చేశారు. చాలా మంది పురుషులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల రోగ నిర్ధారణ, చికిత్స ఆలస్యమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంతానలేమి అనేది ఎక్కువగా మహిళల సమస్య అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ, పురుషుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్ ఠాకూర్ నొక్కి చెప్పారు.

"వయస్సు, జీవనశైలి, మొత్తం ఆరోగ్యం మనం అనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావితం చేస్తాయి," అని ఆయన వివరించారు. "ఒత్తిడి, ధూమపానం, అధిక బరువు లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి సాధారణ అంశాలు కూడా శుక్రకణాల నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతాయి"అని వివరించారు.

పురుషులు ఎప్పుడూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారనేది కేవలం అపోహ మాత్రమేనని డాక్టర్ ఠాకూర్ కొట్టిపారేశారు. "అది నిజం కాదు. పురుషులు కూడా హార్మోన్ల అసమతుల్యత, ఇన్‌ఫెక్షన్లు లేదా నిర్మాణపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది, ఇవి సంతానోత్పత్తిని తగ్గిస్తాయి. శుభవార్త ఏమిటంటే, ఈ సమస్యల్లో చాలా వరకు ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చు" అని ఆయన భరోసా ఇచ్చారు.

అస్సలు విస్మరించకూడని హెచ్చరిక సంకేతాలు

పురుషులలో సంతానలేమిని సూచించే కొన్ని ముఖ్యమైన లక్షణాలను డాక్టర్ ఠాకూర్ జాబితా చేశారు. వాటిని ఒక్కసారి పరిశీలించండి.

తగ్గిన లైంగిక కోరిక (Low Libido): "మీకు లైంగిక ఆసక్తి చాలా కాలంగా తగ్గితే, అది హార్మోన్ల మార్పులు లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు" అని ఆయన తెలిపారు.

అంగస్తంభన సమస్య (Erectile Dysfunction): "అంగస్తంభన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా జననాంగాల వైపు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తాయి" అని డాక్టర్ ఠాకూర్ వివరించారు.

వృషణాలలో నొప్పి, వాపు లేదా గడ్డలు: ఇవి వెరికోసెల్ (స్క్రోటమ్‌లో సిరలు ఉబ్బడం) లేదా ఇన్‌ఫెక్షన్‌కు సంకేతాలు కావచ్చు. ఈ రెండూ శుక్రకణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి.

"పురుషులు తరచుగా సిగ్గుపడి ఈ లక్షణాలను కొట్టిపారేస్తారు. కానీ వాటిని విస్మరిస్తే చికిత్స ఆలస్యమై, సంతానం పొందే అవకాశాలు తగ్గుతాయి" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ఎప్పుడు నిపుణుడిని సంప్రదించాలి?

ఒకవేళ మీరు లేదా మీ భాగస్వామి ఏడాదికి పైగా ప్రయత్నించినా ఫలితం లేకపోతే, లేదా మహిళ వయస్సు 35 ఏళ్లు దాటితే ఆరు నెలలపాటు ప్రయత్నించినా బిడ్డ కలగకపోతే, వెంటనే దంపతులిద్దరూ నిపుణుడిని సంప్రదించాలని డాక్టర్ ఠాకూర్ సలహా ఇస్తున్నారు.

"సంతానలేమి అనేది పురుషత్వం (Masculinity) కొలమానం కాదు. ఇది ఒక వైద్య పరిస్థితి. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, అంత మంచి ఫలితాలు ఉంటాయి" అని ఆయన స్పష్టంచేశారు.

దంపతులు గమనించాల్సిన కీలక అంశాలు (Google Gemini)
దంపతులు గమనించాల్సిన కీలక అంశాలు (Google Gemini)

మగవారి సంతానలేమికి సంబంధించిన ప్రారంభ సంకేతాలను గుర్తించి, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా దంపతులు తమ కలలను నెరవేర్చుకోవచ్చు.

(గమనిక: ఈ కథనం సోషల్ మీడియాలో నిపుణులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించింది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీనిని వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించవద్దు.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More