పిల్లల ప్రాణాలతో 'డిజిటల్ క్యాసినో' ఆటలు: మెటా, యూట్యూబ్‌లపై సంచలన విచారణ

సోషల్ మీడియా వ్యసనం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందనే అంశంపై లాస్ ఏంజిల్స్‌లో చారిత్రాత్మక విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ సహా పలు దేశాల్లో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Published on: Feb 10, 2026 4:54 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత కాలంలో పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి. అయితే, ఈ అలవాటే వారి పాలిట శాపంగా మారుతోందా? సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (Meta), యూట్యూబ్‌ (YouTube)లు కావాలనే పిల్లలను తమ యాప్‌లకు బానిసలుగా మార్చుతున్నాయా? అంటే.. అవుననే ఆరోపణలు ఇప్పుడు కోర్టు గడప తొక్కాయి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనే ఫిర్యాదులపై లాస్ ఏంజిల్స్‌లో ఒక సంచలన విచారణ ప్రారంభమైంది.

పిల్లల ప్రాణాలతో 'డిజిటల్ క్యాసినో' ఆటలు: మెటా, యూట్యూబ్‌లపై సంచలన విచారణ
పిల్లల ప్రాణాలతో 'డిజిటల్ క్యాసినో' ఆటలు: మెటా, యూట్యూబ్‌లపై సంచలన విచారణ

ఏమిటీ 'డిజిటల్ క్యాసినో' ఆరోపణ?

ఈ కేసులో పిటిషనర్ తరపు న్యాయవాదులు సోషల్ మీడియా యాప్‌లను "డిజిటల్ క్యాసినోలు" (Digital Casinos) గా అభివర్ణించారు. జూదశాలలో స్లాట్ మెషీన్‌ను ఎలాగైతే కిందికి లాగుతారో, అలాగే సోషల్ మీడియాలోని 'ఎండ్‌లెస్ స్క్రోల్' (Endless Scroll) ఫీచర్ కూడా పిల్లల మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచుతుందని వారు వాదిస్తున్నారు.

ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కాలే (Kaley) అనే యువతి ఈ చారిత్రాత్మక పోరాటం చేస్తోంది. చిన్నతనం నుంచే సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల తనకు తీవ్రమైన ఆందోళన (Anxiety), తన శరీరంపై తనకే అసహ్యం కలగడం (Body Dysmorphia), చివరికి ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె కోర్టుకు తెలిపింది. అయితే, సదరు కంపెనీలు మాత్రం ఆమె మానసిక స్థితికి కుటుంబ సమస్యలే కారణమని వాదిస్తుండటం గమనార్హం.

యూత్ కోసం పదేళ్ల నాటి వ్యూహం?

పిల్లలను ఆకర్షించేందుకు మెటా పదేళ్ల క్రితమే ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించిందని పిటిషనర్ న్యాయవాదులు కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. "టీనేజర్లను పెద్ద ఎత్తున ఆకర్షించాలంటే, ముందుగా వారిని చిన్నపిల్లలుగా (Tweens) ఉన్నప్పుడే మన ప్లాట్‌ఫారమ్‌కు అలవాటు చేయాలి" అనేది ఆ వ్యూహ సారాంశమని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై మెటా స్పందిస్తూ.. తాము పిల్లల భద్రత కోసం 'పేరంటల్ కంట్రోల్స్', 'టేక్ ఏ బ్రేక్' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టామని, ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేసింది.

ప్రపంచవ్యాప్తంగా నిషేధం దిశగా అడుగులు

సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • బ్రిటన్: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై చర్చలు జరుపుతోంది.
  • ఫ్రాన్స్: సైబర్ బుల్లీయింగ్‌ను అరికట్టేందుకు 15 ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడకుండా జనవరిలోనే నిర్ణయం తీసుకుంది.
  • స్పెయిన్, గ్రీస్, డెన్మార్క్: ఇక్కడ కూడా ఇలాంటి చట్టాలపై అధ్యయనం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కీలక నిర్ణయం?

భారతదేశంలోనూ ఈ అంశంపై గట్టి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఒక రాష్ట్రంగా మేము ఆస్ట్రేలియాలోని 16 ఏళ్ల లోపు నిషేధ చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఒక నిర్ణీత వయస్సు వచ్చే వరకు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వారు ఏం చూస్తున్నారో, అది వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకునే పరిణతి వారికి ఉండదు” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మద్రాస్ హైకోర్టు కూడా గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి సూచనలే చేసింది. ఈ ఏడాది అమెరికాలో మరిన్ని విచారణలు జరగనున్న నేపథ్యంలో, మెటా, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి కంపెనీలు తమ బాధ్యతను ఒప్పుకుంటాయా? లేక పిల్లల భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.