ఉదయాన్నే ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో పడ్డట్టే

దినచర్యలో భాగమైన కొన్ని చిన్న అలవాట్లే గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే చేసే 5 పొరపాట్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని ప్రముఖ కార్డియాక్ సర్జన్ హెచ్చరిస్తున్నారు. ఆ అలవాట్లు ఏమిటో, వాటి స్థానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Published on: Nov 9, 2026, 11:33:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గుండె ఆరోగ్యం అనేది ఒక్కరోజులో పాడయ్యేది కాదు. మనం ఏళ్లుగా అనుసరిస్తున్న జీవనశైలి, నిత్యం పునరావృతం చేసే అలవాట్లే మన హృదయ స్పందనల ఆయుష్షును నిర్ణయిస్తాయి. మానవ శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తూ, ప్రతి అవయవానికి ఆక్సిజన్, పోషకాలను అందించే అత్యంత కీలకమైన అవయవం గుండె. అయితే, చాలామంది తమ ఉదయపు దినచర్యలో చేసే చిన్న చిన్న పొరపాట్లు గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో పడ్డట్టే
ఉదయాన్నే ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో పడ్డట్టే

హృద్రోగ సమస్యలు లేదా లక్షణాలు బయటపడిన తర్వాతే చాలామంది గుండె ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంటారు. కానీ ముందస్తు జాగ్రత్తలే అసలైన రక్షణ అని జైపూర్‌లోని ఈహెచ్‌సీసీ ఆసుపత్రి కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ అజీత్ బానా స్పష్టం చేశారు. ఉదయం లేవగానే మనం తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు గుండె పనితీరును ఎలా దెబ్బతీస్తాయో, వాటి నుంచి ఎలా బయటపడాలో ఆయన వివరించారు.

ఉదయాన్నే స్వస్తి చెప్పాల్సిన ఆ 5 అలవాట్లు ఇవే:

1. పడక దిగగానే సిగరెట్ వెలిగించడం

ఉదయం టీ లేదా కాఫీతో పాటు సిగరెట్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ధూమపానం వల్ల రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వు (ప్లాక్) పేరుకుపోవడమే కాకుండా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇది కొరోనరీ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం), పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధులకు దారితీస్తుంది. రోజుకు ఐదు కంటే తక్కువ సిగరెట్లు తాగినా సరే.. గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుందని డాక్టర్ అజీత్ హెచ్చరించారు. ధూమపానాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే గుండెకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి.

2. ఉప్పు, నిల్వ పదార్థాలు ఎక్కువ ఉండే అల్పాహారం

ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇన్‌స్టంట్ మీల్స్, ప్రాసెస్ చేసిన మాంసం, ఉప్పు ఎక్కువగా ఉండే అల్పాహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు (బీపీ) వేగంగా పెరుగుతుంది. వీటిలో లభించే సంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఉదయాన్నే తృణధాన్యాలు (Whole Grains), తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల వంటి ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.

3. కాఫీ, టీలలో మితిమీరిన చక్కెర

ఉదయం తాగే టీ, ఫ్లేవర్డ్ కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా వేసుకోవడం వల్ల శరీరంలోకి అనవసర కేలరీలు చేరుతాయి. తీపి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు మెటబాలిక్ సమస్యలు తలెత్తి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. కాఫీ, టీలలో పంచదారను వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ఉదయాన్నే మంచినీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి.

4. బెడ్ మీంచి లేచి నేరుగా కుర్చీకే పరిమితమవ్వడం

శారీరక శ్రమ లేకపోవడం (Physical Inactivity) గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఉదయాన్నే లేచి మళ్లీ గంటల తరబడి కుర్చీకే పరిమితమైతే గుండె పనితీరు మందగిస్తుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే జిమ్‌కు వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు. కాసేపు నడక, తేలికపాటి వ్యాయామాలు లేదా కాసేపు అటుఇటు తిరగడం వల్ల రక్తం సరిగ్గా ప్రసరిస్తుంది. రోజంతా చురుగ్గా ఉండటం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.

5. రోజూ వాడే మందులను అశ్రద్ధ చేయడం

బీపీ, షుగర్ లేదా గుండె సంబంధిత వ్యాధులకు డాక్టర్లు సూచించిన మందులను ఉదయం వేళల్లో వేసుకోవడం మరచిపోవడం లేదా సమయపాలన పాటించకపోవడం ప్రమాదకరం. దీనివల్ల రక్తపోటు అదుపు తప్పి గుండెపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. మందులు వేసుకోవడం తరచూ మరచిపోతుంటే, సొంతంగా షెడ్యూల్ మార్చుకోకుండా డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. ప్రత్యేక మందుల డబ్బా వాడటం లేదా మొబైల్‌లో రిమైండర్లు పెట్టుకోవడం ద్వారా మందులను సరైన సమయానికి వేసుకోవచ్చు.

సులువైన మార్పులతో సురక్షితమైన గుండె

"గుండె ఆరోగ్యం అనేది ఒక్కరోజులో సాధించేది కాదు. నెలలు, ఏళ్లుగా మనం పాటించే సరైన అలవాట్ల ఫలితం. పొగాకుకు దూరంగా ఉండటం, సమతుల్య అల్పాహారం తీసుకోవడం, పంచదారను తగ్గించడం, శారీరక శ్రమ పెంచడం, సరైన సమయానికి మందులు వేసుకోవడం లాంటి చిన్న చిన్న మార్పులతోనే గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు" అని డాక్టర్ అజీత్ బానా ఉద్ఘాటించారు.

(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఇది అర్హులైన వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యపరమైన సందేహాలు లేదా సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More