...
...
Next Story

అది అండాశయ క్యాన్సర్ కావచ్చు: మహిళలు గుర్తించాల్సిన 7 సంకేతాలు

అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యల రూపంలో కనిపిస్తాయి. వారాల తరబడి వేధించే 7 ప్రధాన హెచ్చరిక సంకేతాలను మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Nov 10, 2026, 20:37:30 IST
Advertisement

మహిళల్లో వచ్చే అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్‌ను తరచుగా నిశ్శబ్ద క్యాన్సర్ అని పిలుస్తుంటారు. దీనికి లక్షణాలు లేకపోవడం కారణం కాదు.. ప్రారంభంలో వచ్చే సంకేతాలు సాధారణ అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను పోలి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. స్వల్పంగా కనిపించే ఈ లక్షణాలను మహిళలు తరచుగా ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు లేదా సాధారణ కడుపు సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.

గ్యాస్ట్రిక్ సమస్యలకు, క్యాన్సర్ లక్షణాలకు తేడా ఏంటి?

అది అండాశయ క్యాన్సర్ కావచ్చు: మహిళలు గుర్తించాల్సిన 7 సంకేతాలు
అది అండాశయ క్యాన్సర్ కావచ్చు: మహిళలు గుర్తించాల్సిన 7 సంకేతాలు

మహిళల శరీరంలో అండాశయాలు పొత్తికడుపు దిగువ భాగంలో, పేగులు, ఇతర జీర్ణావయవాలకు అత్యంత సమీపంలో ఉంటాయి. అండాశయంలో గడ్డలు ఏర్పడినప్పుడు, అవి చుట్టుపక్కల అవయవాలపై ఒత్తిడి తెస్తాయి. అంతేకాకుండా పొట్ట భాగంలో ద్రవాలు చేరడానికి లేదా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినడానికి కారణమవుతాయి. ఫలితంగా ఇవి అసిడిటీ, గ్యాస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లేదా తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపించడం వంటి సమస్యలను కలిగిస్తాయి.

"జీర్ణ వ్యవస్థ సమస్యలు అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి. కొన్ని రకాల ఆహారాలు లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇవి రావచ్చు. కానీ అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కొత్తగా ప్రారంభమై, క్రమంగా పెరుగుతూ, ఎక్కువ కాలం తగ్గకుండా వేధిస్తాయి" అని అపోలో అతీనా ఉమెన్స్ క్యాన్సర్ సెంటర్ గైనెక్-ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ ప్రిన్సిపల్ లీడ్ డాక్టర్ రూపేందర్ సెఖోన్ వివరించారు.

మహిళలు తప్పనిసరిగా గమనించాల్సిన 7 లక్షణాలు

శరీరంలో వచ్చే మార్పులు, క్రమం తప్పకుండా వేధించే లక్షణాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ రూపేందర్ సెఖోన్ స్పష్టం చేశారు.

తగ్గని పొట్ట ఉబ్బరం:

భారీగా ఆహారం తిన్నప్పుడు లేదా బహిష్టు సమయంలో కడుపు ఉబ్బరంగా అనిపించడం సహజమే. అయితే, ఈ ఉబ్బరం తగ్గకుండా రోజువారీగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. పొట్ట భాగంలో నీరు చేరడం (అసైటిస్) లేదా అండాశయంలో గడ్డలు ఉండటం ఇందుకు కారణం కావచ్చు.

కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపించడం:

పొత్తికడుపు, పెల్విస్ భాగంలో నొప్పి, అసౌకర్యం లేదా నిరంతరం ఒత్తిడిగా అనిపించడం మరొక హెచ్చరిక సంకేతం. సాధారణ రుతుక్రమ నొప్పుల కంటే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

మలవిసర్జన అలవాట్లలో ఉన్నట్లుండి మార్పులు:

అకస్మాత్తుగా మలబద్ధకం లేదా విరేచనాలు కావడం, మలవిసర్జన విధానంలో నిరంతరం మార్పులు రావడం వంటివి గమనిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పొత్తికడుపు నొప్పితో పాటు ఈ మార్పులు ఉంటే జాగ్రత్త పడాలి.

తరచుగా మూత్రవిసర్జన రావడం:

సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం లేదా అకస్మాత్తుగా మూత్ర విసర్జన కోరిక కలగడం కూడా ఒక లక్షణమే. అండాశయంలోని గడ్డ లేదా పొట్టలోని నీరు మూత్రాశయంపై ఒత్తిడి తెచ్చినప్పుడు ఈ సమస్య తలేత్తుతుంది.

కారణం లేని నడుము నొప్పి, తీవ్ర అలసట:

విశ్రాంతి తీసుకున్నా తగ్గని నడుము నొప్పి, తీవ్రమైన అలసట వేధిస్తుంటే శ్రద్ధ వహించాలి. ఈ లక్షణాలకు అనేక ఇతర కారణాలు ఉన్నప్పటికీ, కొత్తగా మొదలై తగ్గకుండా ఉంటే తనిఖీ చేయించుకోవడం అవసరం.

బరువులో ఊహించని మార్పులు:

పొట్ట భాగంలో ద్రవాలు చేరడం వల్ల కొంతమందిలో పొట్ట పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు. మరికొందరిలో ఆకలి తగ్గి అనుకోకుండా బరువు తగ్గిపోతారు. ఇటువంటి మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

"కొత్తగా మొదలై, వారానికి అనేకసార్లు కనిపిస్తూ, రెండు నుంచి మూడు వారాలకు పైగా తగ్గకుండా ఉండే లక్షణాల పట్ల మహిళలు శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఎవరికైనా అండాశయ లేదా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే ఆ సమాచారాన్ని వైద్యులతో పంచుకోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ రూపేందర్ సెఖోన్ పేర్కొన్నారు.

లక్షణాలను నోట్ చేసుకునే అలవాటు వైద్యులతో మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. లక్షణాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎంత తరచుగా కనిపిస్తున్నాయి, ఎంతసేపు ఉంటున్నాయి అనేది రాసుకోవడం వల్ల సరైన నిర్ధారణకు రావడం సులువవుతుంది.

నిర్ధారణ పరీక్షలు, ప్రమాద కారకాలు

అండాశయ క్యాన్సర్ అనుమానం ఉంటే పెల్విక్ పరీక్ష, ట్రాన్స్‌వజినల్ ఆల్ట్రాసౌండ్, రక్తంలో CA-125 ప్రొటీన్ స్థాయిలను గుర్తించే పరీక్షలను వైద్యులు సిఫార్సు చేస్తారు. అయితే కేవలం CA-125 పరీక్ష లేదా ఆల్ట్రాసౌండ్ మాత్రమే క్యాన్సర్‌ను ఖరారు చేయలేవు. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, లక్షణాల ఆధారంగానే తదుపరి పరీక్షలు నిర్ణయిస్తారు.

45 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, BRCA1, BRCA2 జన్యు ఉత్పరివర్తనాలు ఉన్నవారు, గర్భం దాల్చని వారు, ఎండోమెట్రియోసిస్ చరిత్ర ఉన్న మహిళల్లో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

లక్షణాలు నిరంతరం వేధిస్తుంటే సొంతంగా అంటాసిడ్ మాత్రలు వేసుకోవడం, ఆహార మార్పులకే పరిమితం కాకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన వైద్య సలహా పొందడం శ్రేయస్కరం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON