నాన్న ప్రాణం అమ్మే..: సోనియా పుస్తకావిష్కరణలో రాహుల్ భావోద్వేగం
సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' ఆవిష్కరణ సభలో రాహుల్ గాంధీ తన తల్లిదండ్రుల ప్రేమకథను, వారి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేంబ్రిడ్జ్ రెస్టారెంట్ జ్ఞాపకాల నుంచి క్యాన్సర్‌పై సోనియా పోరాటం వరకు రాహుల్ పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇవే.
రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ వాడివేడిగా కనిపించే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ రాసిన పుస్తకావిష్కరణ సభలో మాత్రం అత్యంత భావోద్వేగభరితంగా మాట్లాడారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ వేదికపై తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల మధ్య ఉన్న గాఢమైన ప్రేమను, వారి జీవితంలోని మధుర జ్ఞాపకాలను రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరించారు.

"అమ్మ ప్రాణం నాన్నే.. నాన్న ప్రాణం అమ్మే. మమ్మీ, నాన్న నిన్ను ఎంతో ప్రేమించారు. కానీ, ఈరోజు నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడతారో నేను మాటల్లో చెప్పలేను" అని రాహుల్ గాంధీ ఉద్వేగంతో అన్నారు.
కేంబ్రిడ్జ్ రెస్టారెంట్లో ఆసక్తికర అనుభవం
తన తల్లిదండ్రుల ప్రేమకథ మొదలైన లండన్‌లోని కేంబ్రిడ్జ్ 'వర్సిటీ' (Varsity) రెస్టారెంట్ జ్ఞాపకాలను రాహుల్ సరదాగా గుర్తుచేసుకున్నారు. తాను కేంబ్రిడ్జ్ వెళ్లినప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్భాన్ని వివరించారు.
"మా అమ్మానాన్నల ప్రేమ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో వర్సిటీ రెస్టారెంట్లో వారి మొదటి పరిచయం ఒకటి. చాలా ఏళ్ల తర్వాత నేను కేంబ్రిడ్జ్ వెళ్లినప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్‌తో 'పద, వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్దాం' అన్నాను. ఆ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటో ఆమెకు తెలియదు. అక్కడికి వెళ్లగానే పసుపు రంగు తలుపు నాకు ఇప్పటికీ గుర్తుంది. లోపల ఉన్న వ్యక్తి 'ఎంతమంది?' అని అడిగితే 'ఇద్దరం' అని చెప్పి కూర్చున్నాం" అని రాహుల్ తెలిపారు.
మెనూ చూస్తూ.. "మా అమ్మానాన్నలు ఇక్కడే కలుసుకున్నారని మీకు తెలుసా?" అని ఆ రెస్టారెంట్ వ్యక్తిని రాహుల్ అడిగారట. దానికి అతను "ఓహ్! వాళ్లు నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది" అని బదులిచ్చాడని రాహుల్ చెప్పారు. ఇక అక్కడ ఏం బాగుంటుందని అడిగితే 'చికెన్ ఛాసూర్' (Chicken Chasseur) అని చెప్పారని, అది తిన్నాక తనకు ఒక విషయం అర్థమైందని రాహుల్ నవ్వుతూ చెప్పారు. "మీరు ప్రేమలో పడాలనుకుంటే కచ్చితంగా వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి. కానీ, పొరపాటున కూడా అక్కడ చికెన్ ఛాసూర్ మాత్రం తినకండి.. ఆ వంటకం అస్సలు బాగోదు," అని రాహుల్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
నాన్న ఒడిలోనే అమ్మ భోజనం..
తన చిన్ననాటి రోజులను తలుచుకుంటూ, తల్లిదండ్రుల మధ్య ఉన్న అన్యోన్యతను రాహుల్ అద్భుతంగా వర్ణించారు. "ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు నాన్న కుర్చీలో కూర్చుంటే, నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందని చిన్నప్పుడు నేను అనుకునేవాడిని. అందుకే నా స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మానాన్నలు విడివిడిగా కూర్చోవడం చూసి.. 'ఏమైంది? మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోలేదు?' అని అమాయకంగా అడిగేవాడిని" అని రాహుల్ పంచుకున్నారు.
విధి విసిరిన పిడుగు.. మారిపోయిన అమ్మ
అంతటి సంతోషకరమైన తమ కుటుంబంపై విధి ఒక్కసారిగా పిడుగు వేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. "మాకు ఆధారమైన ఒకరిని (నానమ్మ ఇందిరా గాంధీ) తూటాలకు బలిచ్చాం. ఆ తర్వాత మా అతిపెద్ద ఆధారాన్ని (నాన్న రాజీవ్ గాంధీ) బాంబు పేలుడులో కోల్పోయాం. నాన్న దూరమయ్యాక అమ్మలో ఒక కొత్త ప్రయాణం మొదలైంది. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండే అమ్మ అదృశ్యమై, ఒక కొత్త అమ్మ వచ్చింది. ఎందుకంటే ఆమె జీవితంలో వెలుగు ఆరిపోయింది" అని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.
చాలామంది సోనియా గాంధీని అంతర్ముఖురాలిగా (Introvert) భావిస్తారని, కానీ ఆమె అస్సలు అలాంటి వారు కాదని రాహుల్ స్పష్టం చేశారు. నానమ్మ చనిపోయే వరకు అమ్మ అందరితో ఎంతో కలివిడిగా, ఏ విషయమైనా ధైర్యంగా మాట్లాడేదని చెప్పారు.
దేశ ప్రజలే ఆమెకు అండగా నిలిచారు
రాజీవ్ మరణం తర్వాత సోనియా ముందు భారత ప్రజల రూపంలో ఒక కొత్త ద్వారం తెరుచుకుందని రాహుల్ అన్నారు. "ద్వేషించే వారి గురించి నేను మాట్లాడటం లేదు. అమ్మ తన పుస్తకంలో ప్రస్తావించిన లక్షలాది మంది గ్రామస్తుల గురించి చెబుతున్నాను. వారంతా అమ్మ వైపు తిరిగి 'నువ్వు మా దానివి' అని అక్కున చేర్చుకున్నారు" అని ఆయన పేర్కొన్నారు.
నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించిన ధీర
సోనియా గాంధీ ఆరోగ్య పోరాటం గురించి రాహుల్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆమె రెండు లేదా మూడుసార్లు కాదు, ఏకంగా నాలుగుసార్లు క్యాన్సర్ మహమ్మారిని జయించారని తెలిపారు. "అమ్మ తన కష్టాలను ఎప్పుడూ తక్కువ చేసి చూపిస్తుంది. నా జీవితంలో ఏ ఒక్కరోజూ ఆమె భయపడటం కానీ, వెనకడుగు వేయడం కానీ నేను చూడలేదు" అని తన తల్లి ధైర్యాన్ని కొనియాడుతూ రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


