అటుకులు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సాధారణ పోహా ఉప్మా. అయితే, రోజువారీ టిఫిన్‌కు భిన్నంగా, సాయంత్రం వేళల్లో వేడివేడిగా ఏదైనా క్రిస్పీ స్నాక్ తినాలనిపిస్తే అటుకులతో కట్లెట్ ట్రై చేయవచ్చని ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ సంజీవ్ కపూర్ సూచిస్తున్నారు.

ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ దినుసులతోనే కేవలం అర గంట తయారీ సమయం, మరో 20 నిమిషాల వంట సమయంతో ఈ రుచికరమైన కట్లెట్లను సులువుగా చేసుకోవచ్చని ఆయన వివరించారు.
పోహా కట్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
- దొడ్డు అటుకులు - 1½ కప్పులు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు (కట్లెట్స్ షాలో ఫ్రైకి సరిపడా)
- ఆవాలు - ½ టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - ¼ టీస్పూన్
- కరివేపాకు - 8 నుంచి 10 ఆకులు
- పచ్చిమిర్చి తరుగు - 2
- ఉల్లిపాయ తరుగు - 1 (పెద్దది)
- పసుపు - ¼ టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉడికించి, తురిమిన బంగాళాదుంపలు - 2 (మధ్యస్థ పరిమాణం)
- వేయించిన పల్లీల పొడి - ¼ కప్పు
- కొత్తిమీర తరుగు - 2-3 టేబుల్ స్పూన్లు
- చక్కెర - ½ టీస్పూన్
- నిమ్మకాయ - సగం చెక్క
- గ్రీన్ చట్నీ - సర్వింగ్ కోసం
పోహా కట్లెట్ తయారీ విధానం
- ముందుగా అటుకులను జల్లెడలో (స్ట్రైనర్) వేసి నీటితో శుభ్రంగా కడిగి, 8 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
- నాన్ స్టిక్ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక జీలకర్ర, ఇంగువ వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిసెకన్ల పాటు వేయించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి పారదర్శకంగా మారే వరకు వేగనివ్వాలి. అందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
- ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళాదుంప గుజ్జు, వేయించిన పల్లీల ముక్కలు, కొత్తిమీర, చక్కెర వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా వేడెక్కే వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలపాలి. చివరిగా నిమ్మరసం పిండి, బాగా కలిపి చల్లారనివ్వాలి.
- మిశ్రమం చల్లారిన తర్వాత సమాన భాగాలుగా చేసుకుని, చేతితో ఉండలుగా చుట్టి, కట్లెట్ ఆకారంలో ఒత్తుకోవాలి.
- నాన్ స్టిక్ పాన్‌లో షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి. కట్లెట్లను అందులో వేసి రెండు వైపులా దొరగా, క్రిస్పీగా మారే వరకు వేయించాలి. వేగిన కట్లెట్లను టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనెను తొలగించాలి.
- వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని వేడివేడిగా గ్రీన్ చట్నీతో వడ్డిస్తే ఎంతో రుచికరమైన అటుకుల కట్లెట్ సిద్ధమవుతుంది.
షెఫ్ సంజీవ్ కపూర్ గురించి..
1964 ఏప్రిల్ 10న జన్మించిన సంజీవ్ కపూర్ భారతదేశపు ప్రసిద్ధ సెలబ్రిటీ షెఫ్, టీవీ ప్రెజెంటర్, రచయిత, వ్యాపారవేత్త. 1990లలో ప్రసారమైన ప్రముఖ వంటల కార్యక్రమం 'ఖానా ఖజానా'తో ఆయన ప్రతీ ఇంట్లో సుపరిచితులుగా మారారు. ప్రపంచవ్యాప్తంగా పలు రెస్టారెంట్లను ప్రారంభించిన ఆయన, భారత పాకశాస్త్ర రంగానికి చేసిన సేవలకుగానూ 2017లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.