తల్లిగా ఉండటం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని.. గ్లోబల్ సింగర్ షకీరా మనసులో మాట
గ్లోబల్ పాప్ స్టార్ షకీరా మొన్న ఫిబ్రవరి 2న తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాతృత్వంపై గతంలో ఆమె పంచుకున్న అభిప్రాయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. సెలబ్రిటీ హోదాలో ప్రపంచ నాయకులను కలవడం కంటే, ఇంట్లో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించడమే పెద్ద సవాల్ అని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను తన పాటలతో, డ్యాన్స్‌తో ఉర్రూతలూగించే కొలంబియన్ సింగర్ షకీరా ఫిబ్రవరి 2న తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. వేదికపై అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో కనిపించే షకీరా, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక సామాన్య తల్లిలాగే ఎన్నో ఆందోళనలకు గురవుతానని గతంలో వెల్లడించారు. మాతృత్వం గురించి ఆమె పంచుకున్న ఆలోచనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి.

ప్రపంచ వేదికల కంటే పేరెంటింగే కష్టం!
షకీరా తన వృత్తిపరమైన జీవితంలో ఎందరో దేశాధ్యక్షులను కలిశారు. లక్షలాది మంది ముందు ప్రదర్శనలు ఇచ్చారు. అయితే, వీటన్నింటికంటే తనను ఎక్కువగా భయపెట్టేది, ఆలోచింపజేసేది 'పేరెంటింగ్' మాత్రమేనని ఆమె 2015లో ఒక చర్చా వేదికపై నిర్మొహమాటంగా చెప్పారు. "తల్లిగా ఉండటం అస్సలు సులభం కాదు. నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన పనులలో ఇది ఒకటి" అని ఆమె పేర్కొన్నారు.
సెర్చ్ ఇంజన్లే ఆమెకు గురువులు..
షకీరా తనను తాను ఒక 'టైగర్ మామ్' (పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే తల్లి)గా అభివర్ణించుకున్నారు. పిల్లల పెంపకంలో తనకు ఎదురయ్యే సందేహాల కోసం ఆమె గంటల తరబడి ఇంటర్నెట్‌లో వెతుకుతారట. "నేను నిరంతరం ఆన్‌లైన్‌లో సమాచారం కోసం వెతుకుతుంటాను, చదువుతుంటాను. అత్యంత డిమాండ్ చేసే ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇచ్చేటప్పుడు కూడా నేను ఇంతలా ఆత్మన్యూనతకు లోనవ్వలేదు. కానీ తల్లిగా మాత్రం, నేను చేస్తున్నది సరైనదేనా? అని ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఈ బాధ్యతలో రాణించాలని ఆశిస్తున్నాను" అని ఆమె వివరించారు.
సెలబ్రిటీ అయినా.. సవాళ్లు సామాన్యమే
షకీరా మాటలు విన్న ఎవరికైనా ఒక విషయం స్పష్టమవుతుంది. ఎంతటి స్టార్ సెలబ్రిటీకైనా పిల్లల పెంపకంలో ఉండే సవాళ్లు, ఆందోళనలు సామాన్యులలాగే ఉంటాయని ఆమె నిరూపించారు. 'అన్నీ మాకు తెలుసు' అన్నట్లుగా కాకుండా, తానూ పొరపాట్లు చేస్తానని, నేర్చుకుంటానని ఆమె చెప్పడం చాలా మంది పేరెంట్స్‌కు ఊరటనిచ్చే అంశం.
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు..
షకీరా వ్యక్తిగత జీవితం గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పీకేతో విడిపోయిన తర్వాత, 2023లో ఆమె తన ఇద్దరు కుమారులు మిలన్, సాషాలతో కలిసి బార్సిలోనా నుండి మయామికి మారారు. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 గ్రామీ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై కూడా ఆమె తన కుమారులతో కలిసి కనిపించి, తన ప్రాధాన్యత ఎప్పుడూ పిల్లలేనని చాటిచెప్పారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


