సిద్ధార్థ్ మల్హోత్రా ‘సీక్రెట్’ బ్రేక్ ఫాస్ట్: ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా 41వ పుట్టినరోజు నేడు. ముంబైలో తన కెరీర్ తొలినాళ్లలో, తక్కువ ఖర్చుతో కూడిన చిలగడదుంపను (Sweet Potato) తన నిత్య ఆహారంగా తీసుకునేవాడినని, అదే తన ఫిట్‌నెస్‌కు పునాది అని ఆయన వెల్లడించారు. ఆ విశేషాలు మీకోసం..
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నేడు (జనవరి 16) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఆయన కనిపించే తీరు, ఆ కటౌట్, పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ కుర్రకారుకు ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్. అయితే, అద్భుతమైన శరీరాకృతిని సాధించాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించడమే కాదు, మనం ఏం తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. చాలామంది ఫిట్‌నెస్ అంటే ఖరీదైన డైట్ అని భావిస్తారు. కానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తన కెరీర్ ప్రారంభంలో పాటించిన డైట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అతి తక్కువ ధరలో లభించే ఒక సాధారణ ఆహారంతో ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు.

ముంబై ‘స్ట్రగుల్’ రోజుల్లో ఆ పేటెంట్ బ్రేక్ ఫాస్ట్
ముంబై లాంటి మహానగరంలో కొత్తగా అడుగుపెట్టిన నటులకు ఆడిషన్ల చుట్టూ తిరగడం, షూటింగ్‌ల కోసం వేచి చూడటం ఒక పెద్ద సవాలు. అప్పట్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా, ఆరోగ్యం విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదని సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు. 2022లో బీబీసీ హిందీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ‘పేటెంట్ బ్రేక్ ఫాస్ట్’ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"నేను ముంబైకి కొత్తగా వచ్చిన రోజుల్లో చిలగడదుంప (Sweet Potato) ఎక్కువగా తినేవాడిని. అది నా పర్మనెంట్ బ్రేక్ ఫాస్ట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అందడమే కాకుండా, అది చాలా చౌకగా లభించేది" అని సిద్ధార్థ్ వివరించారు.
చిలగడదుంపతో ఎన్ని లాభాలో తెలుసా?
సిద్ధార్థ్ మల్హోత్రా ఎంచుకున్న ఈ డైట్ హ్యాక్ ఎంత గొప్పదో నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. ప్రముఖ డైటీషియన్ అర్చన బాత్రా దీనిపై స్పందిస్తూ.. "చిలగడదుంపలు కేవలం రుచి కోసమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, పేగు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం (Fibre) ఆకలిని నియంత్రించి, బరువు పెరగకుండా చూస్తుంది" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇందులో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించడానికి ఎంతో తోడ్పడతాయి. 2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, బంగాళదుంపల కంటే చిలగడదుంపలనే ఉత్తమమైన ‘సూపర్ ఫుడ్’గా గుర్తించడం విశేషం.
(గమనిక: ఈ కథనంలోని సమాచారం సోషల్ మీడియా, గత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత అవసరాలను బట్టి డైటీషియన్ లేదా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.)

E-Paper












