గ్యాస్ట్రిక్ క్యాన్సర్: నిశబ్దంగా మొదలై ప్రాణాంతకంగా మారేందుకు కారణాలు, లక్షణాలు
ఆసియాలో సర్వసాధారణంగా కనిపించే క్యాన్సర్లలో కడుపులో క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) ఒకటి. భారతదేశంలో ఇది ఏడో అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు 64,000 కేసులు నమోదవుతున్నాయి. ప్రారంభ దశలో లక్షణాలు బయటపడకపోవడంతో, దీనిని గుర్తించేసరికి ముదిరిపోతుంది.
ఆసియా ఖండంలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో జీర్ణాశయం లేదా కడుపులో క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) ఒకటి. భారతదేశంలో అయితే, సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ఇది ఏడవ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 64 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ క్యాన్సర్ ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా నెమ్మదిగా, సైలెంట్‌గా మొదలై, గుర్తించే సమయానికి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కి చేరుకుంటుంది. అందుకే, దీనికి కారణాలు, ముందుగానే తెలియజేసే సంకేతాలు, నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అత్యవసరం.

కడుపు క్యాన్సర్‌కు దారితీసే జీవనశైలి అలవాట్లు
మన రోజువారీ అలవాట్లే కడుపులో క్యాన్సర్ రిస్క్‌ను పెంచే ప్రధాన కారకాలు. అందులోనూ మరీ ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
1. ఆహారపు అలవాట్లు
ప్రిజర్వేటివ్స్, ఉప్పు అధికంగా: పులుపు, ఉప్పు ఎక్కువగా వేసిన ఆహారం, కాల్చిన (బార్బెక్యూడ్), పొగబెట్టిన (స్మోక్డ్) పదార్థాలు, ఆవకాయ లాంటి ఊరగాయలు ఎక్కువగా తీసుకోవడం. వీటిలో ఉండే నైట్రేట్స్ / నైట్రైట్స్ జీర్ణాశయ పొరను (లైనింగ్‌ను) పాడు చేస్తాయి. ఇది క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
ప్రాసెస్డ్ ఫుడ్: ఎక్కువగా ప్రాసెస్డ్ మీట్స్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది.
యాంటీఆక్సిడెంట్ల కొరత: మరోవైపు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, కాయగూరలను తక్కువగా తీసుకోవడం వల్ల కణాలు దెబ్బతిన్నప్పుడు వాటిని రిపేర్ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది.
2. హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్
కడుపులో తరచూ వచ్చే హెలీకోబ్యాక్టర్ పైలోరి (H. pylori) ఇన్ఫెక్షన్ మరో ప్రధాన కారణం. ఇది కడుపులో మంటను (ఇన్‌ఫ్లమేషన్) పెంచుతుంది. సరైన చికిత్స తీసుకోకుండా ఏళ్ల తరబడి ఉంటే, ఇది అల్సర్లకు, ఆ తర్వాత క్యాన్సర్‌కు మారే అవకాశం ఉంది.
3. పొగతాగడం, మద్యం
స్మోకింగ్: ఇది రిస్క్‌ను రెట్టింపు చేస్తుంది. ఇది కడుపులోని కణాలను డ్యామేజ్ చేసి, హానికరమైన రసాయనాలు ఏర్పడేలా చేస్తుంది.
ఆల్కహాల్: అధిక మోతాదులో మద్యం సేవించడం.
4. ఇతర జీవనశైలి కారకాలు
- ఊబకాయం (Obesity).
- వ్యాయామం లేకపోవడం.
- వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ (ఫ్యామిలీ హిస్టరీ)
చాలా కేసులు జీవనశైలి అలవాట్ల వల్లే వస్తున్నప్పటికీ, కొంత శాతం మాత్రం వంశపారంపర్య కారణాలతో కూడా సంభవిస్తాయి.
ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్: అమ్మ, నాన్న, అన్న/చెల్లి వంటి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఎవరికైనా కడుపులో క్యాన్సర్ చరిత్ర ఉంటే, మిగిలిన వారికి రిస్క్ పెరుగుతుంది.
జన్యుపరమైన కండిషన్స్: HDGC (హెరిడిటరీ డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్), లించ్ సిండ్రోమ్ (Lynch Syndrome), FAP (ఫెమిలియల్ ఎడినోమాటస్ పోలీపోసిస్) వంటి వంశపారంపర్య కండిషన్స్ ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
జీన్ మ్యుటేషన్స్: CDH1 లాంటి జన్యువులలో మార్పులు (మ్యుటేషన్స్) ఉంటే చిన్న వయస్సులోనే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
కుటుంబ వాతావరణం: కొన్ని కుటుంబాల్లో జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పొగ తాగడం వంటివి ఒకేలా ఉండటం కూడా రిస్క్‌ను పెంచేస్తుంది.
కుటుంబ చరిత్ర ఉన్నవారికి క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి ఎర్లీ స్క్రీనింగ్ పరీక్షలను వైద్యులు సిఫార్సు చేస్తారు.
స్టమక్ క్యాన్సర్ లక్షణాలు
ప్రారంభంలో, ఈ క్యాన్సర్ లక్షణాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. పెద్దగా గుర్తించదగిన సంకేతాలు కనిపించవు.
ప్రారంభ లక్షణాలు
- తరచూ అజీర్ణం, గ్యాస్ ట్రబుల్.
- కడుపులో మంట (బర్నింగ్ సెన్సేషన్).
- కొద్దిగా తిన్నా వెంటనే కడుపు నిండినట్లు (ఫుల్‌గా) అనిపించడం.
- పొట్టలో అసౌకర్యం.
అడ్వాన్స్‌డ్ లక్షణాలు
- ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం.
- ఎక్కువగా అలసట, బలహీనత.
- కడుపులో తిప్పడం, వాంతులు (కొన్నిసార్లు రక్తపు వాంతులు).
- మింగడంలో ఇబ్బంది.
- అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) సంకేతంగా నల్లగా, దుర్వాసనతో కూడిన మలం (స్టూల్స్).
తరువాతి దశలో, రోగికి కామెర్లు, పొత్తికడుపులో గడ్డలు లేదా ఉదరంలో నీరు చేరడం (అసిటిస్) వంటివి రావొచ్చు. ఇలాంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
కడుపు క్యాన్సర్‌కు చికిత్సా విధానాలు
క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని రకం ఏమిటి, కడుపులో అది ఎక్కడ ఉంది అనే అంశాల ఆధారంగా చికిత్సా విధానం నిర్ణయిస్తారు.
సర్జరీ (శస్త్ర చికిత్స): ప్రారంభ దశ క్యాన్సర్‌కు సర్జరీ ప్రధాన చికిత్సా విధానం. క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాన్ని లేదా కొన్నిసార్లు కడుపు మొత్తాన్ని తొలగిస్తారు.
ఈ సర్జరీల్లో ఓపెన్, లాపరోస్కోపిక్, రోబోటిక్ వంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి.
కీమోథెరపీ & రేడియేషన్: ముదిరిన కేసుల్లో, ట్యూమర్‌ను తగ్గించడానికి, మళ్లీ రాకుండా నివారించడానికి సర్జరీతో పాటు కీమో లేదా రేడియేషన్ థెరపీని చేస్తారు. మరింత అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో, ప్రాణాలు కాపాడడానికి HIPEC చికిత్సను కూడా కలిపి చేస్తారు.
టార్గెటెడ్ థెరపీ & ఇమ్యూనోథెరపీ: ఇవి కచ్చితత్వంతో నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయి. వీటి ద్వారా తక్కువ దుష్ప్రభావాలతో క్యాన్సర్ కణాలను నాశనం చేయవచ్చు.
ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్: ఎండోస్కోపిక్ మ్యుకోసల్ రిసెక్షన్ (EMR) లాంటి పద్ధతులు క్యాన్సర్ ప్రాథమిక దశలో చాలా మంచి ఫలితాలను ఇస్తాయి.
ప్రతి కేసుకూ చికిత్స పద్ధతి మారుతూ ఉంటుంది, అంటే అది ఒక వ్యక్తిగత ప్లాన్ (Personalized Plan) అన్నమాట. ఏ చికిత్స మంచిది అనేది పేషెంట్ పరిస్థితిని బట్టి, నిపుణులైన మల్టీడిసిప్లినరీ టీమ్ నిర్ణయిస్తుంది.
నివారణ చర్యలు
అన్ని కేసుల్లోనూ నివారణ మన చేతుల్లో లేనప్పటికీ, చాలావరకు తగిన జాగ్రత్తలతో రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
ఆహారంలో మార్పులు: తాజా పళ్లు, కాయగూరలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
నివారించాల్సినవి: ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం. పొగ మానేయడం, మద్యం సేవనాన్ని అదుపులో ఉంచుకోవడం.
జీవనశైలి: ఆరోగ్యకరమైన బరువును, చురుకైన జీవనశైలిని (Active Lifestyle) కొనసాగించడం.
ఇన్ఫెక్షన్‌కు చికిత్స: H. pylori ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా చికిత్స తీసుకోవడం.
స్క్రీనింగ్: ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా ఎండోస్కోపిక్ స్క్రీనింగ్ చేయించుకోవడం.
మీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించడం (Early Detection) సాధ్యమవుతుంది. సమయానికి కనుగొంటే, చికిత్స ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
- డా. వి. ధర్మేంద్ర కుమార్,
హెచ్.ఓ.డి & చీఫ్ కన్సల్టెంట్,
సర్జికల్ ఆంకాలజీ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ













