40 ఏళ్లు దాటాక ENT చెకప్ ఎందుకు తప్పనిసరి? నిపుణుల సలహా
వయసు 40 దాటిన తర్వాత వినికిడి లోపం, సైనస్ సమస్యలు, గొంతు మార్పులు సహజంగా కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. రెగ్యులర్ ENT (చెవి, ముక్కు, గొంతు) స్క్రీనింగ్ ఎందుకు ముఖ్యమో, సమస్యలు ఎలా గుర్తించవచ్చో ప్రముఖ ENT నిపుణులు డా. వెంకట కృష్ణ సందీప్ వివరించారు.
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో బయటకు కనిపించే మార్పులతో పాటు, లోపలి అవయవాల పనితీరులో కూడా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తరువాత చెవులు, ముక్కు, గొంతు (ENT) సమస్యలు రావడం చాలా సాధారణం. వయస్సు, జీవనశైలి, అలవాట్లు, పర్యావరణ ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.

మొదట్లోనే సమస్యలను గుర్తించడానికి, సకాలంలో చికిత్స అందించడానికి రెగ్యులర్ ENT స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే, కొన్ని సాధారణ లక్షణాలు కూడా తీవ్రమైన వ్యాధులకు ప్రారంభ సూచికలు కావచ్చు.
1. వినికిడి శక్తి తగ్గిపోవడం (ప్రెస్‌బైక్యూసిస్)
40 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే సమస్యల్లో ఒకటి ప్రెస్‌బైక్యూసిస్ (Presbycusis) అని పిలిచే శాశ్వత వినికిడి లోపం. ఇది క్రమంగా మొదలై, చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుంది.
ప్రధాన లక్షణాలు:
- శబ్దం ఎక్కువగా ఉన్న చోట సంభాషణను వినడంలో ఇబ్బంది పడటం.
- టీవీ లేదా రేడియో వాల్యూమ్‌ను ఎప్పుడూ ఎక్కువగా పెట్టుకోవడం.
- కొన్ని శబ్దాలు వినిపించకపోవడం లేదా సరిగా అర్థం చేసుకోలేకపోవడం.
ఈ లక్షణాలను కేవలం 'సాధారణ వినికిడి సమస్య'లే అని నిర్లక్ష్యం చేస్తే, అది కమ్యూనికేషన్ లోపం, మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రెగ్యులర్ చెవి పరీక్షలతో దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి, హియరింగ్ ఎయిడ్ వాడకం లేదా జీవనశైలి మార్పుల ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
2. ముక్కు, సైనస్ సమస్యలు పెరగడం
వయసుతో పాటు రోగనిరోధక శక్తి తగ్గడం, పర్యావరణ కాలుష్యం కారణంగా దీర్ఘకాలిక సైనసైటిస్, ముక్కులో పోలిప్స్, అలర్జీలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
- తరచుగా ముక్కు బ్లాక్ అవ్వడం (Nasal Blockage).
- ముక్కు నుండీ తరచూ రక్తస్రావం కావడం (Epistaxis) వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదు.
ఈ లక్షణాలు కొన్ని సందర్భాల్లో ముక్కుకు సంబంధించిన ట్యూమర్‌లకు (కణితులకు) కూడా ప్రారంభ సూచిక కావచ్చు. క్రమం తప్పకుండా ENT చెకప్ చేయించుకోవడం వల్ల వీటిని ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవచ్చు.
3. గొంతు, వాయిస్‌లో మార్పులు
గొంతు గరగరలాడటం, తరచూ గొంతు క్లియర్ చేసుకోవడం, మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలు పదేపదే వస్తున్నా, దీర్ఘకాలం అలాగే ఉన్నా తప్పక వైద్యుడిని సంప్రదించాలి.
ఈ లక్షణాలు:
- యాసిడ్ రిఫ్లక్స్ (Gastroesophageal Reflux Disease - GERD).
- స్వరపేటిక (వోకల్ కార్డ్) కి గాయం.
- లేదా, గొంతు క్యాన్సర్ ప్రారంభ దశకు సంకేతాలు కావచ్చు.
- ENT కన్సల్టేషన్‌లో చేసే లారింగోస్కోపీ వంటి పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి, సమస్య పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
4. క్యాన్సర్ స్క్రీనింగ్ ఆవశ్యకత
పొగ తాగే వారు, మద్యం ఎక్కువగా సేవించే వారు, హానికారక రసాయనాల (కార్సినోజెన్స్) మధ్య పనిచేసే వారికి తల, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. క్రమం తప్పకుండా ENT చెకప్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన అసాధారణ కణాల వృద్ధిని లేదా మచ్చలను ముందుగా గుర్తించవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే, చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
5. తల తిరుగుడు, బ్యాలెన్స్ సమస్యలు
వయస్సు పెరుగుతున్నప్పుడు లోపలి చెవి పనితీరు తగ్గిపోవడం వల్ల తల తిరగడం (Vertigo) లేదా బ్యాలెన్స్ కోల్పోవడం (Dizziness) వంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల కిందపడిపోయి గాయపడే ప్రమాదం ఉంది. ENT నిపుణులు చేసే వెస్టిబ్యులర్ ఫంక్షన్ టెస్టులు ఈ సమస్యలకు కారణాన్ని గుర్తించి, సరైన చికిత్స మార్గాన్ని చూపిస్తాయి.
చివరి మాట
40 ఏళ్లు దాటిన తర్వాత ENT ఆరోగ్యం మన మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చెవులు, ముక్కు, గొంతు బాగానే ఉన్నా కూడా, సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు ENT చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ముందు జాగ్రత్తతో మనం సమస్యలను రాకుండా అడ్డుకోగలం. ఈ రోజు మనం తీసుకునే జాగ్రత్తలు, రేపు ఆరోగ్యంగా, చురుకుగా జీవించడానికి ఎంతో తోడ్పడతాయి.
- డా. వెంకట కృష్ణ సందీప్,
కన్సల్టెంట్ - ENT, హెడ్ & నెక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్,
మణిపాల్ హాస్పిటల్, విజయవాడ













