బోటు మునిగి 109 మంది వలసదారులు మృతి.. 116 మంది గల్లంతు

ఆఫ్రికా దేశమైన జిబౌటి తీరంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 109 మంది వలసదారులు మరణించగా.. మరో 116 మంది గల్లంతయ్యారు.

Published on: Oct 11, 2026, 18:32:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆఫ్రికా దేశమైన జిబౌటి తీరంలో చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదంలో 109 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. మృతుల్లో 15 మంది చిన్నారులు (తొమ్మిది మంది బాలికలు, ఆరుగురు బాలురు), 52 మంది పురుషులు, 42 మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ 8-9 మధ్యరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంలో మరో 116 మంది గల్లంతైనట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం (istock image)
ప్రతీకాత్మక చిత్రం (istock image)

జిబౌటిలోని ఒబోక్ పట్టణానికి ఉత్తర దిశలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 305 మంది ప్రయాణికులతో జిబౌటి నుంచి యెమెన్ బయలుదేరిన బోటు సముద్రంలో మునిగిపోవడంతో ఈ విపత్తు సంభవించింది. బోటులోని ప్రయాణికుల్లో 80 మందికి పైగా సురక్షితంగా బయటపడగా, వారిలో ఎక్కువ మంది ఇథియోపియా దేశస్థులే ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) బృందాలు జిబౌటి అధికారులతో కలిసి ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఒబోక్‌లోని మైగ్రెంట్ సెంటర్‌లో ప్రస్తుతం 64 మంది బాధితులకు అత్యవసర సాయం, వైద్యం అందిస్తున్నారు. గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం జిబౌటి అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

ఈ విషాదంపై జిబౌటి ఐఓఎమ్ మిషన్ చీఫ్ అలెక్సాండర్ కొయిసాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. 'మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా యెమెన్, ఆపై గల్ఫ్ దేశాలకు వెళ్లే క్రమంలో వలసదారులు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.' అని ఆయన వ్యాఖ్యానించారు.

పేదరికం, అంతర్గత భద్రతా సమస్యలు, వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా ప్రతి ఏటా లక్షలాది మంది ఆఫ్రికన్ వలసదారులు ఇథియోపియా, సోమాలియా నుంచి ఈ ప్రమాదకర సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, విపరీతమైన అస్థిరత మధ్య కూడా ఈ ప్రయాణాలు సాగుతుండటం గమనార్హం. ప్రస్తుతం యెమెన్‌లో సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వానికి, ఇరాన్ మద్దతు తెలిపే హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతోంది. పొట్టకూటి కోసం వలసదారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

అంతర్జాతీయ వలసల సంస్థ నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఒక్క ఇథియోపియా నుంచే 1,78,000 మందికి పైగా ప్రయాణికులు జిబౌటికి చేరుకున్నారు. మార్చి 2026లో జరిగిన మరో బోటు ప్రమాదంలో 9 మంది మరణించగా 45 మంది గల్లంతయ్యారు.

గతేడాది యెమెన్ వెళ్లే సముద్ర మార్గంలో 900 మందికి పైగా వలసదారులు మరణించడం లేదా గల్లంతవ్వడం జరిగింది. ఈ మార్గంలో ప్రయాణించే వారి సంఖ్య ఒకే ఏటా 18 శాతం పెరిగింది. ప్రస్తుతం వేలాది మంది వలసదారులు మధ్యలోనే చిక్కుకుపోతున్నారని, రెస్క్యూ ఆపరేషన్లతో పాటు బాధితులకు ప్రాణరక్షణ కల్పించేందుకు అంతర్జాతీయ దాతలు, భాగస్వామ్య దేశాలు తక్షణమే జిబౌటికి ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని పెంచాలని IOM అధికార ప్రతినిధి కెన్నడీ ఒమోండి ఒకొత్ విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More