సుప్రీంకోర్టులో తన కేసును తానే వాదించుకుని గెలిచిన 19ఏళ్ల యువకుడు!
మధ్యప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది తన ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి విజయం సాధించారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలులో వైఫల్యంపై ఆయన చేసిన పోరాటం, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు మీకోసం.
ఈ ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సాక్షింగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ కార్యకలాపాలు ముగించి లేవబోతుండగా.. ఒక యువ వారికి గొంతు వినబడింది. "మరో పది నిమిషాలు సమయం ఇవ్వండి" అని ఆ గొంతు అభ్యర్థించింది. ఆ అభ్యర్థన చేసింది ఏ సీనియర్ లాయరో, రాజ్యాంగ నిపుణుడో కాదు.. జబల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది. 12వ తరగతి పూర్తి చేసిన అథర్వ లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా డాక్టర్ కావాలని.

ఆ పది నిమిషాల వాదన చరిత్రను మార్చేసింది! రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించిన సుప్రీంకోర్టు.. నీట్ అర్హత సాధించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రొవిజనల్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అథర్వకు ఇది కేవలం న్యాయపోరాట విజయం మాత్రమే కాదు, ఊపిరి కోల్పోతున్న తన ఆశయానికి దక్కిన సంజీవని!
ఎవరీ అథర్వ?
సాధారణంగా కోర్టుల్లో కేసులు వాదించే వారిలా అథర్వ సీరియస్‌గా ఉండరు. ఖాళీ దొరికితే ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ చూస్తారు. అటు ఇంజినీరింగ్, ఇటు మెడికల్ ఎంట్రన్స్‌లు రెండింటిలోనూ సీట్లు సాధించారు. కానీ, ఆయన మనసు మాత్రం వైద్య వృత్తిపైనే ఉంది.
నీట్ పరీక్షలో 530 మార్కులు సాధించి రెండుసార్లు అర్హత సాధించినప్పటికీ, ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో అథర్వకు సీటు దక్కలేదు. జబల్‌పూర్ హైకోర్టులో తన వాదనలు వినిపిస్తున్నప్పుడు, అక్కడి జడ్జి అథర్వ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. "నువ్వు తప్పుడు వృత్తిని ఎంచుకున్నావు, డాక్టర్ కంటే గొప్ప లాయర్ అవుతావు" అని సరదాగా వ్యాఖ్యానించారు. కానీ అథర్వకు తనేం చేయాలో స్పష్టమైన అవగాహన ఉంది.
లాక్‌డౌన్ నేర్పిన పాఠం
అథర్వ తండ్రి మనోజ్ చతుర్వేది న్యాయవాదే అయినప్పటికీ, ఆయనకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభవం లేదు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కోర్టులు వర్చువల్‌గా మారడం ఈ కుటుంబానికి ఒక వరమైంది.
"నా కొడుకు ఎప్పుడూ లా చదవలేదు. కానీ ఆన్‌లైన్ కోర్టు విచారణలను గమనిస్తూ.. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, పిటిషన్లు ఎలా స్కాన్ చేయాలి అనేవన్నీ నేర్చుకున్నాడు. నిజానికి నాకే తను సాంకేతిక విషయాలు నేర్పించాడు," అని మనోజ్ గర్వంగా చెబుతారు.
లోకం మొత్తం జూమ్ మీటింగులతో కుస్తీ పడుతుంటే, అథర్వ మాత్రం సుప్రీంకోర్టు వెబ్‌సైట్ నుంచి పిటిషన్ ఫార్మాట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పాత తీర్పులను అధ్యయనం చేస్తూ తన సొంత 'స్పెషల్ లీవ్ పిటిషన్' సిద్ధం చేసుకున్నారు.
దిల్లీకి వెళ్లి రావడానికి అయ్యే ప్రయాణ, వసతి ఖర్చులను భరించలేక, జబల్‌పూర్ నుంచే ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసి, రిజిస్ట్రీ అభ్యంతరాలను స్వయంగా సరిదిద్దారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఒక కీలక విషయాన్ని గమనించింది. అభ్యర్థికి అర్హత ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్ పాలసీని నోటిఫై చేయకపోవడం వల్ల విద్యార్థికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేసింది. అథర్వ వాదనలు విన్న కేవలం పది నిమిషాల్లోనే, 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రొవిజనల్ అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది.
విజయం సరే.. ఫీజు మాటేమిటి?
న్యాయ పోరాటంలో గెలిచినప్పటికీ, మధ్యతరగతి కుటుంబం ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచి ఉంది. ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఫీజు ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదు. వారం రోజుల్లోగా కాలేజీ కేటాయించాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ఫీజుల భారం తమ స్థాయికి మించి ఉంటుందేమోనని అథర్వ తండ్రి ఆందోళన చెందుతున్నారు.
మహర్షి స్కూల్‌లో చదువుతూ మ్యాథ్స్, బయాలజీ వంటి కష్టమైన సబ్జెక్టులను అలవోకగా నేర్చుకున్న అథర్వ, నేడు ఒక పక్క బయాలజీ పాఠాలు, మరోపక్క న్యాయ కోవెల తీర్పుల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు.
హైకోర్టు జడ్జి అన్నట్లు ఆయన తప్పుడు వృత్తిలో లేరు.. అన్యాయాన్ని ఎలా ఎదిరించాలో తెలిసిన ఒక కాబోయే డాక్టర్ ఆయన. సమాజానికి కావాల్సింది కూడా ఇలాంటి వైద్యులే కదా!

E-Paper












