...
...
Next Story

అమెరికా కల.. అప్పుల ఊబి: పిల్లల భవిష్యత్తు కోసం ఆ తండ్రి పోరాటం

తమ పిల్లల అమెరికా చదువుల కోసం రూ. 2 కోట్ల అప్పు చేసిన ఓ తండ్రి ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల తన కుమారులు ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే, అప్పుల పెరుగుతున్నప్పటికీ, వారిని కాపాడుకోవడానికి ఆయన పడుతున్న తపన హృదయవిదారకంగా మారింది.

Published on: Jan 18, 2026, 11:23:16 IST
Advertisement

అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుని, అక్కడే స్థిరపడాలనే కలలు కనే భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రస్తుత పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు వేలాది మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తండ్రి పడుతున్న ఆవేదన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రూ. 2 కోట్ల అప్పు.. పెరిగిన భారం..

అమెరికా కలలు- అప్పుల ఊబి.. (File photo/Representative image)
అమెరికా కలలు- అప్పుల ఊబి.. (File photo/Representative image)

విశాఖపట్నానికి చెందిన ఆదిత్య అనే పారిశ్రామికవేత్త తన స్నేహితుడి కుటుంబం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. తన ఆర్థిక స్తోమతకు మించి, కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే ఆ తండ్రి ఇద్దరు కుమారులను అమెరికా పంపారని, కానీ, నేడు ఆ నిర్ణయం ఆ కుటుంబాన్ని తీరని కష్టాల్లోకి నెట్టిందని ఆదిత్య చెప్పుకొచ్చారు.

పిల్లలు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసే సమయానికి ఆ తండ్రిపై ఉన్న అప్పు రూ. 1.5 కోట్లు. సాధారణంగా చదువు పూర్తయ్యాక హెచ్​-1బీ వీసాపై ఉద్యోగం సంపాదించి అప్పు తీర్చవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ ఇద్దరు యువకులకు ఉద్యోగాలు దొరకడం గగనమైపోయింది.

"మొదట్లో వారి పార్ట్-టైమ్ సంపాదనకు తోడుగా తండ్రి నెలకు లక్ష రూపాయలు పంపేవారు. అయితే ట్రంప్ నిర్ణయాల తర్వాత పరిస్థితి మారింది. పిల్లలను పార్ట్-టైమ్ ఉద్యోగాలు వదిలేయమని చెప్పి, తన అప్పును రూ. 2 కోట్లకు పెంచుకుంటూనే నెలకు రూ. 2 లక్షలు పంపడం మొదలుపెట్టారు," అని ఆదిత్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫ్లాట్ అమ్మేందుకు సిద్ధం..

ఇది కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు, అమెరికా వెళ్లే వారిలో చాలా మంది ఎదుర్కొంటున్న చేదు నిజం.

"ఇదొక భయానక పరిస్థితి. ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకుంటున్నారు" అని ఆదిత్య ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న ఊరట.. కానీ ఆందోళన అలాగే!

అదృష్టవశాత్తూ, పెద్ద కుమారుడు ఇటీవలే హెచ్​-1బీ లాటరీలో ఎంపికై, ఒక ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని సంపాదించాడు. జీతం తక్కువైనా, కనీసం తండ్రిపై ఆధారపడకుండా తన ఖర్చులు తను చూసుకోగలుగుతున్నాడు.

అయితే, స్తోమత లేకపోయినా అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఆదిత్య కోరారు. "బయట ఉండి తీర్పులు చెప్పడం సులభమే కానీ, అటు ఉద్యోగాలు లేని మార్కెట్, ఇటు పెరుగుతున్న అప్పుల మధ్య నలిగిపోతున్న ఆ యువకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిపై జాలి చూపాలి. తల్లితండ్రులు కూడా పిల్లలను పై చదువులకు పంపించేటప్పుడు ఆలోచించాలి," అని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks