Canada shooting : కెనడాలో కాల్పుల మోత! ఇద్దరు బలి- ముగ్గురికి గాయాలు..
Toronto street festival shooting : కెనడాలోని టొరంటో నగరంలో శనివారం రాత్రి ఘోర కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
కెనడాలో మరోసారి కాల్పుల మోత మోగిపోయింది టొరంటో నగరంలోని ఒక ప్రముఖ వ్యాపార సముదాయం, రెస్టారెంట్లు ఉన్న సెయింట్ క్లెయిర్ వీధిలో స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘోర ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికంగా ఒక డాన్స్ ఫెస్టివల్ (సల్సా వేడుకలు) జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. వారాంతపు వేడుకల ఉత్సాహంలో ఉన్న ఆ ప్రాంతం అంతా క్షణాల వ్యవధిలో రక్తసిక్తంగా మారింది!
కెనడా కాల్పుల ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాలను అధికారులు చెప్పాల్సి ఉంది.
రంగంలోకి దిగిన పోలీసులు.. హై అలర్ట్
కాల్పుల ఘటన జరిగిన వెంటనే టొరంటో పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. "ప్రజలు ఎవరూ ఈ ప్రాంతానికి రావద్దు. పోలీసుల సూచనలను ఖచ్చితంగా పాటించండి," అని టొరంటో పోలీస్ విభాగం సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. కాగా, దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు, ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తెచ్చినట్లు అధికారులు ఆ తర్వాత ప్రకటించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కెనడాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి!
ఒకప్పుడు శాంతిభద్రతలకు మారుపేరుగా ఉండే కెనడాలో ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత నెల చివర్లో మాంట్రియల్ నగరంలో జరిగిన ఇలాంటి ఘోర కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ సమయంలో జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఆ ఘటన మరువక ముందే టొరంటో నగరంలో మళ్లీ కాల్పులు జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో టంబ్లర్ రిడ్జ్ అనే చిన్న మైనింగ్ టౌన్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ఘోరమైన కాల్పుల ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. ఒక మహిళ జరిపిన ఆ దాడిలో ఆమె తల్లి, సోదరుడితో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు! మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సదరు మహిళ తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
వరుసగా జరుగుతున్న ఈ దాడులు కెనడాలో నివసిస్తున్న అంతర్జాతీయ పౌరులలో, ముఖ్యంగా స్థిరపడిన భారతీయులలో భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


