White House : వైట్​ హౌస్​ వద్ద కాల్పులు- 'యేసుక్రీస్తును నేనే' అంటూ భ్రమ పడిన నిందితుడు!

White House shooting : వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సెక్యూరిటీ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన సంచలన వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. తనని తాను యేసుక్రిస్తుగా భ్రమపడే వాడు.

Published on: May 24, 2026, 09:08:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ వెలుపల.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. చివరికి యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఎదురుకాల్పుల్లో మరణించాడు. మృతుడిని 21 ఏళ్ల నాసిర్ బెస్ట్​గా గుర్తించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇతను.. గతంలో ఒకసారి అరెస్ట్​ అయ్యాడు. ఆ సమయంలో అతను.. తానే ‘యేసుక్రీస్తు’నని నమ్ముతున్నట్టు రికార్డుల్లో నమోదైంది.

వైట్​ హౌస్​ వద్ద పటిష్ట భద్రత.. (Bloomberg)
వైట్​ హౌస్​ వద్ద పటిష్ట భద్రత.. (Bloomberg)

అసలేం జరిగింది?

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 21 ఏళ్ల నాసిర్ బెస్ట్ శనివారం సాయంత్రం వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వైపు దూసుకొచ్చాడు. తన బ్యాగ్ నుంచి ఒక హ్యాండ్‌గన్ (పిస్టల్) తీసి అక్కడ విధుల్లో ఉన్న అధికారులపైకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

30 రౌండ్ల ఎదురుకాల్పులు..

దుండగుడు కాల్పులు ప్రారంభించడమే ఆలస్యం.. అక్కడ మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సెకన్ల వ్యవధిలో అప్రమత్తమై అతనిపైకి ఎదురుకాల్పులు జరిపారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య దాదాపు 30 రౌండ్ల కాల్పులు జరిగాయని స్థానిక మీడియా ఛానల్ ప్రతినిధి తెలిపారు. ఈ కాల్పుల మార్పిడిలో బుల్లెట్లు తగిలి నిందితుడు కిందపడిపోగా, రోడ్డుపై వెళ్తున్న ఒక పౌరుడికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఏజెంట్లకు ఎలాంటి గాయాలు కాలేదు.

తానే 'యేసుక్రీస్తు'నని నమ్మిన నిందితుడు!

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. కాల్పులకు తెగబడిన నాసిర్ బెస్ట్ గతంలోనే భద్రతా దళాల రికార్డుల్లో ఉన్నాడు. అతను తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు.

గతంలో కూడా అతను వైట్ హౌస్ సమీపంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు, నిషేధిత భద్రతా జోన్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఆ సమయంలో కోర్టు రికార్డులలో.. "తానే యేసుక్రీస్తునని, అందుకే తనను అరెస్ట్ చేయాలని అతను వాదించాడు," అని నమోదై ఉంది. వైట్ హౌస్ పరిసరాల్లోకి రాకుండా అతనిపై గతంలోనే 'స్టే-అవే ఆర్డర్' (నిషేధం) కూడా ఉంది.

ట్రంప్ సురక్షితం - ఘటనా స్థలంలో కీలక ఆధారాలు!

కాల్పులు జరిగిన సమయానికి దాదాపు రెండు గంటల ముందే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాను ఓవల్ ఆఫీస్​లో ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించిన పనుల్లో ఉన్నట్లు 'ట్రూత్ సోషల్' లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన వల్ల ట్రంప్‌నకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.

కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పూర్తిగా సీల్ చేసిన పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు రోడ్డుపై దాదాపు డజన్ల కొద్దీ ఆరెంజ్ ఎవిడెన్స్ మార్కర్లను (ఆధారాల గుర్తులు) ఉంచారు. నిందితుడికి ప్రాథమిక చికిత్స చేసిన మెడికల్ కిట్లు, గ్లోవ్స్ అక్కడ పడి ఉన్నాయి.

గత ఏడాది నవంబర్‌లో వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌పై దాడి, గత నెలలో ట్రంప్ హాజరైన 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' లో జరిగిన హత్యాయత్నం ఘటనల తర్వాత.. మళ్లీ ఇప్పుడు వైట్ హౌస్ గేట్ వద్దే ఈ కాల్పులు జరగడం అమెరికాలో భద్రతా వైఫల్యాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More