White House shooting : వైట్​ హౌస్​ వద్ద కాల్పుల మోత- ట్రంప్ సురక్షితం!

White House shooting update : వాషింగ్టన్​లోని వైట్​ హౌస్​ వద్ద కాల్పుల మోత మోగింది! గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడ్డాడు. స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుదాడి చేసింది. ఈ ఘటనలో నిందితుడు మరణించాడు. కాగా కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్​ హౌస్​లోనే ఉన్నారు.

Published on: May 24, 2026, 05:30:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trump White House shooting : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత భద్రత కలిగిన వైట్ హౌస్ పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్‌వెస్ట్ మూలలో ఈ కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు ధృవీకరించారు.

వైట్​ హౌస్​ వద్ద కాల్పులు- ట్రంప్ సేఫ్.. (AP Photo)
వైట్​ హౌస్​ వద్ద కాల్పులు- ట్రంప్ సేఫ్.. (AP Photo)

వైట్​ హౌస్​ వద్ద కాల్పుల కలకలం- అసలేం జరిగింది?

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఒక గుర్తుతెలియని వ్యక్తి (పురుషుడు) వైట్ హౌస్ వెస్ట్ సైడ్ లోని గేట్ 17 సమీపంలోకి వచ్చి అకస్మాత్తుగా పిస్టల్‌ను గాల్లోకి లేపి కాల్పులు ప్రారంభించాడు. దుండగుడు దాదాపు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఆ తర్వాత డజన్ల కొద్దీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైకి కూడా అతను కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ పహారా దళాలు ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని అక్కడికక్కడే ‘షూట్’ చేసి పడగొట్టాయి.

వైట్​ హౌస్ వద్ద కాల్పుల కలకలం- నిందితుడు మృతి

ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు నిందితుడు కాగా, మరొకరు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సాధారణ పౌరుడు అని సమాచారం. ఇద్దరినీ తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిందితుడు మరణించాడు. గాయపడిన పౌరుడి పరిస్థితి సైతం సీరియస్‌గా ఉన్నట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఎలాంటి గాయాలు కాలేదు.

లాక్‌డౌన్‌లోకి వైట్ హౌస్.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న జర్నలిస్టులు!

కాల్పుల శబ్దాలు వినబడగానే వైట్ హౌస్ సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన లాక్‌డౌన్ ప్రకటించారు. నేషనల్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

ఆ సమయంలో వైట్ హౌస్ నార్త్ లాన్ (ఉత్తర మైదానం) లో నిలబడి సోషల్ మీడియా కోసం వీడియో రికార్డ్ చేసుకుంటున్న ఏబీసీ న్యూస్ చీఫ్ కరస్పాండెంట్ సెలీనా వాంగ్.. కాల్పుల శబ్దాలు వినబడగానే అధికారులు తమను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి పరిగెత్తమని ఆదేశించారని ఎక్స్‌లో పేర్కొన్నారు.

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రైఫిల్స్ పట్టుకుని పొజిషన్ తీసుకుని, జర్నలిస్టులందరినీ “కిందకు వంగి తలలు దాచుకోవాలని” హెచ్చరించారు.

దాదాపు సాయంత్రం 6:45 గంటల వరకు (ఈటీ సమయం) ఈ లాక్‌డౌన్ కొనసాగింది.

వైట్​ హౌస్​ వద్ద కాల్పుల కలకలం- సురక్షితంగా ప్రెసిడెంట్ ట్రంప్..

కాల్పులు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నారు! ఇరాన్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందానికి సంబంధించిన చర్చల పనిలో ఆయన నిమగ్నమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, దుండగుడు వైట్ హౌస్ లోపలి సరిహద్దుల్లోకి ప్రవేశించలేకపోయాడని, ట్రంప్‌నకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.

నెల రోజుల్లోనే రెండో ఘటన!

సరిగ్గా నెల రోజుల క్రితమే వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’లో కూడా ట్రంప్ ఉండగా కోల్ టోమస్ అలెన్ అనే వ్యక్తి షాట్‌గన్‌తో సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ను దాటడానికి ప్రయత్నించి కాల్పుల కలకలం రేపాడు. ఇప్పుడు నేరుగా వైట్ హౌస్ గేట్ వద్దే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

ప్రస్తుత పరిస్థితులపై అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందిస్తూ.. తమ బృందాలు రంగంలోకి దిగాయని, సీక్రెట్ సర్వీస్ సంస్థతో కలిసి ఈ కాల్పుల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు ప్రారంభించామని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More