Donald trump : వైట్ హౌస్ డిన్నర్ షూటర్.. నాసా ఇంటర్న్, గోల్డెన్ టీచర్! మరి కాల్పులెందుకు జరిపాడు?
Cole Tomas Allen : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఈవెంట్లో కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి. అతని పేరు కోల్ టోమస్ అలెన్. అతను నాసా ఇంటర్న్, ఒక మంచి టీచర్! మరి కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు?
వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులకు తెగబడిన నిందితుడి వివరాలను భద్రతా సంస్థలు వెల్లడించాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టోమాస్ అలెన్‌గా గుర్తించారు. అతని వయస్సు 31ఏళ్లు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిందితుడికి అత్యున్నత విద్యా నేపథ్యం ఉండటమే కాకుండా గతంలో నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన అనుభవం కూడా ఉంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి.. వాషింగ్టన్లో మీడియా కరస్పాండెంట్స్‌తో డిన్నర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి ట్రంప్, ఆయన భార్యతో హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఈవెంట్లో పాల్గొన్నారు. కాగా.. ట్రంప్ ప్రసంగానికి కొన్ని నిమిషాల ముందు కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే పరిస్థితి గందరగోళంగా మారింది. ట్రంప్‌ని అధికారులు అక్కడి నుంచి తరలించారు. ప్రజలు టేబుళ్ల కింద తలదాచుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే 5 నుంచి 8 రౌండ్ల బుల్లెట్ శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, పరిస్థితి కుదుటపడిన అనంతరం ట్రంప్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ.. నిందితుడి ఫోటోలను, సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద అతను పరిగెత్తుతున్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితుడి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని, అతను ఒక 'లోన్-వుల్ఫ్' (ఒంటరిగా దాడి చేసే వ్యక్తి) అని ట్రంప్ అభివర్ణించారు.
ఎవరీ కోల్ టోమాస్ అలెన్?
సోషల్ మీడియా, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ ద్వారా నిందితుడి గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి:
నాసా ఇంటర్న్: అలెన్ 2014లో నాసాలో ఇంటర్న్‌షిప్ చేశాడు. అక్కడ గ్రహాల మ్యాపింగ్ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) మోడళ్లను అభివృద్ధి చేయడంలో పనిచేశాడు.
కాల్టెక్ గ్రాడ్యుయేట్: ప్రపంచ ప్రఖ్యాత కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందాడు.
ఉత్తమ ఉపాధ్యాయుడు: టోరెన్స్‌లోని ఒక ట్యూటరింగ్ సంస్థలో ఆరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అలెన్, గతంలో "టీచర్ ఆఫ్ ది మంత్" అవార్డును కూడా అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"నేను భయపడి పారిపోను" - ట్రంప్
కాల్పుల ఘటన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ తనదైన శైలిలో మాట్లాడారు.
"ఇలాంటి పిచ్చివాళ్లు, దౌర్జన్యకారులు మన రాజ్యాంగాన్ని, వ్యవస్థలను శాసించకూడదు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు నన్ను వెళ్లమన్నా, నేను అక్కడే ఉండి కార్యక్రమాన్ని కొనసాగించాలని పట్టుబట్టాను. ఇలాంటి దాడులు నన్ను భయపెట్టలేవు," అని ట్రంప్ స్పష్టం చేశారు.
రిపబ్లికన్ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ప్రభావం చూపే వ్యక్తులనే ఇలాంటి వారు టార్గెట్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
దర్యాప్తు ముమ్మరం.. మోటివ్ ఏంటి?
ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై లోతైన విచారణ ప్రారంభమైంది.
నిందితుడికి ఏదైనా విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? పక్కా ప్రణాళికతోనే ఈ విందుకు అతిథిగా వచ్చాడా? ఒక విద్యావేత్త, శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


