Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం? వైట్‌హౌస్ ఈవెంట్లో తీవ్ర కలకలం..
White House Dinner Shooting : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ డిన్నర్ ఈవెంట్లో కాల్పుల శబ్దం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదు.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శనివారం రాత్రి జరిగిన 'వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్'లో పెను ప్రమాదం తప్పింది! అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం కోసం వందలాది మంది జర్నలిస్టులు, సెలబ్రిటీలు ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో సర్వత్రా గందరగోళం నెలకొంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే స్పందించి ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. అయితే, పరిస్థితి కుదుటపడిన అనంతరం ట్రంప్ వేదికపైకి తిరిగొచ్చారు.

ఏటా వైట్‌హౌస్ జర్నలిస్టుల కోసం నిర్వహించే ఈ విందు కార్యక్రమం ఈసారి భయాందోళనల మధ్య కొనసాగింది. వేదికపై అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సహా పలువురు కేబినెట్ మంత్రులు కూర్చుని ఉన్న సమయంలో సుమారు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
టేబుళ్ల కింద తలదాచుకున్న అతిథులు!
కాల్పుల శబ్దాలు వినిపించిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. “అడ్డు తప్పుకోండి సార్!” అని అరుస్తూ సీక్రెట్ సర్వీస్ అధికారులు డయాస్ వైపు దూసుకెళ్లారు. స్టేడియంలో ఉన్న వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
"అందరూ కిందకు వంగండి" అంటూ అధికారులు కేకలు వేశారు. వెంటనే నేషనల్ గార్డ్ బలగాలను రంగంలోకి దించి, బాంక్వెట్ హాల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అతిథులను బయటకు పంపిన అధికారులు, తిరిగి లోపలికి రావడాన్ని తాత్కాలికంగా నిషేధించారు.
నిందితుడు కస్టడీలో.. ట్రంప్ రియాక్షన్ ఇదే!
ఈ ఘటన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందించారు.
"ఇట్స్ క్వైట్ ఆన్ ఈవినింగ్. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా దళాలు అద్భుతంగా పనిచేశాయి. వారు ఎంతో ధైర్యంగా, వేగంగా స్పందించారు. షూటర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రదర్శనను కొనసాగించాలని నేను సూచించాను, కానీ తుది నిర్ణయం భద్రతా అధికారులదే," అని ట్రంప్ పోస్ట్ చేశారు.
అనంతరం కొద్దిసేపటికి ట్రంప్ వేదిక వద్దకు తిరిగొచ్చారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. షూటర్ వివరాలను భద్రతా సంస్థలు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
గతంలోనూ ట్రంప్‌పై హత్యాయత్నం
డొనాల్డ్ ట్రంప్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో థామస్ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్లింది. ఆ ఘటనలో ఒక సామాన్యుడు మృతి చెందగా, స్నిపర్లు షూటర్‌ను హతమార్చారు.
ఇప్పుడు మరోసారి అధ్యక్షుడి స్థాయి వ్యక్తిపై ఇటువంటి దాడి జరగడం అమెరికా భద్రతా వ్యవస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మీడియాతో ఉద్రిక్తతల మధ్య విందు..
ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలంలో మొదటిసారిగా ఈ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు హాజరయ్యారు. సాధారణంగా ట్రంప్ యంత్రాంగానికి, అమెరికా మీడియాకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఈ విందులో కాల్పులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


