Instagram : మీ మెసేజ్‌లు ఎవరైనా చదవొచ్చు! కీలక భద్రతా ఫీచర్‌ని కట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్..
Instagram Encrypted Messages : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ తన మెసేజింగ్ సేవల్లో కీలక మార్పు చేస్తోంది. 2023లో ప్రవేశపెట్టిన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8, 2026 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ప్రైవేట్ సంభాషణల భద్రతపై కొత్త చర్చ మొదలైంది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ఊహించని వార్త చెప్పింది. ప్లాట్‌ఫారమ్‌లో వ్యక్తిగత సంభాషణలకు అదనపు భద్రతను కల్పించే 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' (E2EE) మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్పు మే 8, 2026 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ధృవీకరించింది. ఆ తేదీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌క్రిప్టెడ్ చాట్స్‌కు మద్దతు ఉండదు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటి?
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది ఒక అత్యున్నత భద్రతా వ్యవస్థ! దీని ద్వారా పంపిన సందేశాలను కేవలం పంపినవారు (సెండర్), అందుకున్నవారు (రెసీపియంట్) మాత్రమే చదవగలరు. మధ్యలో ప్లాట్‌ఫారమ్ యాజమాన్యానికి (మెటా) కూడా ఈ మెసేజ్‌లను చూసే అధికారం ఉండదు.
ఫీచర్ రద్దుకు కారణాలేంటి?
మెటా తన యాప్‌లలో గోప్యతను పెంచే లక్ష్యంతో డిసెంబర్ 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ఇప్పుడు దీనిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. వినియోగదారుల్లో దీని వాడకం తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు.
చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఎన్‌క్రిప్టెడ్ చాట్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటున్నారని కంపెనీ గుర్తించింది.
యూజర్లపై ప్రభావం ఏంటి?
ఈ ఫీచర్ తొలగించిన తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లో పంపే సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉండదు. అంటే, కంటెంట్ మోడరేషన్ లేదా ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా మెటా సాంకేతికంగా మీ సందేశాలను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ఎన్‌క్రిప్టెడ్ సంభాషణలు కలిగి ఉన్న వినియోగదారులకు యాప్‌లో నోటిఫికేషన్లు అందుతాయి.
మే 8 గడువు ముగిసేలోపు తమ ముఖ్యమైన మెసేజ్‌లు లేదా మీడియా ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ సూచిస్తోంది.
గోప్యత, భద్రతపై చర్చ..
మెటా తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవసీ నిపుణుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. హ్యాకర్లు లేదా నిఘా సంస్థల నుంచి ఆన్‌లైన్ సంభాషణలను రక్షించడానికి ఎన్‌క్రిప్షన్ అత్యంత బలమైన మార్గమని నిపుణులు వాదిస్తున్నారు. మరోవైపు, ఎన్‌క్రిప్షన్ వల్ల ఆన్‌లైన్‌లో అక్రమ కార్యకలాపాలను లేదా హానికరమైన కంటెంట్‌ను గుర్తించడం అధికారులకు కష్టమవుతుందని కొన్ని ప్రభుత్వాలు, శిశు సంరక్షణ సంస్థలు వాదిస్తున్నాయి.
మెటా ఇప్పటికే వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను అందిస్తోంది. కాబట్టి, అత్యున్నత గోప్యత కోరుకునే వారు ఇన్‌స్టాగ్రామ్ బదులు వాట్సాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పరోక్షంగా సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత సంభాషణల భద్రతపై ఈ నిర్ణయం మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
మెటా తాజా నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్ వినియోగంపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ఇన్‌స్టాగ్రామ్ అసలు పేరు ఏంటి, దానిని ఎవరు సృష్టించారు
ఇన్‌స్టాగ్రామ్‌ను కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ కలిసి 2010లో సృష్టించారు. అయితే, ఇది మొదట ఫోటో షేరింగ్ యాప్ కాదు. దీని అసలు పేరు 'Burbn' (బర్బన్). ఇది చెక్-ఇన్ ఫీచర్లు కలిగిన లొకేషన్ బేస్డ్ యాప్. అయితే ఆ యాప్ చాలా క్లిష్టంగా ఉండటంతో, కేవలం ఫోటోలు షేర్ చేసే ఫీచర్‌పై మాత్రమే దృష్టి పెట్టి ‘ఇన్‌స్టాగ్రామ్’గా దీనిని మార్చారు. అక్టోబర్ 6, 2010న ఐఫోన్ యూజర్ల కోసం దీనిని మొదటిసారి విడుదల చేశారు.
2. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ (ప్రస్తుత మెటా) ఎప్పుడు, ఎంత ధరకు కొనుగోలు చేసింది?
ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. కేవలం రెండేళ్ల తర్వాత, అంటే ఏప్రిల్ 2012లో ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ దీనిని సుమారు 1 బిలియన్ డాలర్లకు (నగదు, స్టాక్స్ రూపంలో) కొనుగోలు చేశారు. అప్పట్లో కేవలం 13 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్న ఒక చిన్న కంపెనీకి ఇంత భారీ ధర చెల్లించడం ఒక పెద్ద సంచలనంగా మారింది. నేడు ఇన్‌స్టాగ్రామ్ మెటా ఆదాయంలో సింహభాగాన్ని కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


