Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ చూస్తున్నారా? మీ తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లిపోతుంది!
Instagram safety features : తమ ప్లాట్‌ఫారమ్‌లో టీనేజర్ల భద్రతను పెంపొందించేందుకు 'మెటా' సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. పలు అంశాలకు సంబంధించిన పదాలను టీనేజర్లు పదే పదే సెర్చ్ చేస్తే, వెంటనే వారి తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వెళ్లేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించింది. పూర్తి వివరాలు ఇలా..
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల రక్షణ కోసం మరో కీలక ముందడుగు వేసింది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులకు సహాయపడేలా కొత్త 'పేరెంటల్ నోటిఫికేషన్' ఫీచర్‌ను తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా ఆత్మహత్యలు లేదా తమను తాము గాయపరచుకునేలా (సెల్ఫ్- హార్మ్) ప్రేరేపించే కంటెంట్ కోసం టీనేజర్లు వెతుకుతున్నప్పుడు, ఈ ఫీచర్ ఒక హెచ్చరికలా పనిచేస్తుంది.

నోటిఫికేషన్ ఎలా అందుతుంది?
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పేరెంటల్ సూపర్‌విజన్’ టూల్స్‌ను ఎనేబుల్ చేసుకున్న తల్లిదండ్రులకు మాత్రమే ఈ అలర్ట్‌లు అందుతాయి. ఆత్మహత్య లేదా స్వయం హింసకు సంబంధించిన పదాలను ఒక టీనేజర్ తక్కువ వ్యవధిలో పదే పదే సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ విషయాన్ని మెటా గుర్తిస్తుంది. వెంటనే తల్లిదండ్రులకు ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ లేదా ఇన్-యాప్ నోటిఫికేషన్ ద్వారా సమాచారం పంపిస్తుంది.
ఈ ఫీచర్ వచ్చే వారం నుంచే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరిలో భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించనున్నారు.
ముందస్తు జాగ్రత్తలు..
మెటా వెల్లడించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు:
నేరుగా నిరోధం: ఆత్మహత్యలకు సంబంధించిన ప్రమాదకరమైన సెర్చ్‌లను మెటా ఇప్పటికే బ్లాక్ చేస్తోంది. అలాంటి సెర్చ్‌లు చేసిన వారికి హెల్ప్‌లైన్ నంబర్లను చూపిస్తోంది.
నిపుణుల సలహాలు: నోటిఫికేషన్ అందినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా, పిల్లలతో ఎలా మాట్లాడాలి? వారికి ఎలా మద్దతుగా నిలవాలి? అనే విషయంలో నిపుణుల గైడెన్స్‌ను కూడా మెటానే అందిస్తుంది. ఇది తల్లిదండ్రులకు చాలా చాలా అవసరమైన అంశం.
ఏఐతో కూడా భద్రత: కేవలం ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ మాత్రమే కాకుండా, మెటా ఏఐ చాట్‌బాట్‌తో కూడా టీనేజర్లు ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులకు అలర్ట్ వెళ్లేలా త్వరలోనే అప్‌డేట్ రానుంది.
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి..
18 ఏళ్ల లోపు యూజర్లందరికీ మెటా కఠినమైన నియమాలను (13+ సెట్టింగ్స్) గత ఏడాది నుంచే అమలు చేస్తోంది. దీనివల్ల ప్రైవసీ సెట్టింగ్స్ మార్చాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కొత్త నోటిఫికేషన్ ఫీచర్ వల్ల పిల్లల ఆన్‌లైన్ ప్రవర్తనపై తల్లిదండ్రులకు మరింత పట్టు లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.
పిల్లలు సోషల్ మీడియాని ఉపయోగించడాన్ని ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధించింది. మన దేశంలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ సేఫ్టీ ఫీచర్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ అప్డేట్ చేస్తున్నాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న- నా పిల్లలు ఏ పదాన్ని సెర్చ్ చేశారో నాకు పూర్తి వివరాలు తెలుస్తాయా?
సమాధానం- పలు నివేదికల ప్రకారం.. తల్లిదండ్రులకు అందే అలర్ట్ మెసేజ్‌లో టీనేజర్ సెర్చ్ చేసిన ఖచ్చితమైన పదాలు లేదా పూర్తి సెర్చ్ హిస్టరీ ఉండదు. భద్రతా కారణాల దృష్ట్యా, వారు ఆత్మహత్య లేదా స్వయం హింసకు సంబంధించిన పదాలను "పదే పదే వెతుకుతున్నారు" అని మాత్రమే నోటిఫికేషన్ తెలియజేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లల ప్రైవసీని కాపాడుతూనే, వారు ఇబ్బందుల్లో ఉన్నారని తల్లిదండ్రులకు ముందస్తుగా హెచ్చరించడం.
ప్రశ్న- ఒక్కసారి సెర్చ్ చేస్తేనే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వెళుతుందా?
సమాధానం- లేదు. కేవలం ఒకసారి లేదా పొరపాటున సెర్చ్ చేస్తే ఈ అలర్ట్ వెళ్లదు. ఒక టీనేజర్ తక్కువ సమయంలోనే పదే పదే అవే ప్రమాదకరమైన పదాలను వెతకడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అనవసరమైన నోటిఫికేషన్లతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, నిజంగా సహాయం అవసరమైన సందర్భాలను గుర్తించేందుకే ఈ 'రిపీటెడ్ సెర్చ్' నిబంధనను మెటా రూపొందించింది.

E-Paper












