శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Toyota Innova Hycross : ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారుగా కొత్త 'టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్' మార్కెట్లోకి అడుగుపెట్టింది. 20 నుంచి 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో నడిచే ఈ కారు ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జపాన్ దిగ్గజం టయోటా తమ పాపులర్ ఎంపీవీ ‘ఇన్నోవా హైక్రాస్'లో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తాజాగా దేశీయంగా విడుదల చేసింది. మిడ్-లైఫ్ అప్‌డేట్‌లో భాగంగా పలు కీలక మార్పులతో వచ్చిన ఈ కారు.. భారతదేశంలోనే మొట్టమొదటి 'ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్' వాహనంగా నిలిచింది. ఎప్పటినుంచో కారు ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ఇప్పుడు సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. 6, 7 సీటర్ లేఅవుట్‌లలో లభించే ఈ అప్‌డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ప్రారంభ ధరను రూ. 19.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) టయోటా నిర్ణయించింది.

కొన్ని వారాల క్రితమే ఇండోనేషియా మార్కెట్లో అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసిన టయోటా, ఇప్పుడు భారత్‌లోనూ అదే తరహా మార్పులతో తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 2026 టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ విశేషాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్, కలర్స్..
విడుదలైనప్పటి నుంచి విశాలమైన ప్రీమియం క్యాబిన్ అనుభూతి, శక్తివంతమైన పనితీరుతో ఇన్నోవా హైక్రాస్ ప్రైవేట్ కొనుగోలుదారులతో పాటు ట్రావెల్ ఆపరేటర్ల మనసు గెలుచుకుంది.
2026 టయోటా ఇన్నోవా హైక్రాస్ బయటి భాగాన్ని పరిశీలిస్తే కొత్తగా తీర్చిదిద్దిన రేడియేటర్ గ్రిల్, సరికొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సన్నటి హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముందు, వెనుక బంపర్లను మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు టెయిల్ లైట్లకు కొత్త సొబగులు అద్దారు. అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను, కారు ప్రధాన ఆకృతిని మాత్రం పాత మోడల్ తరహాలోనే కొనసాగించారు. కొత్త హైక్రాస్ సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్స్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- క్యాబిన్, ఫీచర్లు..
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలోనూ సంస్థ ఆధునిక హంగులను జోడించింది. పాత మోడల్‌లో ఉన్న 10.1-అంగుళాల యూనిట్ స్థానంలో ఇప్పుడు పెద్దదైన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇండోనేషియా మోడల్ తరహాలోనే ఇందులోనూ 12.3-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. టయోటా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్..
2026 టయోటా ఇన్నోవా హైక్రాస్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం దీని ఇంజిన్ సాంకేతికత! భారత మార్కెట్లో తొలిసారిగా ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఇందులో పరిచయం చేశారు. ఈ ఇంజిన్ 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమంతో (ఈ20-ఈ85) సులభంగా పనిచేస్తుంది.
2.0-లీటర్ పెట్రోల్ మోటార్‌కు ఐదో తరం హైబ్రిడ్ సెటప్‌ను జతచేశారు. జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లన్నింటిలోనూ ఈ ఫ్లెక్స్-హైబ్రిడ్ ఇంజిన్ అందుబాటులో ఉండగా, కేవలం పెట్రోల్ ఇంజిన్ కావాలనుకునే వారి కోసం జీఎక్స్ వేరియంట్‌లో ప్యూర్ పెట్రోల్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.
తక్కువ ఇంధన ఖర్చు, పర్యావరణ హితమైన టెక్నాలజీతో వచ్చిన ఈ కొత్త ఇన్నోవా హైక్రాస్, భారతీయ ఎంపీవీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పదిలం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

E-Paper
