కొత్త లుక్‌తో టయోటా ఇన్నోవా హైక్రాస్.. 100% ఇథనాల్ ఇంజిన్‌తో త్వరలోనే లాంచ్
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఇన్నోవా హైక్రాస్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ఈ నేపథ్యంలోనే 2026 నవంబర్ 25న విడుదల కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఆధునిక క్యాబిన్ ఫీచర్లతో పాటు 100 శాతం బయోఇథనాల్‌తో నడిచే ఇంజిన్ రానుండటం విశేషం.
భారతీయ కుటుంబాల ప్రయాణాలకు చిరునామాగా నిలిచిన ‘టయోటా ఇన్నోవా హైక్రాస్’ సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. 2026 నవంబర్ 25న మార్కెట్లోకి రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను టయోటా తాజాగా విడుదల చేసింది. 2022లో భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇన్నోవా హైక్రాస్‌కు లభిస్తున్న మొట్టమొదటి భారీ అప్‌డేట్ ఇదే! ప్రస్తుతం మన దేశంలో టయోటా అత్యధికంగా విక్రయిస్తున్న కార్లలో ఇది రెండో స్థానంలో కొనసాగుతోంది. బయటి డిజైన్ మార్పులతో పాటు క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు, 100 శాతం ఇథనాల్ మిశ్రమంతో నడిచే సరికొత్త ఇంజిన్‌ను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఉమ్మడి కుటుంబాల విహారయాత్రలకైనా, జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలకైనా ప్రజలు ఇన్నోవా హైక్రాస్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌కు భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు 100 శాతం బయోఇథనాల్‌తో నడిచే వెర్షన్ వస్తుండటం వాహన ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సరికొత్త డిజైన్.. మరింత ఆకర్షణీయంగా బయటి రూపం!
కంపెనీ విడుదల చేసిన టీజర్ ఈ అప్‌డేటెడ్ ఎంపీవీ రూపురేఖలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తోంది. కారు మొత్తం ఆకృతిని పాత మోడల్ తరహాలోనే కొనసాగిస్తూనే, ముందు, వెనుక భాగాల్లో కీలక మార్పులు చేశారు. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలను బట్టి, కారు ముందు భాగం మరింత నిటారుగా కనిపిస్తోంది. కొత్తగా డిజైన్ చేసిన స్లాటెడ్ గ్రిల్, పదునైన లైటింగ్ ఎలిమెంట్స్ దీనికి ఆధునిక సొబగులు అద్దుతున్నాయి. ముందు బంపర్, లోయర్ గ్రిల్ డిజైన్‌ను కూడా టయోటా మరింత సరళంగా తీర్చిదిద్దింది.
కారు పక్క భాగంలో పరిమిత మార్పులు మాత్రమే ఉంటాయి; సరికొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, డ్యూయల్-టోన్ ఓఆర్వీఎంలు, క్రోమ్ ఫినిషింగ్ ఉన్న డోర్ హ్యాండిల్స్, విండో గార్నిష్, వంపు తిరిగిన రూఫ్‌లైన్ వంటివి యథాతథంగా కొనసాగుతాయి. ఇక వెనుక వైపు ఫ్లాట్ టెయిల్‌గేట్, మరింత శుభ్రంగా కనిపించే బంపర్‌ను అమర్చారు. ప్రస్తుత టెయిల్ ల్యాంప్ డిజైన్‌లోనే స్వల్ప మార్పులు చేశారు. రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వాలుగా ఉండే వెనుక విండ్‌షీల్డ్‌ను అలాగే ఉంచారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్, ఫీచర్స్..
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో అనేక కొత్త పరికరాలను జోడిస్తున్నారు. ఇండోనేషియా మార్కెట్లో ఇదే కారును ‘కిజాంగ్ ఇన్నోవా జెనిక్స్’ పేరుతో విక్రయిస్తున్నారు. ఇటీవల ఆ మోడల్‌లో టయోటా పలు అదనపు ఫీచర్లను ప్రవేశపెట్టింది. వాటిలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల టీఎఫ్‌టీ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఇన్-కార్ వై-ఫై, 360-డిగ్రీ కెమెరా, ముందు వెనుక భాగాలలో డిజిటల్ వీడియో రికార్డర్లు ఉన్నాయి.
వీటిలో చాలా ఫీచర్లను భారత మార్కెట్లోకి రానున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోనూ అందించే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ అందరికీ పరిచయమున్న పాత శైలిలోనే ఉన్నప్పటికీ, కొత్త అప్‌హోల్‌స్టరీ, సరికొత్త ఇంటీరియర్ కలర్ థీమ్‌తో క్యాబిన్‌కు ప్రీమియం రూపాన్ని ఇవ్వనున్నారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- 100 శాతం బయోఇథనాల్ ఇంజిన్..
ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అతిపెద్ద సాంకేతిక మార్పు 'ఫ్లెక్స్-ఫ్యూయల్' పరిజ్ఞానం. నవంబర్ 25న టయోటా సంస్థ 100 శాతం బయోఇథనాల్‌తో నడిచే (ఈ100) ఇన్నోవా హైక్రాస్‌ను విడుదల చేయనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గతంలో టయోటా సంస్థ మార్పులు చేసిన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్నోవా హైక్రాస్.. ఈ20 ఇంధన నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇందులోని పెట్రోల్ వేరియంట్లు 172.99 హెచ్‌పీ పవర్‌ని, 204 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ 186 హెచ్‌పీ పవర్‌ని, 191 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ. 19.53 లక్షల నుంచి రూ. 32.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
పర్యావరణ హితమైన బయోఇథనాల్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లు తోడైతే నవంబర్ 25 తర్వాత భారత ఎంపీవీ విభాగంలో ఇన్నోవా హైక్రాస్ మరింత బలమైన పోటీదారుగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


