Credit score : క్రెడిట్​ స్కోర్​ 750 కన్నా ఎక్కువ ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి?

Good credit score : క్రెడిట్​ స్కోర్​ అనేది 750 కన్నా ఎక్కువ ఉండాలి అని అంటారు. ఎందుకు? దాని వల్ల వచ్చే ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 30, 2025, 12:15:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రెడిట్ కార్డులు, పర్సనల్​ లోన్స్​, హోమ్​ లోన్​లు తీసుకోవాలని అనుకునేవారికి హెల్తీ క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం! రుణ సంస్థలు సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్‌ను ఎక్స్​లెంట్​గా పరిగణిస్తాయి. ఇలాంటి స్కోర్ ఉంటే, భవిష్యత్తులో రుణాలు సులభంగా మంజూరు కావడానికి మార్గం సుగమమవుతుంది.

750 క్రెడిట్​ స్కోర్​తో వచ్చే లాభాలు..
750 క్రెడిట్​ స్కోర్​తో వచ్చే లాభాలు..

కాబట్టి, రుణ గ్రహీతలు తమ చెల్లింపులను సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే పర్సనల్ లోన్ ఈఎంఐలు, హోమ్ లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఇతర రుణ చెల్లింపులను ఎప్పుడూ ఆలస్యం చేయకుండా చూసుకోవడం చాలా కీలకం. ఇది క్రెడిట్ స్కోర్ ప్రాథమిక ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.

బేసిక్​ హోమ్ లోన్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు అతుల్ మొంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. “లోన్​ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాతలు పరిగణించే అత్యంత ముఖ్యమైన అంశాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్​ని బలంగా పరిగణిస్తారు. ఇది త్వరిత లోన్ మంజూరు లేదా తక్కువ వడ్డీ రేట్లు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది,” అని అన్నారు.

అంతేకాకుండా, "మీరు రుణదాతలతో ఇప్పటికే మంచి సంబంధాన్ని కలిగి ఉంటే, ఈ స్కోర్ మీకు మెరుగైన నిబంధనలను చర్చించే అవకాశాన్ని కూడా పెంచుతుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు, బకాయిలు క్లియర్ చేయడం, పాత అప్పులను పరిష్కరించడం, మంచి క్రెడిట్ ప్రవర్తనను కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. మీ క్రెడిట్ రిపోర్ట్ అప్‌డేట్‌గా, తప్పులు లేకుండా ఉందో లేదో క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం కూడా అవసరం," అని ఆయన జోడించారు.

750 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ప్రయోజనాలు ఏంటి?

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఆర్థిక సంస్థలకు ఉండే రిస్క్ తగ్గుతుంది. దీని ఫలితంగా రుణం త్వరగా మంజూరవుతుంది, డాక్యుమెంటేషన్ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.

1. తక్కువ వడ్డీ రేట్లు

750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, గృహ రుణాలపై సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తారు. ఇది మీకు ఆర్థికంగా పెద్ద ప్రయోజనం. మరోవైపు, బలహీనమైన క్రెడిట్ స్కోర్, గతంలో డిఫాల్ట్ అయిన చరిత్ర ఉన్నవారు అధిక-రిస్క్ రుణగ్రహీతలుగా పరిగణిస్తారు, కాబట్టి వారికి ఆకర్షణీయమైన రుణ ఆఫర్లను పొందడం కష్టం.

2. అధిక రుణ పరిమితులు

మంచి చెల్లింపు చరిత్ర, పటిష్టమైన క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు ఎక్కువ మొత్తంలో రుణాలను, అధిక క్రెడిట్ పరిమితులను ఇస్తాయి. ఈ ఆఫర్‌లను పొందడానికి 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ అత్యుత్తమంగా చూస్తారు.

3. వేగవంతమైన మంజూరు

మీకు సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర, గతంలో ఎలాంటి డిఫాల్ట్‌లు లేకపోవడం, అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం తక్కువ సమయంలో ఆమోదం పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా వైద్య అవసరాల కోసం డబ్బు అవసరమైనప్పుడు ఇది చాలా ముఖ్యమైనది.

4. నెగోషియేట్​ చేయొచ్చు

ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్, అధిక స్కోర్ ఉన్నవారు వడ్డీ రేట్లు, మొత్తం రుణ మొత్తం, చెల్లింపు కాలపరిమితి వంటి రుణ నిబంధనలను నమ్మకంగా చర్చించవచ్చు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ కారణంగా వారికి ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉంటాయి.

5. ప్రీమియం ఆర్థిక ఉత్పత్తులకు యాక్సెస్

అనేక బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు తమ అధిక స్కోరింగ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణ ఆప్షన్లను అందిస్తాయి. బాధ్యతాయుతమైన రుణగ్రహీతలను అభినందించడానికి ఇది చేస్తారు.

ఇవి తెలుసుకోండి..

చివరిగా.. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం అనేది కేవలం రుణం తీసుకునే అర్హత గురించే కాదు, దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణకు కూడా నిదర్శనం.

సమయానికి చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులను క్లియర్ చేయడం, క్రెడిట్‌ను తెలివిగా ఉపయోగించడం, క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం అధిక క్రెడిట్ స్కోర్‌ను నిలబెట్టుకోవడానికి కీలకం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ స్కోర్​ ఎంత ఉన్నా, లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుంచుకోండి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More