Independence day 2026 : ఎర్రకోటలో జాతీయ జెండా రెపరెపలు.. చరిత్రలో తొలిసారి 'వందే మాతరం'!
15 August 80th Independence day : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ ఎర్రకోట సహా ఇత ప్రాంతాల్లో ఇండిపెండెన్స్ డే వేడుకల అప్డేట్స్ని ఇక్కడ ఫాలో అవ్వండి..
India Independence day year : భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ పేజ్ని ఫాలో అవ్వండి.

India Independence year : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. దిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లైవ్ అప్డేట్స్ని ఇక్కడ ఫాలో అవ్వండి.
...Read MoreIndependence Day : సీఎంగా తొలిసారి
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నుముట్టాయి. తమిళనాడులో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవం ఇది కావడం విశేషం. చెన్నైలోని చారిత్రాత్మక సెంట్ జార్జ్ కోట (సచివాలయం) ప్రాంగణంలో శనివారం (ఆగస్ట్ 15) ఉదయం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Independence Day : కన్యాకుమారి టు జమ్ము..
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు తమతమ ప్రాంతాల్లో జరిగిన జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు.
Independence Day : ఎర్రకోట వద్ద ముగిసిన వేడుకలు..
ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ ప్రసంగం ముగిసింది. అనంతరం ఆయన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్‌ను పలకరించి, ఆ ప్రాంగణం నుంచి బయలుదేరారు.
Independence Day : ‘దిమాగి నక్సల్స్‌తో జాగ్రత్త’
సాయుధ నక్సలిజం అంతరించిపోయినప్పటికీ, సమాజంలో 'దిమాగి నక్సల్స్' రూపంలో కొత్త ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి సమాజం నుంచి వేరుచేయాలని, దేశ భద్రత, పురోగతి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే.. దిమాగి నక్సల్స్ అంటే ఏంటి? దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? అన్న ప్రశ్నలకు మోదీ స్పష్టత ఇవ్వలేదు.
Independence Day : మోదీ ప్రసంగంలో డేటా సెంటర్లు, ఏఐ..
ప్రపంచం భవిష్యత్ సాంకేతికతలతో దూసుకుపోతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డిజిటల్ ప్రపంచాన్ని ముందుకు నడపడానికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరమని అన్నారు.
రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు.
దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాలలో డేటా సెంటర్లు విస్తరిస్తున్నాయని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం గడిచిన ఐదేళ్లలో గణనీయంగా వృద్ధి చెందిందని పేర్కొంది.
మహారాష్ట్రలోని థానే, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Independence Day : సప్తధార ప్లాన్ ఇలా..
ఈ ఏడు సూత్రాల ఫ్రేమ్‌వర్క్‌లో తయారీ రంగానికి ప్రధాని పెద్దపీట వేశారు. కేవలం ఉత్పాదకతను పెంచడమే కాకుండా డిజైన్ నుంచి ఫైనల్ ప్రాడక్ట్స్ వరకు పూర్తి స్థాయి డొమెస్టిక్ వాల్యూ చెయిన్‌ను తయారు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక నమ్మకమైన కేంద్రంగా ఎదగాలని, నాణ్యతలో రాజీ పడకుండా తయారీ రంగం ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.
Independence Day : మోదీ సప్తధార ప్లాన్..
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాకారాల నుంచి కీలక ప్రకటన చేశారు. గడిచిన అయిదు నుంచి ఏడు దశాబ్దాలలో సాధించలేని అభివృద్ధిని కేవలం అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలోనే సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీ ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. దేశ భవిష్యత్తును మార్చే దిశగా ‘సప్తధార’ పేరిట సరికొత్త సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రధాని ఆవిష్కరించారు.
ప్రాచీన కాలంలో 'సప్త సింధు' ఏ విధంగా దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందో గుర్తుచేసిన ప్రధాని, ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి అదే తరహాలో 'సప్తధార' శక్తి అవసరమని పేర్కొన్నారు. దేశ యువత భాగస్వామ్యంతో మన పనితీరులో, ఆలోచనా విధానంలో వేగాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
Independence Day : యువతకు ఏఐ ట్రైనింగ్
వచ్చే ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ ఇస్తామని ప్రధాని తెలిపారు.
Independence Day : ‘ఒకప్పుడు ఫ్రజైల్ ఫైవ్- ఇప్పుడు..’
“ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ పరంగా 'ఫ్రజైల్ ఫైవ్' జాబితాలో నిలిచిన భారతదేశం.. ఇప్పుడు కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆశించిన వేగంతో ప్రగతి సాధ్యపడకపోయినా, నేడు మాత్రం దేశం ఊహించని వేగంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది,” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Independence day 2026 : ‘పెద్ద పెద్ద కలలు కనండి’
“నూట నలభై కోట్ల మంది భారతీయుల సంకల్ప బలం, శక్తి సామర్థ్యాలతో 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలనే బృహత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుండటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది, భారత్ పట్ల ప్రపంచం చూసే చూపు పూర్తిగా మారిపోయింది. మనం పెద్దపెద్ద కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకోవాలి. పెద్ద కలలు కంటేనే మన ఆలోచనా ధోరణి, విజన్ మెరుగుపడుతుంది,” అని మోదీ అన్నారు.
Independence Day : వందే మాతరం..
ఎర్రకోటపై వందే మాతరం..
Independence Day 2026 : వేడుకలకు ప్రత్యేక అతిథులు..
ఈ చారిత్రక వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి దాదాపు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు! మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ స్వచ్ఛంద సేవాకులు, ముద్రా యోజన లబ్ధిదారులు, స్వచ్ఛ భారత్ సిబ్బంది, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెట్రో కార్మికులు, కర్తవ్య పథ్ కార్మికులు ఎర్రకోట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అలాగే పీఎం సూర్య ఘర్ యోజన లబ్ధిదారులు, విశ్వకర్మ పథకం శిల్పులు, స్టార్టప్ ఫౌండర్లు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన యువత ఈ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు.
Independence Day : జాతీయ జెండా రెపరెపలు..
80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతర గీతాన్ని ఈవెంట్లో ఆలపించారు.
ఎర్రకోటకు మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చరుకున్నారు. మరికొద్దిసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
Independence Day 2026 : గాంధీకి మోదీ నివాళి
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు.
Independence Day 2026 : ప్రధాని మోదీ ట్వీట్..
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన మహానీయుల ధైర్యం, త్యాగాలు, అంకితభావాన్ని స్మరించుకున్నారు. వారి కలలను సాకారం చేస్తూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Independence day 2026 : చరిత్రలో తొలిసారి..
ఈసారి వేడుకల్లో చారిత్రక సంఘటన చోటుచేసుకోనుంది. ఎర్రకోట చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే వందేమాతరం గీతానికి 150 ఏళ్ల ఘనమైన చరిత్ర పూర్తయిన సందర్భంగా దాన్ని సముచితంగా గౌరవిస్తున్నారు.
ఈ ఏడాది వేడుకలలో దేశ యువ శక్తి, యువత ఆకాంక్షలకు పెద్దపీట వేయనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువత పాత్రను ఇందులో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
Independence day 2026 : ఉదయం 4 గంటల నుంచే దిల్లీ మెట్రో సర్వీసులు
వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ప్రజల సౌలభ్యం కోసం దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న ఉదయం 4 గంటల నుంచే మెట్రో సేవలను ప్రారంభించింది. ప్రత్యేక అతిథుల కోసం రక్షణ శాఖకు 1.30 లక్షల ప్రీ-వెండెడ్ క్యూఆర్ టికెట్లను డీఎంఆర్‌సీ అందజేసింది.
Independence day 2026 : ఎర్రకోట చుట్టూ డిజిటల్ పార్కింగ్ మ్యాపింగ్
స్వాతంత్య్ర వేడుకలకు వచ్చే ఆహ్వానితులు, వీఐపీలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దిల్లీ ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎర్రకోట సమీపంలో ఏడు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను డిజిటల్ రూపంలో మ్యాప్ చేశారు.
గూగుల్ మ్యాప్స్, మ్యాపిల్స్ సంస్థలతో కలిసి ఈ ఏర్పాట్లు చేశారు. గూగుల్ మ్యాప్స్‌లో ఈ పార్కింగ్ స్థలాలను గుర్తించవచ్చు. మ్యాపిల్స్ యాప్ ద్వారా ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను జనరేట్ చేసి, వాటిని స్కాన్ చేయడం ద్వారా పార్కింగ్ స్థలానికి సులభంగా చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
Independence day 2026 : దిల్లీలో కట్టుదిట్టమైన భద్రత..
దేశ రాజధాని దిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15 వేడుకలను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. దిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా నిఘాను తీవ్రతరం చేశాయి.
నగరంలోని కీలక ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. దిల్లీ సరిహద్దులు, రాకపోకలు సాగించే ప్రధాన మార్గాలలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వేడుకలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
Independence day : ఎర్రకోట ఈవెంట్ అప్డేట్స్..
ఉదయం 6 గంటల 30 నిమిషాలకు డీడీలో లైవ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Independence day : ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
డిజిటల్ మాధ్యమాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పలు అధికారిక ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి:
Press Information Bureau (PIB) అధికారిక యూట్యూబ్ ఛానెల్, X (Twitter) ఖాతా ద్వారా లైవ్ వీక్షించవచ్చు.
ప్రధాని కార్యాలయ అధికారిక Prime Minister's Office YouTube Channel లో కూడా ప్రత్యక్ష ప్రసారం లభిస్తుంది.
ప్రసార భారతికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ WAVES ద్వారా కూడా ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం హిందుస్థాన్ టైమ్స్ తెలుగు లైవ్ పేజీని సైతం ఫాలో అవ్వొచ్చు.
Independence day : టీవీలో లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడాలి?
దూరదర్శన్ నెట్‌వర్క్ ద్వారా ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
మీరు DD National, DD News చానెళ్లలో ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు.
Independence day : భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతినిద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలను టీవీ, ఆన్‌లైన్ మాధ్యమాల్లో నేరుగా వీక్షించవచ్చు.

E-Paper

