Independence Day : ‘పెద్ద కలలు కనండి’- ఎర్రకోట వేదికగా భారతీయులకు మోదీ పిలుపు..
80th Independence Day : 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు.
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
“ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ పరంగా 'ఫ్రజైల్ ఫైవ్' జాబితాలో నిలిచిన భారతదేశం.. ఇప్పుడు కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆశించిన వేగంతో ప్రగతి సాధ్యపడకపోయినా, నేడు మాత్రం దేశం ఊహించని వేగంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది,” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
“నూట నలభై కోట్ల మంది భారతీయుల సంకల్ప బలం, శక్తి సామర్థ్యాలతో 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలనే బృహత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుండటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది, భారత్ పట్ల ప్రపంచం చూసే చూపు పూర్తిగా మారిపోయింది. మనం పెద్దపెద్ద కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకోవాలి. పెద్ద కలలు కంటేనే మన ఆలోచనా ధోరణి, విజన్ మెరుగుపడుతుంది,” అని మోదీ అన్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తులపై స్పందిస్తూ.. యావత్ భారత దేశం బాధితుల వెంటే ఉంటుందన్నారు.
దేశ చరిత్రలో తొలిసారి.. వందే మాతరం!
ఈ వేడుకల్లో మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ప్రసిద్ధ జాతీయ గీతం 'వందే మాతరం' ట్యూన్‌ను ఎర్రకోట వేడుకల్లో ఆర్మీ బ్యాండ్ తొలిసారిగా ప్రదర్శించింది.
ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగ..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే రంగురంగుల తలపాగలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈసారి 80వ స్వాతంత్య్ర వేడుకల కోసం ఆయన రాజస్థానీ, గుజరాత్ సంప్రదాయాన్ని తలపించే ఎరుపు రంగు టై-అండ్-డై తలపాగను ధరించారు. తెల్లటి కుర్తా, చాక్లెట్ బ్రౌన్ వెస్ట్‌తో పాటు త్రివర్ణ పతాక రంగులను పోలిన మూడు పాకెట్ స్క్వేర్లను ఆయన ధరించారు.
ఎర్రకోటకు వచ్చే ముందు.. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని ‘గార్డ్ ఆఫ్ హానర్’ స్వీకరించారు. ఆ తర్వాత ఎర్రకోట ప్రాకారాలపై, వరుసగా 13వసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను ప్రధాని స్మరించుకున్నారు. నూట నలభై కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలతో దేశం అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని ఆయన శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
వేడుకలకు ప్రత్యేక అతిథులు..
ఈ చారిత్రక వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి దాదాపు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు! మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ స్వచ్ఛంద సేవాకులు, ముద్రా యోజన లబ్ధిదారులు, స్వచ్ఛ భారత్ సిబ్బంది, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెట్రో కార్మికులు, కర్తవ్య పథ్ కార్మికులు ఎర్రకోట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అలాగే పీఎం సూర్య ఘర్ యోజన లబ్ధిదారులు, విశ్వకర్మ పథకం శిల్పులు, స్టార్టప్ ఫౌండర్లు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన యువత ఈ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


