8వ వేతన సంఘం: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన 5 అప్‌డేట్లు
8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ వేగవంతమైంది. సెప్టెంబర్ 7న చెన్నైలో భేటీతో ప్రారంభమైన ఈ పర్యటనల షెడ్యూల్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాలు, పెన్షన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తెలుసుకోవాల్సిన 5 కీలకమైన అంశాలు ఇవే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వేతన సవరణ, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు పే కమిషన్ తన సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 7, 2026) తమిళనాడు రాజధాని చెన్నైలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించింది.

ఢిల్లీ, లద్దాఖ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటికే చర్చలు పూర్తి చేసుకున్న కమిషన్.. ప్రస్తుతం తదుపరి దశ సంప్రదింపులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తప్పక తెలుసుకోవాల్సిన 5 ప్రధాన ముఖ్యాంశాలు ఇవే:
1. చెన్నై భేటీతో తదుపరి విడత సంప్రదింపులు
పే కమిషన్ అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 7, 8 తేదీలలో చెన్నైలో ప్రతినిధుల భేటీలు జరగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన ప్రకటనను కమిషన్ జులై 24నే విడుదల చేయగా, దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 18ని తుది గడువుగా నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు, సంబంధిత వర్గాలు తమ వేతన సవరణలు, పెన్షన్ సంస్కరణలు, భత్యాల పెంపుపై తమ విజ్ఞప్తులు, సూచనలను కమిషన్‌కు నేరుగా వివరించనున్నారు.
2. ప్రధానంగా చర్చకు రానున్న కీలక అంశాలు
ఈ సంప్రదింపుల సమావేశంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) గుణకం ఎంత ఉండాలి? జీతాల సవరణ ఏ ప్రాతిపదికన జరగాలి? పెన్షనర్ల లబ్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వర్కింగ్ కండిషన్లు, ఉద్యోగుల వివిధ భత్యాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మార్గాలపై అభిప్రాయాలు సేకరిస్తారు.
3. పే కమిషన్ గడువు.. ప్రస్తుత పురోగతి
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంది. తుది నివేదికను సమర్పించడానికి కమిషన్‌కు 18 నెలల వ్యవధిని ఇచ్చింది. ఇప్పటివరకు కమిషన్ తన గడువులో 10 నెలల కాలాన్ని పూర్తి చేసుకుంది. మిగిలిన వ్యవధిలో వివిధ ప్రాంతాల పర్యటనలు పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
4. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఇంకా రాని స్పష్టత
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేదా జీతాల పెంపు, పెన్షన్ల మార్పులపై కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 2.15, 2.28 లేదా 2.57 వంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల అంచనాలు కేవలం ఊహాగానాలు మాత్రమే. 6వ వేతన సంఘంలో 1.86, 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేశారు. అయితే, 8వ పే కమిషన్ తన తుది నివేదిక సమర్పించి, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించే వరకు ఎలాంటి లెక్కలను అధికారికంగా పరిగణించలేము.
5. తదుపరి పర్యటనల షెడ్యూల్ ఇదిగో
చెన్నై పర్యటన ముగిసిన వెంటనే పే కమిషన్ బృందం ఇతర ప్రాంతాలలో పర్యటించనుంది. సెప్టెంబర్ 9న పుదుచ్చేరి, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఛండీగఢ్, అక్టోబర్ 7, 8 తేదీలలో బెంగళూరు నగరాలలో సంప్రదింపుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం కమిషన్ తమ సిఫార్సులను ఖరారు చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పే కమిషన్ వేగంగా పావులు కదుపుతోంది. అయితే తుది నివేదిక వచ్చి, ప్రభుత్వం అధికారిక నిర్ణయం ప్రకటించే వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేదా జీతాల పెంపునకు సంబంధించిన అంచనాలను ప్రామాణికంగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కమిషన్ ఇచ్చే అధికారిక సిఫార్సుల కోసమే ఉద్యోగులంతా నిరీక్షిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


