8వ వేతన సంఘం : ఉద్యోగుల కనీస వేతనం రూ. 69వేలకు పెంపు! 3.83 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ సాధ్యమేనా?

8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులపై ఉద్యోగ సంఘాల నేత శివగోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదంపై స్పష్టత లేకపోయినా, 2026 జనవరి నుంచే ఏరియర్స్ చెల్లించడం వంద శాతం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..

Published on: Nov 22, 2026, 07:30:35 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల కోసం దేశవ్యాప్తంగా కోటికి పైగా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ వేతనాలు ఎంత పెరుగుతాయి, ఏరియర్స్ ఎప్పటి నుంచి అందుతాయి అన్న సందేహాల నడుమ నేషనల్ కౌన్సిల్ (జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ - ఎన్​సీ-జేసీఎం) స్టాఫ్ సైడ్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కీలక విషయాలు వెల్లడించారు. ఉద్యోగుల తరఫున కమిషన్‌తో సంప్రదింపులు జరుపుతున్న ప్రధాన నేతల్లో ఒకరైన ఆయన, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాజా పరిస్థితిని వివరించారు. 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్‌ను కమిషన్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని, అయితే 2026 జనవరి నుంచే బకాయిలు రావడం మాత్రం వంద శాతం ఖాయమని స్పష్టం చేశారు.

8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం నిర్ణయాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర ధరల నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఖరారవుతుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మిశ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

పే కమిషన్‌తో జరిగిన చర్చల తీరును వివరిస్తూ.. "8వ వేతన సంఘం మా డిమాండ్లను ఎంతో ఓపికగా వినింది. మేము అందించిన సూచనలను వారు నమోదు చేసుకున్నారు," అని శివగోపాల్ మిశ్రా తెలిపారు. తాము కోరిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కమిషన్ అంగీకరిస్తుందన్న నమ్మకం ఉందా అని ప్రశ్నించగా, ఆయన ముందస్తు అంచనాలు వేయడానికి నిరాకరించారు.

అయితే సరైన గణాంకాలతో కూడిన న్యాయమైన డిమాండ్లనే కమిషన్ ముందు ఉంచామని చెబుతూ, "భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము," అని మిశ్రా వ్యాఖ్యానించారు.

ఒకవేళ 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు 8వ పే కమిషన్ నుంచి ఆమోదం లభిస్తే, కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000 నుంచి ఏకంగా రూ. 69,000కు పెరుగుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన 2.57 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

అయితే బకాయిల విషయంలో మాత్రం ఆయనకు ఎలాంటి సందేహం లేదు. "2026 జనవరి నుంచి ఏరియర్స్ అమల్లోకి రావడం వంద శాతం ఖాయం. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎవరైనా దీనికి భిన్నంగా చెబితే నేను అంగీకరించను," అని శివగోపాల్ మిశ్రా తేల్చిచెప్పారు. "ఎన్‌సీ-జేసీఎం స్టాఫ్ సైడ్ కార్యదర్శిగా చెబుతున్నాను.. 8వ వేతన సంఘం సిఫార్సులు వెనుకటి తేదీ నుంచే అమలవుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

8వ వేతన సంఘం- ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..

ఎన్‌సీ-జేసీఎం స్టాఫ్ సైడ్ ఈ ఏడాది ప్రారంభంలోనే తమ వినతిపత్రాన్ని కమిషన్‌కు సమర్పించింది. ప్రస్తుత బేసిక్ పే, పెన్షన్లను సవరించడానికి 3.833 చొప్పున ఏకరీతి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. ఇది ఆమోదం పొందితే కనీస ప్రాథమిక వేతనం నెలకు రూ. 18,000 నుంచి సుమారు రూ. 69,000కు చేరుతుంది. గతంలో 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేసింది.

దీనితో పాటు ఏటా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌ను 3 శాతం నుంచి 6 శాతానికి రెట్టింపు చేయాలని వినతిపత్రంలో కోరారు. వేతన నిర్మాణాన్ని మరింత సరళతరం చేయడానికి పలు పే లెవల్స్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించారు. లెవల్ 2, 3 లను ఒకటిగా, లెవల్ 4, 5 లను ఒకటిగా, లెవల్ 7, 8 లను ఒకటిగా, లెవల్ 9, 10 లను ఒకటిగా కలపాలని సూచించారు. లెవల్ 5 ఉద్యోగులకు ఒకేసారి లెవల్ 6 కు పదోన్నతి కల్పించాలని, లెవల్ 13 వరకు సరళమైన పే మ్యాట్రిక్స్ రూపొందించాలని కోరారు.

ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం రోజుకు 3,490 కిలోక్యాలరీల ఆహారం, ఇంటి అద్దె, ఇతర రోజువారీ ఖర్చులను లెక్కించి కనీస వేతనాన్ని నిర్ధారించారు.

మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు 3.61 నుంచి 4 వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని ప్రతిపాదించాయి!

8వ పే కమిషన్ నివేదిక ఎప్పుడు? ఏరియర్స్ లెక్కేంటి?

2025 నవంబర్ 3న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ 8వ పే కమిషన్​ను అధికారికంగా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) రంజనా ప్రకాశ్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిషన్‌లో ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్-టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ మెంబర్-సెక్రటరీగా ఉన్నారు. నివేదిక సమర్పించడానికి కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చారు; అంటే 2027 మే నెల నాటికి తుది నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాంతీయ సంప్రదింపులను కమిషన్ పూర్తి చేసింది.

7వ వేతన సంఘం కాలపరిమితి 2025 డిసెంబర్ 31తో ముగియడంతో, 2026 జనవరి 1 నుంచే కొత్త వేతనాలు వర్తిస్తాయని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అమలు తేదీపై అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు. కమిషన్ నివేదిక అందిన తర్వాత, దాన్ని సమీక్షించాకే వేతనాలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అమలు తేదీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది.

గతంలో 7వ వేతన సంఘం సిఫార్సులకు 2016 మధ్యలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినప్పటికీ, 2016 జనవరి 1 నుంచే వాటిని అమలు చేసి ఏరియర్స్ చెల్లించారు. అదే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.