8వ పే కమిషన్: రూ.18,000 బేసిక్ పే ఎంత కానుంది? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులు ఇవే
8వ పే కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ఆసక్తి నెలకొంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 నుంచి 4 వరకు పెరిగితే బేసిక్ పే ఎలా మారుతుందో, యూనియన్ల డిమాండ్లు, అంచనాల వివరాలు ఇవే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణను ఖరారు చేసే 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటై 2026 నవంబర్ 3 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. తుది నివేదికను సమర్పించేందుకు కమిషన్‌కు మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలతో పాటు అత్యంత కీలకమైన 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) ఖరారుపై కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

యూనియన్ల డిమాండ్లు.. 4 రెట్ల వరకు పెంచాలని విజ్ఞప్తి
పదేళ్లకు ఒకసారి మాత్రమే పే కమిషన్ ద్వారా వేతనాలు, పెన్షన్లను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉద్యోగులకు లభిస్తుంది. మార్కెట్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.
ఎన్సీ-జేసీఎం స్టాఫ్ సైడ్ (NC-JCM Staff Side) 3.833 రెట్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తుండగా, భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంగ్ (BPMS) ఒకడుగు ముందుకేసి 4 రెట్లు పెంచాలని కోరుతోంది. భారత్ పెన్షనర్స్ సమాజ్ (BPS), ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ (FNPO) వంటి సంఘాలు కూడా తమ ప్రతిపాదనలను నివేదికల రూపంలో కమిషన్‌కు సమర్పించాయి. గతంలో 6వ పే కమిషన్‌లో 1.86, 7వ పే కమిషన్‌లో 2.57గా ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లతో పోలిస్తే యూనియన్లు ప్రస్తుతం కోరుతున్న పరిమాణం చాలా ఎక్కువ.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? బేసిక్ పే ఎలా లెక్కిస్తారు?
ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనానికి (Basic Pay) వర్తింపజేసే గుణకాన్నే (Multiplier) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. 7వ పే కమిషన్‌లో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడంతో కనీస ప్రాథమిక వేతనం రూ.7,000 నుంచి రూ.18,000కి పెరిగింది.
ప్రాథమిక వేతనాన్ని లెక్కించే సూత్రం: ప్రస్తుత బేసిక్ పే × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త బేసిక్ పే
ఉదాహరణకు: 7వ సీపీసీలో రూ.7,000 × 2.57 = రూ.17,990 కాగా, దాన్ని రౌండ్ ఆఫ్ చేసి రూ.18,000గా నిర్ణయించారు. ఈ బేసిక్ పే ఆధారంగానే కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA) వంటివి వేరుగా లెక్కిస్తారు.
వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ల ఆధారంగా బేసిక్ పే లెక్కింపు
ఒకవేళ కమిషన్ 2 నుంచి 4 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేస్తే, ప్రస్తుతం రూ.18,000 కనీస బేసిక్ పే తీసుకుంటున్న ఉద్యోగి కొత్త ప్రాథమిక వేతనం ఏ విధంగా మారవచ్చో చూద్దాం:
- 2.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: రూ.18,000 × 2.0 = రూ.36,000
- 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: రూ.18,000 × 2.5 = రూ.45,000
- 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: రూ.18,000 × 3.0 = రూ.54,000
- 3.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: రూ.18,000 × 3.5 = రూ.63,000
- 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: రూ.18,000 × 4.0 = రూ.72,000

సిఫార్సులు ఎప్పుడు వస్తాయి?
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 8వ పే కమిషన్‌ను 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పించడానికి కమిషన్‌కు 18 నెలల గడువు కేటాయించారు. ఈ అంచనా ప్రకారం 2027 మే-జూన్ నాటికి కమిషన్ తన తుది సిఫార్సులను ప్రభుత్వానికి అందించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నివేదికను సమగ్రంగా పరిశీలించి ఆమోదంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఉద్యోగులు గమనించాల్సిన అంశం
పైన పేర్కొన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులు కేవలం అంచనాలు మాత్రమే. ప్రభుత్వం లేదా కమిషన్ వీటిని ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. తుది నివేదిక వెలువడిన తర్వాతే అసలు వేతన పెంపుపై స్పష్టత వస్తుంది. అలాగే ఈ లెక్కింపులు కేవలం బేసిక్ పేకి మాత్రమే వర్తిస్తాయి. అలవెన్సులు కలిపిన తర్వాత చేతికి వచ్చే నెలకు మొత్తం జీతం వేరుగా ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


