8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 69,000కి పెరుగుతుందా?
8th Pay Commission latest news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 69,000కి పెరుగుతుందా? ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఫిట్‌మెంట్ ఎంత ఉంత ఉండొచ్చు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేచిచూపులకు తెరదించుతూ 8వ వేతన సంఘం కసరత్తు ముమ్మరమైంది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్, తాజాగా ఉద్యోగ సంఘాల నుంచి కీలక ప్రతిపాదనలను స్వీకరించింది. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాల్లో భారీ మార్పులు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధి సంస్థ అయిన 'నేషనల్ కౌన్సిల్ - జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ' (ఎన్సీ- జేసీఎం) ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు:
కనీస వేతనం : ప్రస్తుతమున్న రూ. 18,000 నుంచి రూ. 69,000కు పెంచాలి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ : వేతన సవరణ కోసం 3.83 మల్టిప్లైయర్‌ను వాడాలి.
వార్షిక ఇంక్రిమెంట్: ప్రతి ఏడాది ఇచ్చే ఇంక్రిమెంట్‌ను 3% నుంచి 6%కి పెంచాలి.
హెచ్‌ఆర్‌ఏ: కనీస హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను 30% వద్ద ఉంచాలి.
పెన్షన్: చివరిగా తీసుకున్న జీతంలో 67శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి (ప్రస్తుతం 50% ఉంది).
పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్): నూతన పెన్షన్ విధానాలను పక్కన పెట్టి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలి.
8వ వేతన సంఘంతో మారే అంశాలేంటి?
8 వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే, కేవలం మూల వేతనం (బేసిక్ పే) మాత్రమే కాదు, దానిపై ఆధారపడి ఉండే అన్ని రకాల అలవెన్సులు మారుతాయి.
బేసిక్ పే: ఇది కొత్త పే మ్యాట్రిక్స్ ప్రకారం పెరుగుతుంది.
డీఏ : 2026 మధ్య నాటికి డీఏ 65-70% చేరుకోవచ్చని అంచనా. దీనిని బేసిక్ పేలో విలీనం చేసి, డీఏను మళ్లీ సున్నా (0) నుంచి ప్రారంభిస్తారు.
అలవెన్సులు: హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఏ) అన్నీ కొత్త బేసిక్ పే ఆధారంగానే లెక్కించబడతాయి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
పాత జీతాల నిర్మాణం నుంచి కొత్త జీతాల నిర్మాణంలోకి మారేటప్పుడు వాడే 'మ్యాజిక్ నంబర్' లేదా గుణకాన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు.
సూత్రం: పాత బేసిక్ పే x ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త బేసిక్ పే.
ఉదాహరణకు, ఒక ఉద్యోగి పాత బేసిక్ రూ. 20,000 అనుకుంటే, డిమాండ్ చేసిన 3.83 ఫ్యాక్టర్ వర్తింపజేస్తే కొత్త బేసిక్ రూ. 76,600 అవుతుంది. అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అంకెపైనే అసలు జీతం ఆధారపడి ఉంటుంది.
| పే కమిషన్ | ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ | మినిమమ్ బేసిక్ పే |
|---|---|---|
| 7వ సీపీసీ (2016) | 2.57 | రూ. 18,000 |
| 8వ సీపీసీ (డిమాండ్) | 3.83 | రూ. 69,000 |
కనీస వేతనం రూ. 69,000 ఎందుకు?
'ఐక్రోయిడ్ ఫార్ములా' ఆధారంగా ఈ గణన చేశారు. 2016 నుంచి పెరిగిన ద్రవ్యోల్బణం, గృహ నిర్మాణ ఖర్చులు, విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే రూ. 69,000 అనేది నేటి జీవన ప్రమాణాలకు అవసరమని సంఘాలు వాదిస్తున్నాయి.
అరియర్స్ ఎప్పుడు వస్తాయి?
8వ వేతన సంఘం అమలుకు అధికారిక తేదీ జనవరి 1, 2026. కమిషన్ తన నివేదికను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంటుంది (అంటే 2027 మధ్య నాటికి). కాబట్టి, నోటిఫికేషన్ వచ్చే వరకు ఉద్యోగులు పాత జీతాలే తీసుకుంటారు. ప్రభుత్వం అధికారికంగా అమలు చేసినప్పుడు, జనవరి 1, 2026 నుంచి పెరిగిన జీతాన్ని లెక్కించి, ఆ వ్యత్యాసాన్ని లంప్‌సమ్ అరియర్స్ రూపంలో చెల్లిస్తారు.
పెన్షనర్లకు ఊరట..
పెన్షనర్లు కూడా తమ డిమాండ్లను గట్టిగానే వినిపిస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వం 'యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్' (యూపీఎస్) తెచ్చినప్పటికీ, చాలా మంది ఓపీఎస్ కోసమే మొగ్గు చూపుతున్నారు. బేసిక్ పే పెరిగితే, పెన్షనర్ల నెలవారీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
దీని అమలు తేదీ జనవరి 1, 2026గా నిర్ణయించారు. అయితే పూర్తిస్థాయి జీతాల పెంపు నోటిఫికేషన్ రావడానికి 2027 వరకు సమయం పట్టవచ్చు.
2. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం ఖరారు చేసిందా?
లేదు. ప్రస్తుతం ఎన్సీ- జేసీఎం 3.83గా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతకంటే తక్కువ లేదా ఎక్కువ నిర్ణయించే అవకాశం ఉంటుంది.
3. డీఏ సున్నా అవుతుందా?
అవును. సాధారణంగా కొత్త వేతన సంఘం అమలైనప్పుడు, అప్పటివరకు ఉన్న డీఏను బేసిక్ పేలో కలిపేసి, డీఏను మళ్లీ 0% నుంచి లెక్కిస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


