అధిక లాభాలనిచ్చే షేర్ల ఎంపిక ఎలా? ఫండమెంటల్ అనాలిసిస్ సూత్రాలివే

స్టాక్ మార్కెట్‌లో సరైన కంపెనీలను ఎంచుకోవడానికి 'ఫండమెంటల్ అనాలిసిస్' ఎంతో కీలకం. ఆయా కంపెనీల ఆర్థిక బలాబలాలు, వృద్ధి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ లాభదాయకమైన షేర్లను ఎలా గుర్తించాలో కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అందించిన విశ్లేషణ.

Published on: Jul 20, 2026, 12:47:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

"స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం షేర్లు కొనడం మాత్రమే కాదు, కాలక్రమేణా విలువ పెరిగే ఆస్తులను (అసెట్స్) ఎంచుకోవడం. మార్కెట్‌లో వేలాది కంపెనీలు ఉన్నప్పటికీ, వాటిలో మెరుగైన వాటిని ఎంచుకోవడానికి మౌలిక విశ్లేషణ (ఫండమెంటల్ అనాలిసిస్) మార్గం చూపుతుంది.

కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

కంపెనీ ఆర్థిక ఆరోగ్యం, భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని పరిశీలించడం ద్వారా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి?

ఒక కంపెనీ నిజమైన విలువను అర్థం చేసుకోవడమే ఫండమెంటల్ అనాలిసిస్. ఇందుకోసం ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు:

ఆదాయం, లాభాలు (Revenue and Earnings): కంపెనీ మొత్తం అమ్మకాలు (రెవెన్యూ), ఆర్జించే నికర లాభం ఎంతో ఇవి చూపిస్తాయి. క్రమంగా లాభాలను పెంచుకునే కంపెనీల్లో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రాఫిట్ మార్జిన్లు (Profit Margins): కంపెనీ ఎంత సమర్థవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోందో ఇది తెలుపుతుంది. అధిక ప్రాఫిట్ మార్జిన్లు ఉన్న సంస్థల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.

అప్పుల స్థాయి (Debt Levels): పరిమితికి మించిన అప్పులు ఉన్న కంపెనీల్లో పెట్టుబడి ప్రమాదకరంగా మారవచ్చు. రుణాలు తక్కువగా ఉన్న కంపెనీలు భవిష్యత్తులో సులభంగా విస్తరించే అవకాశం ఉంటుంది.

రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE): వాటాదారుల నిధులను ఉపయోగించి కంపెనీ ఎంత లాభాన్ని ఆర్జిస్తోందో ROE తెలియజేస్తుంది. అధిక ROE ఉన్న సంస్థలు పెట్టుబడులను సరైన రీతిలో ఉపయోగిస్తున్నట్లు అర్థం.

యాజమాన్య నైపుణ్యం (Management Quality): కంపెనీ నాయకత్వం చాలా కీలకమైనది. అనుభవజ్ఞులైన లీడర్లు సవాళ్లను ఎదుర్కొని సంస్థను ప్రగతి పథంలో నడిపించగలరు.

పరిశ్రమ, మార్కెట్ పరిస్థితులు: కంపెనీ పనిచేస్తున్న రంగానికి ఉన్న డిమాండ్, మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు తెలుస్తాయి.

ఫండమెంటల్ అనాలిసిస్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ విశ్లేషణ ద్వారా లభించే స్పష్టమైన సమాచారంతో పెట్టుబడిదారులు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. షేరు ధరల తాత్కాలిక హెచ్చుతగ్గులను చూసి తొందరపడకుండా, సుదీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయవచ్చు.

మార్కెట్‌లో నిజమైన విలువ కంటే తక్కువ ధరకు లభించే 'అండర్ వాల్యూడ్ షేర్ల'ను (Undervalued Stocks) గుర్తించడంలో ఇది తోడ్పడుతుంది. తక్కువ ధరకు ఇటువంటి షేర్లను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మార్కెట్ వాటి విలువను గుర్తించినప్పుడు మంచి లాభాలు పొందవచ్చు.

వేగంగా పెరిగే షేర్లను గుర్తించడం ఎలా?

కంపెనీ స్థిరత్వంతో పాటు వేగవంతమైన ప్రగతిని సాధించగలదా లేదా అనేది తెలుసుకోవడానికి క్రింది అంశాలు దోహదపడతాయి:

స్థిరమైన లాభాల వృద్ధి: తోటి కంపెనీల కంటే వేగంగా ఆదాయాన్ని, లాభాలను పెంచుకునే సంస్థలు వేగవంతమైన వృద్ధిని కనబరుస్తాయి.

తక్కువ రుణాలు: వృద్ధి చెందే కంపెనీలు రుణాలు తీసుకోకుండా, సొంత వ్యాపార రాబడిపైనే ఆధారపడతాయి. తక్కువ అప్పులు ఉన్న కంపెనీలు కష్టసమయాలను తట్టుకుని నిలబడతాయి.

బలమైన ప్రాఫిట్ మార్జిన్లు: మంచి మార్జిన్లు ఉన్న కంపెనీలు వ్యాపార విస్తరణలో తిరిగి పెట్టుబడులు పెట్టగలవు.

విశిష్టమైన ఉత్పత్తులు, సేవలు: పునరుత్పాదక ఇంధనం (Renewable Energy), టెక్నాలజీ, హెల్త్‌కేర్ వంటి భవిష్యత్తు అవసరాలకు తగిన వినూత్న ఉత్పత్తులను అందించే కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతాయి.

అనుభవజ్ఞులైన లీడర్‌షిప్: అవకాశాలను విజయాలుగా మలచడంలో అనుభవజ్ఞులైన నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కేవలం స్వల్పకాలిక ధరల మార్పులను అంచనా వేసేది కాదు. ఇది ఒక వ్యాపార బలాన్ని, దాని దీర్ఘకాలిక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ, సహనం, సుదీర్ఘ దృక్పథంతో ఈ విశ్లేషణను ఉపయోగిస్తే లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు.

వ్యాసకర్త: శ్రీకాంత్ చౌహాన్,

హెడ్ - ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More