Prabhu Deva : 548 కి.మీ రేంజ్​ ఇచ్చే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని కొన్న ప్రభుదేవా- ధర తెలిస్తే షాక్..

MG M9 : భారతీయ డ్యాన్స్ సంచలనం, ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా గ్యారేజ్‌లోకి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రానిక్ కార్ వచ్చి చేరింది. ఆయన ఎంజీ మోటార్స్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎంపీవీ 'ఎంజీ ఎం9' కారును కొనుగోలు చేశారు. ఈ మోడల్​ ధర, రేంజ్ సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 20, 2026, 17:20:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ కొనుగోలు చేశారు. ఫలితంగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న భారతీయ సెలబ్రిటీల జాబితాలో ఆయన కూడా చేరిపోయారు. ఎంజీ మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ మోడల్ ‘ఎంజీ ఎం9’ ను ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే కాంక్రీట్ గ్రే రంగులో మెరిసిపోతున్న ఈ సరికొత్త కారును ప్రభుదేవా తన నివాసంలో డెలివరీ తీసుకున్నారు. అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు, విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేసిన ఈ కారు ప్రస్తుతం సెలబ్రిటీల ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ..
ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ..

ఎంజీ ఎం9: అదిరిపోయే లుక్.. భారీ కొలతలు

ఎంజీ మోటార్స్ తన ప్రీమియం నెట్‌వర్క్ ‘ఎంజీ సెలెక్ట్’ ద్వారా ఈ ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని విక్రయిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ వాహనాలతో పోలిస్తే దీని పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది.

ఈ ఎంజీ ఎమ్9 కారు ఏకంగా 5,270 మిల్లీమీటర్ల పొడవు, 3,200 మిల్లీమీటర్ల భారీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల కారు లోపల మూడు వరుసల్లో కూర్చునే ప్రయాణికులకు కూడా అత్యంత విశాలమైన స్థలం లభిస్తుంది. నిటారుగా ఉండే బోల్డ్ ఫ్రంట్ డిజైన్, సరికొత్త స్లీక్ ఎల్‌ఈడీ లైటింగ్, క్రోమ్ ఫినిషింగ్, పెద్ద విండోస్, వెనుక వైపు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండే ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు రోడ్డుపై ఒక రాజసం ఉట్టిపడేలా ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో ఉన్న అత్యంత ప్రధానమైన ఆకర్షణ దాని రెండవ వరుసలో ఉండే ‘కెప్టెన్ సీట్లు’. ఈ సీట్లను ఎలక్ట్రికల్‌గా మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలో హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికులు అలసిపోయినప్పుడు ఈ సీట్లను దాదాపు బెడ్‌లాగా వెనుకకు వాల్చుకుని (రిక్లైన్) ప్రశాంతంగా పడుకోవచ్చు! సీటు పక్కనే ఉండే ఆర్మ్‌రెస్ట్‌కు అమర్చిన చిన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా కారులోని వినోదాన్ని, సీటు పొజిషన్లను కస్టమర్లు తమకు నచ్చినట్లు కంట్రోల్ చేయవచ్చు.

దీనితో పాటు ఈ ఎంజీ ఎం9 ఈవీలో వినోదం కోసం పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మన మూడ్‌కు తగ్గట్టుగా మారే అంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రికల్ స్లైడింగ్ డోర్స్, మెమరీ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరెన్నో ప్రీమియం ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ ఎలా ఉందంటే?

ఎంజీ ఎం9 లగ్జరీ కారులో అత్యంత శక్తివంతమైన 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 245 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 548 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఇది సిటీ రోడ్లపై రోజువారీ ప్రయాణాలకే కాకుండా, సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి కూడా అద్భుతంగా సరిపోతుంది. భద్రత విషయానికి వస్తే.. ఇందులో లేటెస్ట్ లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అత్యంత బలమైన బాడీ స్ట్రక్చర్‌ను అందించారు.

కారు ధర ఎంత?

భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎంజీ సెలెక్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే ఈ కారు ప్రత్యేకంగా సేల్​లో ఉంది. దేశీయ మార్కెట్లో ఈ ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75.90 లక్షలుగా ఉంది.

ఇక ఈ ఎంజీ ఎం9 కారును కొనుగోలు చేయడం ద్వారా.. దేశంలో ఎంజీ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఎంచుకున్న ప్రముఖ లగ్జరీ కార్ల యజమానుల జాబితాలో ప్రభుదేవా చేరారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఇటీవలే ఈ ఎంపీవీని కొన్నారు. ఫలితంగా.. అత్యుత్తమ లగ్జరీ, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన కంఫర్ట్, బెస్ట్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్‌తో కూడిన ఎంజీ ఎం9.. ప్రస్తుతం భారతీయ లగ్జరీ ఈవీ మార్కెట్లో మోస్ట్ వాంటెడ్ కారుగా దూసుకుపోతోంది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More