Electric Hatchback: ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్- త్వరలోనే గ్లోబల్ డెబ్యూ!
Electric cars : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ సరికొత్త బీ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు టీజర్‌ను విడుదల చేసింది. 2026 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో పోటీ తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'ఎంజీ మోటార్' తన సరికొత్త, గ్లోబల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన మొదటి టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. 2026 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ వేదికగా ఈ కారును ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అంతర్జాతీయ మార్కెట్లో బీ-సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ సరికొత్త ఈవీ.. వోక్స్‌వ్యాగన్ ఐడీ పోలో, రెనాల్ట్ 5 ఈ-టెక్, ప్యుజో ఈ-208 వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి దీని సాంకేతిక వివరాలను కంపెనీ రహస్యంగా ఉంచినప్పటికీ, టీజర్ చిత్రాల ద్వారా ఈ కారు డిజైన్ ఎలా ఉండబోతోందనే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారు- ఆధునిక, స్పోర్టీ డిజైన్..
ఎంజీ విడుదల చేసిన టీజర్ చిత్రాలను గమనిస్తే.. ఈ సరికొత్త కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ చాలా క్లీన్, ఫ్యూచరిస్టిక్ (భవిష్యత్ తరం) లుక్‌ను కలిగి ఉంది. కారు ముందు భాగంలో నలుపు రంగు ట్రిమ్ ముక్కతో అనుసంధానించిన స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక ఎలక్ట్రిక్ కార్లలో ఉండేలా దీనికి కూడా క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్‌ను ఇచ్చారు. కారు ఫ్రంట్ బంపర్ డిజైన్ చాలా షార్ప్‌గా ఉండి, వాహనానికి ఒక స్పోర్టీ లుక్‌ను తీసుకువచ్చింది.
సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే.. ఈ హ్యాచ్‌బ్యాక్ స్మూత్ బాడీ ప్యానెల్స్, ఉబ్బెత్తుగా ఉండే వీల్ ఆర్చ్‌లు, వెనుక వైపు కొద్దిగా వంగి ఉండే రూఫ్‌లైన్‌తో కనిపిస్తుంది. అంతేకాకుండా, కారు వెనుక పిల్లర్‌పై ఎంజీ బ్రాండ్ లోగోను అమర్చడం ద్వారా దీనికి ఒక విలక్షణమైన స్టైలిష్ టచ్ ఇచ్చారు. వెనుక భాగంలో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, పిక్సెల్-ఇన్‌స్పైర్డ్ లైటింగ్ ఎలిమెంట్స్ కలిగిన స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి కారుకు మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇస్తున్నాయి.
ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారు- ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు?
ఈ కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ లోపలి భాగం ఎలా ఉంటుందో ఎంజీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఇందులో టెక్నాలజీతో కూడిన క్యాబిన్‌ను అందించబోతున్నట్లు సమాచారం. పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
ఇవి మాత్రమే కాకుండా ఆధునిక ఈవీ కార్లలో అత్యంత కీలకమైన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, వివిధ రకాల డ్రైవింగ్ మోడ్‌లు, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉంది.
ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారు- మార్కెట్ లాంచ్ ఎప్పుడు?
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును అత్యంత పోటీతో కూడిన బీ-సెగ్మెంట్లో పొజిషన్ చేయనున్నట్లు నిర్ధారించిన ఎంజీ.. దీనిని 2027 నాటికి అంతర్జాతీయ షోరూమ్‌లలో అమ్మకానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులు ప్రధానంగా చూసే డ్రైవింగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యానికి ఈ మోడల్‌లో ఎంజీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం, పర్ఫార్మెన్స్ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇది ప్రముఖ ఎస్‌ఏఐసీ మోటార్ గ్రూప్‌నకు చెందిన ఇతర ఈవీల సాంకేతికతను పంచుకునే అవకాశం ఉంది.
మరి దీని పేరు ఏంటి? రేంజ్ ఎంత? ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది? వంటి వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంది.
ఈ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు గుడ్‌వుడ్ ఫెస్టివల్‌లో ఎంజీ మరొక సరికొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును కూడా ప్రదర్శించబోతోంది. దీని ద్వారా గ్లోబల్ ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ కారుకు సంబంధించిన ఇంటీరియర్, బ్యాటరీ స్పెసిఫికేషన్లు, రేంజ్, లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు జులై 9న జరిగే అధికారిక గ్లోబల్ డెబ్యూ సమయంలో బయటకు రానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


