Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ లాంచ్​.. ఈ నెలలోనే? 500 కి.మీ రేంజ్​తో!

Tata Sierra EV India launch date : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'టాటా సియెర్రా ఈవీ'ని ఈ జూన్​లోనే లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అధునాతన ఫీచర్లు, 500 కిలోమీటర్ల రేంజ్‌తో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వివరాలు ఇవే..

Published on: Jun 11, 2026, 06:43:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tata Sierra EV range : భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్​లో తిరుగులేని దూకుడు మీదున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్'.. తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. ఆటో ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ 'టాటా సియెర్రా ఈవీ' ఇండియాలోకి అడుగుపెట్టడానికి ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జూన్ 20న దేశీయ మార్కెట్​లో అధికారికంగా విడుదల కానుంది. లాంచ్ అయిన కొన్ని వారాల్లోనే కస్టమర్లకు డెలివరీలు కూడా ప్రారంభించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోందట.

టాటా సియెర్రా ఈవీ లాంచ్​ డేట్ ఇదేనా..
టాటా సియెర్రా ఈవీ లాంచ్​ డేట్ ఇదేనా..

టాటా కార్ల లైనప్‌లో ఈ కొత్త సియెర్రా ఈవీ మోడల్.. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న కర్వ్ ఈవీకి పైన, హారియర్ ఈవీకి కింద మిడ్-రేంజ్ విభాగంలో నిలవనుంది. మార్కెట్​లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతీ ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో తలపడనుంది. పోటీ తీవ్రంగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో కారు మైలేజ్ (రేంజ్), ఫీచర్లు, ధరలు విజయానికి కీలకం కానున్నాయి.

టాటా సియెర్రా ఈవీ- అదిరిపోయే లుక్.. ఐకానిక్ డిజైన్!

డిజైన్ విషయానికి వస్తే, టాటా సియెర్రా పాత క్లాసిక్ లుక్‌ను గుర్తుచేస్తూనే, ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలకు తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేశారు.

ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో బాడీ కలర్‌తో కూడిన క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. ఇది కారుకు చాలా క్లీన్ అండ్ మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. దీనితో పాటు కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ లైట్లను అమర్చారు.

రియర్ డిజైన్: కారు వెనుక భాగంలో కూడా ఇరువైపులా కలుపుతూ ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్‌ను ఇచ్చారు. స్లీక్ టెయిల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో పాటు రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, రియర్ డిఫాగర్, చక్కగా డిజైన్ చేసిన రియర్ వైపర్‌ను అమర్చడం వల్ల కారు లుక్ మరింత స్పోర్టీగా మారింది.

టాటా సియెర్రా ఈవీ- లగ్జరీ క్యాబిన్.. ట్రిపుల్ స్క్రీన్ మ్యాజిక్!

ఇటీవల రోడ్ టెస్టింగ్‌లో దొరికిన స్పై చిత్రాల ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇంటీరియర్ వివరాలు లీకయ్యాయి. సియెర్రా ఈవీ బేస్ వేరియంట్లలో కూడా పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (దాదాపు 12.3 ఇంచులు), అలాగే 10.25 ఇంచుల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిస్తున్నారు. ఇక టాప్-ఎండ్ వేరియంట్లలో అయితే పెట్రోల్/డీజిల్ వెర్షన్ తరహాలోనే ప్రీమియం 'ట్రిపుల్-స్క్రీన్' లేఅవుట్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

భద్రత, సౌకర్యం కోసం ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ సెలెక్టర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. వీటితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 12-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ అంతటా యాంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ.. 500 కిమీ రేంజ్!

టాటా మోటార్స్ ఈ కారు బ్యాటరీ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ సియెర్రా ఈవీని విభిన్న కస్టమర్ల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకువస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 55 కేడబ్ల్యూహెచ్, 65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. అవసరమైతే హారియర్ ఈవీలో వాడే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా ఇందులో ఇచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి ఛార్జింగ్‌పై ఈ కారు దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా.

అయితే ఈ ఈవీ లాంచ్​ డేట్​ని టాటా మోటార్స్​ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డేట్​పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More