Tesla Model Y L : 680 కి.మీ రేంజ్ ఇచ్చే టెస్లా 'మోడల్ వై ఎల్' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్..
Tesla cars in India : ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తన సరికొత్త 'మోడల్ వై ఎల్' ఎస్‌యూవీ డెలివరీలను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. 6 సీట్ల సామర్థ్యం, 681 కిలోమీటర్ల భారీ రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఈవీ ధర రూ. 61.99 లక్షలుగా ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన మార్కెట్‌ను మరింత విస్తరిస్తూ ప్రముఖ అంతర్జాతీయ ఈవీ దిగ్గజం 'టెస్లా' కీలక అడుగు వేసింది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే తన సరికొత్త ‘టెస్లా మోడల్ వై ఎల్’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీలను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. భారత పోర్ట్‌ఫోలియోలో చేరిన ఈ సరికొత్త మోడల్.. మార్కెట్లో ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ మోడల్ వై కారుకు మరింత పెద్ద, ప్రాక్టికల్ వర్షన్‌గా రూపుదిద్దుకుంది. మూడు వరుసల సీటింగ్ అమరికతో, ఒకేసారి ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉన్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ముఖ్యంగా పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని టెస్లా డిజైన్ చేసింది.
కస్టమర్లకు నేరుగా కార్లను విక్రయించే ‘డైరెక్ట్-టు-కన్స్యూమర్’ బిజినెస్ మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మొదటి బ్యాచ్ కస్టమర్లకు ఈ కార్లను టెస్లా ప్రతినిధులు అందజేశారు. ఈ మొదటి విడత డెలివరీలకు సంబంధించిన ఫోటోలను కూడా కంపెనీ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిని బట్టి భారతీయ లగ్జరీ కార్ల ప్రియుల్లో ఈ సరికొత్త మోడల్ వై ఎల్పై ఆసక్తి వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.
ధర, ఫైనాన్స్ ఆఫర్లు..
భారత మార్కెట్లో టెస్లా మోడల్ వై ఎల్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ. 61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతానికి దేశంలో లభిస్తున్న అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం టెస్లా ఆకర్షణీయమైన ఫైనాన్స్ ప్లాన్లను కూడా అందిస్తోంది. బ్యాంక్ నిబంధనల ఆమోదానికి లోబడి.. కేవలం రూ. 6.5 లక్షల ప్రారంభ డౌన్ పేమెంట్, రూ. 49,990 ల ప్రారంభ ఈఎంఐ ఆప్షన్లతో ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
లాంగ్ వీల్‌బేస్‌తో లగ్జరీ స్పేస్..
సాధారణ మోడల్ వై ఎలక్ట్రిక్ కారుకు ఇది లాంగ్-వీల్‌బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) వర్షన్. ఈ ఎస్‌యూవీ పొడవు 4,969 ఎంఎం కాగా, దీని వీల్‌బేస్ 3,040 ఎంఎంగా ఉంది. అంటే స్టాండర్డ్ మోడల్ కంటే ఇది ఏకంగా 150 ఎంఎం అదనపు పొడవును కలిగి ఉంటుంది. ఈ అదనపు స్థలం వల్లే కారులో మూడో వరుస సీట్లను అమర్చడానికి టెస్లాకు వీలైంది. తద్వారా ఇదొక పర్‌ఫెక్ట్ 6-సీటర్ లగ్జరీ ఫ్యామిలీ కారుగా మారింది.
క్యాబిన్ లోపల మరింత లగ్జరీ ఫీల్ తీసుకురావడానికి మధ్య వరుసలో విడివిడిగా ఉండే 'కెప్టెన్ సీట్లను' ఇచ్చారు. దీనివల్ల లోపల స్థలం చాలా విశాలంగా అనిపిస్తుంది. కస్టమర్ల కంఫర్ట్ కోసం పవర్డ్ సీట్ అడ్జస్ట్‌మెంట్, సీట్ వెంటిలేషన్, హీటింగ్ ఫంక్షన్లు, ఆటోమేటిక్‌గా ఫోల్డ్ అయ్యే పవర్డ్ థర్డ్-రో సీట్లు, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్లను ఇందులో ఏర్పాటు చేశారు.
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. 681 కిమీ మైలేజ్!
ఫ్యామిలీ ఎస్‌యూవీ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో టెస్లా ఎక్కడా తగ్గలేదు. ఈ మోడల్ వై ఎల్ కారులో డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సెటప్‌ను అందించారు. ఇది గరిష్టంగా 514 బ్రేక్ హార్స్‌పవర్ (బీహెచ్పీ), 590 న్యూటన్ మీటర్ల (ఎన్ఎం) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కేవలం 5.0 సెకన్లలోనే ఈ భారీ కారు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని టెస్లా పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని డబ్ల్యూఎల్టీపీ సంస్థ ధృవీకరించింది. భారతదేశంలో ప్రస్తుతం లభిస్తున్న అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. పైగా ఇందులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తోనే 288 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు.
మినిమలిస్ట్ ఇంటీరియర్.. టాప్ క్లాస్ సేఫ్టీ
టెస్లా కార్ల ప్రత్యేకత అయిన మినిమలిస్ట్ డిజైన్ ఫిలాసఫీనే ఇందులోనూ కొనసాగించారు. డాష్‌బోర్డ్ మధ్యలో ఉండే పెద్ద 16-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కారులోని అన్ని ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది. ఇవి కాకుండా విశాలమైన పనోరమిక్ గ్లాస్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, ప్రయాణంలో వినోదం కోసం మల్టిపుల్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ సపోర్ట్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రయాణికుల భద్రతకు టెస్లా అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ అవాయిడెన్స్ (కారు లేన్ దాటకుండా చూసే సిస్టమ్), బ్లైండ్-స్పాట్ వార్నింగ్, టెస్లాకు చెందిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి టాప్-క్లాస్ సేఫ్టీ ఫీచర్లను అమర్చారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


