Adani : అదానీపై క్రిమినల్ కేసులు కొట్టేసిన అమెరికా కోర్టు- గ్రీన్‌లో స్టాక్స్..
Adani US case : గౌతమ్ అదానీపై దాఖలైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేయడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు నడిచిన ఈ న్యాయ పోరాటం ముగియడంతో సంస్థ ఊపిరి పీల్చుకుంది. ఈ పరిణామాలపై అదానీ స్పందించారు.
అమెరికా కోర్టు నుంచి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేసింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు గ్రీన్ జోన్లో ట్రేడవుతున్నాయి.
తాజా ట్రేడింగ్ సెషన్‌లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు గరిష్టంగా 0.55 శాతం వరకు లాభపడ్డాయి. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా 0.42 శాతం వరకు పుంజుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసు కొట్టివేత..
గౌతమ్ అదానీ అలాగే ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ కేసును 'విత్ ప్రిజుడీస్' (శాశ్వతంగా మూసివేస్తూ) చేసింది. దీంతో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న లంచం, మోసం ఆరోపణల విచారణ ముగింపునకు వచ్చింది.
న్యూయార్క్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయశాఖ వేసిన మోషన్‌ను ఆమోదించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, మాజీ సీఈవో వినీత్ జైన్‌లపై మోపిన అభియోగాలను రద్దు చేసింది. ఫలితంగా సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ వంటి కుట్ర ఆరోపణల నుంచి వారికి విముక్తి లభించింది. ప్రాసిక్యూటర్లు ఈ కేసుకు సంబంధించి స్పష్టత ఇచ్చిన తర్వాత జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పుతో ఈ కేసును భవిష్యత్తులో మళ్లీ తెరవడానికి కూడా అవకాశం ఉండదు.
2024 నవంబర్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారంటూ అమెరికా ప్రాసిక్యూటర్లు ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చింది. తాము అన్ని నిబంధనలను పాటించామని స్పష్టం చేసింది.
సివిల్ చర్యల పరిష్కారం, జరిమానా..
మరోవైపు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) సివిల్ చర్యలను కూడా పరిష్కరించుకున్నారు. ఈ తీర్పు ప్రకారం గౌతమ్ అదానీ ఎస్ఈసీకి 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు.
న్యాయ వ్యవస్థ పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, ఈ కష్టకాలంలోనూ సత్యంపై నమ్మకం సడలలేదని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. వ్యవస్థపై, భారతదేశ న్యాయంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశం కోసం విలువలను సృష్టిస్తూ ముందుకు సాగుతామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


