విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

Published on: Jan 28, 2026, 10:04:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహారాష్ట్ర రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన అజిత్ పవార్ (66) ఇకలేరు. జనవరి 28, బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం (HT Photo)
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం (HT Photo)

ఏం జరిగింది?

అజిత్ పవార్ తన భద్రతా సిబ్బందితో కలిసి ముంబై నుంచి 'లియర్ జెట్ 45' (Learjet 45 - VT SSK) అనే ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఉదయం 8:48 గంటల ప్రాంతంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది.

బారామతి ఎయిర్‌పోర్ట్ మేనేజర్ శివాజీ తవారే ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ.. "విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే పక్కకు వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలై మంటలు అంటుకున్నాయి" అని తెలిపారు.

ఆరుగురు మృతి

విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు పైలట్లు, మరో వ్యక్తి మొత్తం ఆరుగురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. అజిత్ పవార్ సన్నిహితుడు కిరణ్ గుజర్ స్థానిక ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. "అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్న ఆరుగురిని తీసుకువచ్చేటప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు" అని కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రమాదంపై విచారణ

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ల్యాండింగ్ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బారామతి విమానాశ్రయం ఇటీవల మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (MADC) పరిధిలోకి వచ్చింది.

అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More