నేటి నుంచే FIFA World Cup 2026 సంబరం- ఈసారి కొత్త రూల్స్! భారత్‌లో ఉచితంగా చూసే ఛాన్స్..

FIFA World Cup 2026 : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీ నేటి (జూన్ 11) నుంచి ప్రారంభం కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో 48 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌లో ఈ మెగా ఈవెంట్​ని ఎక్కడ చూడాలి? అసలు ఏ దేశాల్లో ఈ మహా సంగ్రామం జరుగుతోంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 11, 2026, 06:06:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Where to watch fifa world cup 2026 in India : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించే 'మహా సంగ్రామం' ఇంకొన్ని గంటల్లో ప్రారంభంకానుంది! దాదాపు వందేళ్ల ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక క్రీడా పండుగకు ఆతిథ్యం ఇస్తున్నాయి. జట్ల సంఖ్యను పెంచిన తర్వాత జరుగుతున్న మొదటి టోర్నీ ఇది. మొత్తం 48 జట్లు తలపడే ఈ సుదీర్ఘ మెగా టోర్నమెంట్ జూన్ 11న మెక్సికో సిటీలో ఘనంగా ప్రారంభమై, జులై 19న న్యూజెర్సీలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఫుట్‌బాల్ ప్రేమికులకు అవసరమైన పూర్తి సమాచారం, మ్యాచ్‌ల టైమింగ్స్, ఇండియాలో లైవ్ టెలికాస్ట్ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

నేటి నుంచే FIFA World Cup 2026 సంబరం.. (REUTERS)
నేటి నుంచే FIFA World Cup 2026 సంబరం.. (REUTERS)

ఫిఫా వరల్డ్​ కప్ 2026- కొత్త ఫార్మాట్.. సరికొత్త రూల్స్!

ఈ ఫిఫా వరల్డ్​ కప్ 2026లో జట్ల సంఖ్య పెరగడంతో రూల్స్ కూడా మారాయి. మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి.

రౌండ్ ఆఫ్ 32 అర్హత: ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా రౌండ్ ఆఫ్ 32కి చేరుకుంటాయి. వీటితో పాటు, మూడో స్థానంలో నిలిచిన అత్యుత్తమ 8 జట్లకు కూడా తదుపరి రౌండ్ ఆడే అవకాశం లభిస్తుంది. అంటే గ్రూప్ స్టేజ్ ముగిసేసరికి కేవలం 16 జట్లు మాత్రమే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.

పాయింట్ల పట్టిక: మ్యాచ్ గెలిచిన జట్టుకు 3 పాయింట్లు, డ్రా అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. ఓడిపోతే సున్నా పాయింట్లు ఇస్తారు. ప్రతి మ్యాచ్ 90 నిమిషాల పాటు జరుగుతుంది (45 నిమిషాల చొప్పున రెండు హాఫ్‌లు, మధ్యలో 15 నిమిషాల విరామం ఉంటుంది). ఆటగాళ్ల గాయాలు, సబ్‌స్టిట్యూషన్ల సమయాన్ని బట్టి అదనపు సమయాన్ని రిఫరీలు కేటాయిస్తారు.

వాటర్ బ్రేక్స్: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఆటగాళ్ల అలసటను తగ్గించడానికి ఫిఫా ఈసారి తప్పనిసరి ‘వాటర్ బ్రేక్స్’ నిబంధనను తీసుకొచ్చింది.

పెనాల్టీ షూటౌట్: ఫిఫా వరల్డ్​ కప్ 2026 గ్రూప్ దశలో ఎలాంటి పెనాల్టీ షూటౌట్లు ఉండవు. నాకౌట్ దశకు చేరుకున్నాక, నిర్ణీత 90 నిమిషాల్లో స్కోర్లు సమమైతే అదనంగా 30 నిమిషాల సమయం ఇస్తారు. అప్పుడు కూడా మ్యాచ్ తేలకపోతే పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను ప్రకటిస్తారు.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- ఆతిథ్యం ఇస్తున్న 16 నగరాలు ఇవే..

ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లు మూడు దేశాల్లోని మొత్తం 16 స్టేడియాలలో జరగనున్నాయి.

మెక్సికో: మెక్సికో సిటీ, గ్వాడలజారా, మోంటెర్రే.

కెనడా: టొరంటో, వాంకోవర్.

అమెరికా: అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హ్యూస్టన్, కాన్సాస్ సిటీ, లాస్ ఏంజిల్స్, మయామి, న్యూయార్క్/న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- మూడు దేశాల్లో రంగురంగుల ప్రారంభ వేడుకలు..

1. మెక్సికోలో ఓపెనింగ్ ఈవెంట్ :

మెక్సికో సిటీలోని చారిత్రాత్మక ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ర్యాన్ కాస్ట్రో, బెలిండా, బర్నా బాయ్, డానీ ఓషన్, జె బాల్విన్, లీలా డౌన్స్, లాస్ ఏంజిల్స్ అజులెస్ వంటి గ్లోబల్ పాప్ స్టార్స్ తమ లాటిన్ పాప్, ఆఫ్రోబీట్స్, మెక్సికన్ మ్యూజిక్‌తో స్టేజ్‌పై పండగ వాతావరణం తీసుకురానున్నారు.

భారత కాలమానం ప్రకారం జూన్ 11 రాత్రి 10:30 గంటలకు ఈ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. అనంతరం అర్ధరాత్రి 12:30 గంటలకు (జూన్ 12 తెల్లవారుజామున) మెక్సికో, సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

2. అమెరికాలో వేడుకలు :

మెక్సికోలో టోర్నీ ప్రారంభమైన మరుసటి రోజు అమెరికాలో వేడుకలు జరుగుతాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ స్టేడియంలో అమెరికా-పరాగ్వే మ్యాచ్‌కు ముందు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రముఖ అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ తన పాపులర్ పాటలతో అలరించనుంది. ఆమెతో పాటు అట్లాంటా ర్యాప్ స్టార్ ఫ్యూచర్ (ఫ్యూచర్) కూడా సందడి చేయనున్నాడు.

3. కెనడాలో మొదటిసారి :

తమ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న కెనడా.. టొరంటో స్టేడియంలో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగే మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీని ప్లాన్ చేసింది. కెనడియన్ జాతీయ గీతాన్ని అలానిస్ మోరిసెట్ ఆలపించనుండగా, బోస్నియా గీతాన్ని అలెగ్జాండర్ గాజిక్ ప్రెసెంట్ చేయనున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, విల్ ఆర్నెట్‌తో పాటు భారతీయ నటి నోరా ఫతేహి, మైఖేల్ బుబ్లే, అలెస్సియా కారా వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- కప్పు కొట్టే ఫేవరెట్లు ఎవరు?

ఈసారి ఫిఫా వరల్డ్​ కప్ 2026 కప్ గెలిచే అవకాశాలు ఫ్రాన్స్, స్పెయిన్ జట్లకు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ జట్టు కిలియన్ ఎంబాప్పే, ఔస్మనే డెంబెలే వంటి స్టార్ ఆటగాళ్లతో బలంగా ఉంది. ఇక యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐదుసార్లు ప్రపంచ విజేత అయిన బ్రెజిల్.. 2002 తర్వాత మళ్లీ ఇంతవరకు కప్ గెలవలేదు, కాబట్టి ఈసారి ఆరో టైటిల్ సాధించాలనే కసితో బరిలోకి దిగుతోంది.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- కళ్లన్నీ ఈ స్టార్ ప్లేయర్లపైనే..

ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (39 ఏళ్లు), క్రిస్టియానో ​​రొనాల్డో (41 ఏళ్లు)కు ఇదే ఆఖరి ప్రపంచకప్ అని దాదాపు అందరు ఫిక్స్​ అయిపోయారు. దీనితో వీరిద్దరి ఆటను చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పే తన మూడో ప్రపంచకప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, స్పెయిన్ తరఫున ఆడుతున్న 18 ఏళ్ల కుర్రాడు లామైన్ యమల్ ఈ టోర్నీలో సంచలనం సృష్టిస్తాడని భావిస్తున్నారు. వీరితో పాటు బ్రెజిల్ నైమార్, వినిసియస్ జూనియర్, ఇంగ్లాండ్ జూడ్ బెల్లింగ్‌హామ్, నార్వే గోల్ మెషిన్ ఎర్లింగ్ హాలాండ్‌ల ఆట తీరుపై అందరి కళ్లూ ఉన్నాయి.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- కొత్త జట్ల ఎంట్రీ, పాత జట్ల రీ-ఎంట్రీ..

ఫిఫా వరల్డ్​ కప్ 2026లో పెరిగిన జట్ల సంఖ్య కారణంగా ఈసారి చిన్న దేశాలకు కూడా ఆడే అవకాశం లభించింది. కేవలం 1.56 లక్షల జనాభా ఉన్న ‘క్యూరాకో’ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు సృష్టించింది. కేప్ వెర్డే, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కూడా తొలిసారి వరల్డ్ కప్ వేదికపై అడుగుపెడుతున్నాయి. ఇటలీకి 2006లో కప్ అందించిన ఫాబియో కానవారో ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. అలాగే 1974 తర్వాత మొదటిసారి హైతీ, 28 ఏళ్ల విరామం తర్వాత స్కాట్లాండ్ జట్లు మళ్లీ టోర్నీకి అర్హత సాధించాయి.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- భారత్‌లో ఉచితంగా లైవ్ చూడడం ఎలా?

భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల విషయంలో చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. అయితే టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు.. అధికారిక ప్రసార హక్కులను ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ దక్కించుకుంది.

ఈ ఫిఫా వరల్డ్​ కప్​ 2026 కోసం ఓటీటీ యాప్‌లో రెండు ప్లాన్స్ అందుబాటులో ఉంచారు. మూడు నెలల ప్లాన్ రూ. 799 కాగా, ఒక సంవత్సర కాలానికి రూ. 1699 గా నిర్ణయించారు.

అయితే, జీ ఛానెల్స్ లేదా జీ5 సబ్‌స్క్రిప్షన్ లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది!

మన దేశంలోని సాధారణ క్రీడాభిమానుల కోసం ప్రభుత్వ రంగ ఛానెల్ దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఉచితంగా మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. టోర్నమెంట్‌లోని కొన్ని ఎంపిక చేసిన కీలకమైన మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా చూడవచ్చు.

డీడీ స్పోర్ట్స్‌లో వచ్చే మ్యాచ్‌ల వివరాలు:

జూన్ 11న జరిగే మెక్సికో వర్సెస్ సౌతాఫ్రికా ప్రారంభ మ్యాచ్ (భారత్‌లో జూన్ 12 తెల్లవారుజామున 12:30 గంటలకు) లైవ్‌లో వస్తుంది.

ఆ తర్వాత టోర్నీలో అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్స్ (జులై 9, 10, 11), సెమీఫైనల్స్ (జులై 14, 15), జులై 19న జరిగే గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌లను ‘డీడీ ఫ్రీ డిష్’ వినియోగదారులు ఉచితంగా వీక్షించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More