పిల్లల బడ్జెట్ రూ. 1,32,296 కోట్లు.. పెరుగుదల స్వల్పమే: సీఆర్‌వై విశ్లేషణ
కేంద్ర బడ్జెట్ 2026–27లో పిల్లల కోసం కేటాయింపులు స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది పెద్ద మార్పును సూచించేదిగా కాకుండా, క్రమానుగత పురోగతిని ప్రతిఫలిస్తోంది. చైల్డ్ రైట్స్ అండ్ యు (సీఆర్‌వై) సంస్థ బడ్జెట్ వ్యయం స్టేట్‌మెంట్ నంబర్ 12ను విశ్లేషించింది.
2026–27 (బడ్జెట్ అంచనాలు)లో పిల్లల కోసం మొత్తం కేటాయింపులు రూ. 1,32,296.85 కోట్లకు పెరిగాయి. 2025–26 (బడ్జెట్ అంచనాలు)లోని రూ. 1,16,132.5 కోట్లతో పోలిస్తే రూ. 16,164.35 కోట్ల పెరుగుదల ఉంది. మొత్తం కేంద్ర బడ్జెట్‌లో పిల్లల బడ్జెట్ వాటా 2025–26లో 2.29 శాతం నుంచి 2026–27లో 2.47 శాతానికి పెరిగింది. జీడీపీలో వాటా కూడా 0.33 శాతం నుంచి 0.34 శాతానికి స్వల్పంగా పెరిగింది.

ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్ అండ్ యు (సీఆర్‌వై) సీఈవో పూజా మార్వాహా స్పందిస్తూ.. ‘‘పిల్లల కోసం కేటాయింపులు రూ. 1.32 లక్షల కోట్లకు పైగా పెరగడం, బడ్జెట్‌లో వాటా 2.47 శాతానికి చేరడం సానుకూల సంకేతం. అయితే దేశ వాస్తవ పరిస్థితులు, పెరుగుతున్న పిల్లల అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ పెట్టుబడి ఇంకా పరిమితంగానే ఉంది. ఆరోగ్యం, పోషణ, విద్య రంగాల్లో స్వల్ప పెరుగుదల స్వాగతించదగ్గది. కానీ సమగ్ర, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే, ప్రతి ఏటా స్వల్ప పెరుగుదలకే పరిమితం కాకుండా, పిల్లలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ మరింత బలీయమైన పెట్టుబడులు అవసరం” అన్నారు.
పిల్లల ఆరోగ్యం, పోషణ
పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం (RCH), ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌లతో కూడిన ఫ్లెక్సిబుల్ పూల్‌కు కేటాయింపులు రూ. 261.15 కోట్లు పెరిగి రూ. 4,591.58 కోట్లకు చేరాయి. సాక్షమ్ ఆంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకానికి కేటాయింపులు 5.19 శాతం, అంటే రూ. 969 కోట్లు అదనంగా కేటాయించారు. మొత్తం రూ. 19,635 కోట్లు ఇచ్చారు. పోషణ్ 2.0 అనేది పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో అమలవుతున్న ప్రధాన ప్రభుత్వ పథకం. ఈ పెరుగుదలతో ఆంగన్‌వాడీ స్థాయిలో పోషక సేవలు మరింత విస్తృతంగా, నిరంతరంగా అందే అవకాశం ఉంది.
పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ పథకానికి 2 శాతం పెరుగుదలతో రూ. 12,749.99 కోట్లు కేటాయించారు. అలాగే, 2024–25 తర్వాత తొలిసారిగా జల్ జీవన్ మిషన్‌ను మళ్లీ పిల్లల బడ్జెట్‌లో చేర్చారు. దీనికి రూ. 6,736.36 కోట్లు కేటాయించడం ద్వారా, సురక్షిత తాగునీటి ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించినట్లు స్పష్టమవుతోంది.
శిశు అభివృద్ధి, విద్య, సంరక్షణ
మిషన్ వాత్సల్యకు 3.33 శాతం స్వల్ప పెరుగుదలతో రూ. 1,550 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 42,100 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే 2.06 శాతం పెంచారు. గిరిజన పిల్లల విద్య కోసం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు 20 శాతానికి పైగా పెరుగుదలతో రూ. 7,200 కోట్లు కేటాయించడం విశేషం. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు కూడా అధిక నిధులు కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణాభిలాషను పెంపొందించేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌కు 2026–27లో రూ. 3,200 కోట్లు కేటాయించారు. అలాగే స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని పిల్లల బడ్జెట్‌లో చేర్చడం ద్వారా, జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా వృత్తి విద్యను తొలిదశలోనే ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, అణగారిన వర్గాల పిల్లల కోసం ఉన్న పలు స్కాలర్‌షిప్ పథకాల్లో పెద్దగా పెరుగుదల లేదు. షెడ్యూల్డ్ కులాల ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఎలాంటి పెంపు లేదు. ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీలు, వికలాంగ పిల్లల స్కాలర్‌షిప్‌లకు కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంది. గిరిజన అభివృద్ధి పథకం (పీఎం వన్‌బంధు కల్యాణ్ యోజన)కు గణనీయంగా నిధులు పెరిగినప్పటికీ, సమానత్వం సాధించడం కోసం ఉద్దేశించిన కార్యక్రమాల విషయంలో అసమతుల్యత కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, 2026–27 పిల్లల బడ్జెట్ పరివర్తనాత్మక పెట్టుబడి కాకుండా, క్రమానుగత పెరుగుదలకే పరిమితమైంది. భారతదేశం సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, భవిష్యత్ బడ్జెట్లలో పిల్లలకు కేటాయింపులు స్వల్ప పెంపులకే పరిమితం కాకుండా.. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక ప్రణాళికల్లో పిల్లలను మరింత బలంగా కేంద్ర బిందువుగా నిలబెట్టాలి. కేటాయింపుల పరిమాణం, సమాన వాటా, దీర్ఘకాలిక దృష్టితో కేటాయింపులు జరపాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


