నా జీవితంలో అత్యంత చీకటి రోజు: కుమారుడి మృతిపై వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ (49) అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత చికిత్స పొందుతూ మరణించారు. కుమారుడి మృతిపై అనిల్ అగర్వాల్ సామాజిక మాధ్యమాల్లో ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
ఒక తండ్రికి తన బిడ్డను సాగనంపడం కంటే మించిన శోకం మరొకటి ఉండదు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రస్తుతం అటువంటి పుత్రశోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు, హిందుస్థాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ (49) బుధవారం న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలోనే మృత్యువు ఆయనను కబళించింది.

కోలుకుంటున్న వేళ.. ఊహించని గుండెపోటు
అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కీయింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, విధి వెక్కిరించింది. హఠాత్తుగా వచ్చిన గుండెపోటు అగ్నివేష్ ప్రాణాలను బలితీసుకుంది.
"నా ప్రపంచం ముక్కలైంది.."
ఈ విషాద వార్తను అనిల్ అగర్వాల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు. నా ప్రియతమ కుమారుడు అగ్నివేష్ మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్లిపోయాడు. కేవలం 49 ఏళ్ల వయసు.. ఎన్నో కలలు, ఎంతో ఉత్సాహంతో ఉండేవాడు. స్కీయింగ్ ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో బాగానే కోలుకుంటున్నాడు, కష్టం గడిచిపోయింది అనుకున్నాం. కానీ ఆ గుండెపోటు మా కుమారుడిని లాగేసుకుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక తండ్రిగా పడుతున్న బాధను వర్ణిస్తూ.. "తండ్రి కంటే ముందే కుమారుడు వెళ్లకూడదు. ఈ లోటు మమ్మల్ని ఎంతగా క్రుంగదీసిందో మాటల్లో చెప్పలేను. అతను నాకు కేవలం కొడుకు మాత్రమే కాదు.. ఒక మంచి స్నేహితుడు, నా గర్వం, నా ప్రపంచం" అని పేర్కొన్నారు. అనిల్ అగర్వాల్ భార్య కిరణ్ కూడా ఈ విషాదంతో కుప్పకూలిపోయారు.
ఆశయాల వారసుడు
అగ్నివేష్ అగర్వాల్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. క్రీడాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, సమర్థుడైన నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ఆయనకు గట్టి నమ్మకం ఉండేదని అనిల్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. "భారతదేశంలో ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళా సొంతకాళ్లపై నిలబడాలని మేము కలలు కన్నాం. మా సంపాదనలో 75 శాతం సమాజానికే తిరిగి ఇచ్చేస్తానని అగ్నివేష్‌కు నేను మాట ఇచ్చాను. నేడు ఆ మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను, ఆ ఆశయం కోసమే జీవిస్తాను" అని ఆయన తన నివాళిలో తెలిపారు.
అగ్నివేష్ ప్రస్థానం
చదువు: అజ్మీర్‌లోని ప్రఖ్యాత మాయో కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.
వ్యాపారం: ఫుజైరా గోల్డ్ సంస్థను స్వయంగా స్థాపించారు.
బాధ్యతలు: మరణించే సమయానికి ఆయన హిందుస్థాన్ జింక్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే వేదాంత గ్రూపునకు చెందిన తల్వాండీ సాబో పవర్ లిమిటెడ్ (TSPL) బోర్డులో సభ్యుడిగా సేవలందిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


