Election results 2026 : భవానీపుర్‌‌లో మమతాబెనర్జీ ఓటమి.. తమిళనాడులో స్టాలిన్ కూడా!

Election results 2026 live updates : తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్​ అప్డేట్స్​ని ఇక్కడ ఫాలో అవ్వండి.

Summary

Election results 2026 live updates : అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్​ ప్రక్రియ మొదలైంది. లైవ్​ అప్డేట్స్​ని ఇక్కడ ఫాలో అవ్వండి..

టీవీకే అధ్యక్షుడు విజయ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు
టీవీకే అధ్యక్షుడు విజయ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు

Election results : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి..

...Read More

Follow all the updates here:
May 4, 2026, 21:53:54 IST

స్టాలిన్ ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓడిపోయారు. కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో 9వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

May 4, 2026, 21:52:17 IST

మమత ఓటమి

పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి షాక్‌ తగిలింది. భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు మమత. ఇక బెంగాల్‌లో బీజేపీ 200కుపైగా సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటి వరకూ కేవలం 72 స్థానాల్లోనే విజయం సాధించింది.

May 4, 2026, 14:46:01 IST

ప్రాంతాల వారీగా టీవీకే ప్రభంజనం ఇలా

ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం ప్రాంతాల వారీగా టీవీకే ప్రదర్శన ఇలా ఉంది:

1. ఉత్తర తమిళనాడు (Northern Districts)

ద్రవిడ పార్టీలకు కంచుకోటలైన ఉత్తర జిల్లాల్లో టీవీకే భారీగా ఓట్లను కొల్లగొట్టింది.

చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను వెనక్కి నెట్టి టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

2. మధ్య, డెల్టా ప్రాంతం (Central & Delta)

కావేరీ డెల్టా ప్రాంతంలోనూ విజయ్ ప్రభావం బలంగా ఉంది.

తిరుచ్చిరాపల్లి, తంజావూరు, కరూర్, పెరంబలూరు, నాగపట్నం, తిరువారూర్, మయిలాడుతురై వంటి జిల్లాల్లో టీవీకే తన ఉనికిని బలంగా చాటుకుంది.

3. దక్షిణ తమిళనాడు (Southern Districts)

డీఎంకే, దాని మిత్రపక్షాలకు పెట్టని కోటగా ఉన్న మదురై నగరం ఇప్పుడు టీవీకే వశమవుతోంది.

మదురై నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సౌత్.. ఇలా ఐదు విభాగాల్లోనూ టీవీకే ఆధిపత్యం వహిస్తోంది.

దిండిగల్, థేని, విరుదునగర్, శివగంగ, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్కాసి జిల్లాల్లోనూ విజయ్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

4. ఇతర ప్రాంతాలు

సేలం: అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సొంత జిల్లా అయిన సేలంలోని పలు నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది.

కన్యాకుమారి: సాంప్రదాయకంగా కాంగ్రెస్ బలంగా ఉండే కన్యాకుమారిలోని పలు ప్రాంతాల్లో కూడా టీవీకే తన పట్టు నిరూపించుకుంది.

May 4, 2026, 13:32:33 IST

Assam election results : బీజేపీదే అసోం..

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ.. అసోంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం.. బీజేపీ 98 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. 126 సీట్లున్న అసోం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 64 చోట్ల గెలవాలి. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ 26 చోట్ల లీడింగ్​లో ఉంది.

May 4, 2026, 13:12:57 IST

బెంగాల్​పై బీజేపీ పట్టు..

మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం పశ్చిమ బెంగాల్​లో బీజేపీ 190+ సీట్లల్లో ఆధిక్యంతో దూసుకెళుతోంది. టీఎంసీ 95 స్థానాలకే పరిమితమైంది. అయితే ఇవి తప్పుడు లెక్కలని, సూర్యాస్తమం వరకు వేచి చూడాలని మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు, అభ్యర్థులకు చెబుతున్నారు.

May 4, 2026, 12:53:45 IST

West Bengal Election results : మమతా బెనర్జీ స్పందన..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం టీఎంసీ ఏజెంట్లు, కార్యకర్తలకు అత్యవసర సందేశం ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని తృణమూల్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీఎంసీ అధినేత కౌంటింగ్ నిలిపివేశారని ఆరోపించారు. "నేను నిన్న చెప్పినట్లుగా, వారు 2-3 రౌండ్ల తర్వాత బీజేపీని ఆధిక్యంలో చూపుతారు. దాదాపు 100 చోట్ల కౌంటింగ్ ఆపేశారు," అని ఆమె ఎక్స్​లో ఇచ్చిన తన సందేశంలో పేర్కొన్నారు.

May 4, 2026, 12:21:58 IST

West Bengal Elections : లీడింగ్​లో రత్న దేబ్​నాథ్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజీ అత్యాచార బాధితురాలి తల్లి రత్న దేబ్​నాథ్​.. పశ్చిమ బెంగాల్​ ఎన్నికల ఫలితాల్లో లీడింగ్​లో ఉన్నారు. ఆమె బీజేపీ టికెట్​పై పనిహతి సీటు నుంచి పోటీ చేశారు.

May 4, 2026, 11:56:33 IST

మెజారిటీ మార్కు దాటిన విజయ్

తమిళనాడులోని మొత్తం 234 సెగ్మెంట్లకు గాను 118 అసెంబ్లీ స్థానాలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే మెజారిటీ మార్కును చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

టీవీకే', 'విజయ్' నినాదాల మధ్య, పార్టీ కార్యకర్తలు ఇక్కడ సమీపంలోని పనైయూర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడిని "ముత్తలమైచార్ (ముఖ్యమంత్రి) విజయ్" అని నినదించారు.

మరోవైపు విజయ్ తండ్రి చంద్రశేఖర్, కొంతమంది కుటుంబ సభ్యులు ఆనందాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కొన్ని టెలివిజన్ ఛానళ్లలో కనిపించాయి.

May 4, 2026, 11:31:47 IST

Vijay TVK : విజయ్​ ఆస్తుల వివరాలు..

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్​ సమయంలో విజయ్​ సమర్పించిన నామినేషన్ ప్రకారం.. ఆయనకు రూ. 404.58 కోట్ల చరాస్తులు ఉన్నాయి.ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి. విజయ్​ ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

May 4, 2026, 10:47:20 IST

తమిళనాడులో ‘విజయ’ సునామీ: 104 స్థానాల్లో టీవీకే ఆధిక్యం.. వెనుకంజలో సీఎం స్టాలిన్, ఉదయనిధి

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని ఉప్పెన. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజాలకు 'దళపతి' విజయ్ నిద్రలేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ గమనిస్తే, తమిళనాడులో ఒక కొత్త శకం ఆరంభమైందని స్పష్టమవుతోంది. అధికార డీఎంకే కోటలు బద్దలవుతుంటే, అన్నాడీఎంకే ఆత్మరక్షణలో పడింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది.

ఎవరికి ఎన్ని సీట్లు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఏకంగా 104 స్థానాల్లో ముందంజలో ఉండగా, అన్నాడీఎంకే 76, అధికార డీఎంకే కేవలం 44 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి వెనుకబడటం డీఎంకే శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

1967 సీన్ రిపీట్?

తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ ఒకేసారి ఒక పార్టీకి పట్టం కట్టడం లేదా పాతాళానికి తొక్కడం అలవాటు. సరిగ్గా ఇదే ఇప్పుడు జరుగుతోంది. విజయ్ తన ప్రచారంలో తరచుగా ప్రస్తావించిన 1967, 1977 నాటి ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి చరమగీతం పాడితే, 1977లో ఎంజీఆర్ (MGR) రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా అదే రీతిలో అటు డీఎంకేను, ఇటు అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి 83 స్థానాల్లో అప్రతిహత ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

చెన్నై వంటి డీఎంకే కంచుకోటల్లో విజయ్ అభ్యర్థులు దూసుకుపోతుండటం గమనార్హం. పొన్నేరి, తిరువళ్లూరు, ఆవడి వంటి కీలక నియోజకవర్గాల్లో టీవీకే జెండా రెపరెపలాడుతోంది.

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గత ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, ‘ద్రవిడ మోడల్’ పాలన అంటూ ప్రచారం చేసుకున్నప్పటికీ, ఫలితాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి.

"ఈ ఎన్నికల ఫలితాలు పాలకుల అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు" అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం, కోలత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు కంటే 1234 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అటు చెపాక్-తిరువల్లికేణిలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా పరాజయం దిశగా సాగుతున్నారు. స్టాలిన్ కేబినెట్‌లోని 15 మంది మంత్రులు వెనుకబడి ఉన్నారంటే డీఎంకేపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అన్నాడీఎంకే కాస్త నయం.. బీజేపీ పరిస్థితి శూన్యం:

మరోవైపు, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎడప్పాడి నియోజకవర్గంలో పళనిస్వామి 7003 ఓట్ల భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. కాట్పాడి, గుడియాట్టం వంటి చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, జాతీయ పార్టీ అయిన బీజేపీకి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. థాలీ నియోజకవర్గంలో మినహా, మిగిలిన 26 స్థానాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది.

May 4, 2026, 10:42:40 IST

భవానీపూర్ లో మమతా బెనర్జీ వెనకంజ

భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో రెండో రౌండ్ కౌంటింగ్ తర్వాత మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 1,558 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

May 4, 2026, 10:30:40 IST

అస్సాంలో ‘హిమంత’ ప్రభంజనం: 87 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం

అస్సాం ఎన్నికల కౌంటింగ్‌లో అధికార ఎన్డీయే కూటమి ఘనవిజయం దిశగా సాగుతోంది. బీజేపీ ఒంటరిగానే 71 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షాలు ఏజీపీ, బీపీఎఫ్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తిన్నది.

బీజేపీకి మ్యాజిక్ ఫిగర్: అస్సాం అసెంబ్లీలో మెజారిటీ మార్కు 64 కాగా, బీజేపీ ఒక్కటే ప్రస్తుతం 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (AGP) 7 చోట్ల, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) 9 చోట్ల ముందంజలో ఉన్నాయి. మొత్తంగా 87 స్థానాల ఆధిక్యంతో ఎన్డీయే మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బరిలో భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు.

కాంగ్రెస్ దిగ్గజాలకు చుక్కెదురు: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో వెనుకంజలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఏజేపీ (AJP), రైజోర్ దళ్ చెరో స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ఏఐయూడీఎఫ్ (AIUDF) కూడా రెండు స్థానాలకే పరిమితమైంది.

మంత్రుల విజయయాత్ర: హిమంత బిశ్వ శర్మ కేబినెట్‌లోని దాదాపు అందరూ కీలక మంత్రులు ఈసారి కూడా తమ పట్టు నిలుపుకున్నారు.

రనోజ్ పెగు (ధేమాజీ), పిజూష్ హజారికా (జాగీరోడ్), అశోక్ సింఘాల్ (ధేకియాజులి) వంటి మంత్రులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.

కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన ప్రద్యుత్ బోర్డోలోయ్, భూపేన్ బోరా కూడా తమ నియోజకవర్గాల్లో విజయానికి దగ్గరగా ఉన్నారు.

ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా కూడా బోకాఖత్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

May 4, 2026, 10:19:24 IST

తమిళనాడులో సీఎంతో పాటు 14 మంది మంత్రుల వెనకంజ

తమిళనాడులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో వెనుకంజలో ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఇక్కడ రికార్డు మెజారిటీలతో గెలిచిన స్టాలిన్, ఈసారి ప్రత్యర్థి అభ్యర్థుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ముఖ్యమంత్రే వెనుకబడ్డారనే వార్త డీఎంకే శ్రేణులను ఆందోళనలో పడేసింది.

కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, డీఎంకేలో అత్యంత సీనియర్లు మరియు కీలక శాఖల మంత్రులు కూడా కౌంటింగ్‌లో వెనుకబడ్డారు.

దురైమురుగన్ (కాట్పాడి): డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురైమురుగన్ వెనుకంజలో ఉన్నారు.

కె.ఎన్. నెహ్రూ (తిరుచ్చి వెస్ట్): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నెహ్రూ కూడా ప్రత్యర్థి కంటే వెనుకబడి ఉన్నారు.

మా. సుబ్రమణియన్ (సైదాపేట): ఆరోగ్య శాఖ మంత్రి మా. సుబ్రమణియన్ టీవీకే అభ్యర్థి కంటే వెనుకబడ్డారు.

ఆర్. రాజేంద్రన్ (సేలం నార్త్): పర్యాటక శాఖ మంత్రి కూడా వెనుకంజలోనే ఉన్నారు.

మొత్తంగా 14 మంది మంత్రులు తొలి రౌండ్లలో వెనుకబడటం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

May 4, 2026, 10:14:02 IST

కేరళలో షాకింగ్ ట్రెండ్స్: వెనుకంజలో యూడీఎఫ్ సీఎం అభ్యర్థి వి.డి. సతీశన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కీలక పరిణామం నమోదైంది. యూడీఎఫ్ తరపున ముఖ్యమంత్రి రేసులో ఉన్న వి.డి. సతీశన్ ఉత్తర పరవూర్‌లో వెనుకబడ్డారు. తొలి రౌండ్లలో సిపిఐ(ఎం) అభ్యర్థి టైసన్ మాస్టర్ 240కి పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ప్రతిపక్ష నేతకే సెగ: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెట్టిన వి.డి. సతీశన్, ఇప్పుడు తన సొంత గడ్డపైనే గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. 2001 నుంచి వరుసగా విజయం సాధిస్తున్న ఆయనకు, ఈసారి సిపిఐ(ఎం) అభ్యర్థి ఈ.టి. టైసన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రాథమికంగా ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి టైసన్ ఆధిక్యతను నిలబెట్టుకుంటున్నారు.

యూడీఎఫ్ ఆధిక్యంలో ఉన్నా: రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో, సతీశన్ విజయం ఆ పార్టీకి అత్యంత ముఖ్యం. ఎందుకంటే, ప్రభుత్వం ఏర్పాటయితే ముఖ్యమంత్రి పదవికి ఆయన ఒక బలమైన అభ్యర్థి. ఒకవేళ ఇక్కడ ఫలితం తారుమారైతే, అది యూడీఎఫ్ సంబరాలపై నీళ్లు చల్లడమే కాకుండా, కొత్త నాయకత్వ అన్వేషణకు దారితీస్తుంది.

May 4, 2026, 09:57:23 IST

కేరళలో కమలం వికాసం? 5 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం.. పలక్కాడ్, నేమంలో జోరు

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. పలక్కాడ్, నేమం వంటి కీలక నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరుస్తూ కేరళ అసెంబ్లీలో ఈసారి గట్టిగా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.

ఐదు చోట్ల ఎన్డీయే ముందంజ

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి ఒకటిన్నర గంట గడిచేసరికి ఎన్డీయే ఐదు చోట్ల ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. టీవీ రిపోర్ట్స్ ప్రకారం ఈ క్రింది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు:

నేమం (Nemom): గతంలోనూ ఇక్కడ బీజేపీ గెలిచిన చరిత్ర ఉంది. ఈసారి కూడా ఇక్కడ కమలం రేకులు వికసించేలా కనిపిస్తున్నాయి.

పలక్కాడ్ (Palakkad): ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ పోటీ చేసిన నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ గట్టి పట్టు సాధించింది.

మంజేశ్వర్ (Manjeswar): కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హోరాహోరీగా పోరాడుతున్నారు.

కజకూట్టం (Kazhakkoottam): తిరువనంతపురం పరిధిలోని ఈ నియోజకవర్గంలోనూ బీజేపీ ముందంజలో ఉంది.

చాతన్నూర్ (Chathannur): ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.

త్రిముఖ పోటీతో మారిన సమీకరణాలు: కేరళలో సాధారణంగా ఓట్లు ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ మధ్య చీలిపోతాయి. కానీ ఈసారి ఎన్డీయే 10 నుంచి 16 శాతం ఓట్లను తనవైపు తిప్పుకోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, యువతలో నిరుద్యోగ సమస్య వంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం యూడీఎఫ్ 90కి పైగా స్థానాల్లో, ఎల్డీఎఫ్ 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే సాధించే ఈ ఐదు స్థానాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.

అసెంబ్లీలో ఖాతా తెరిచే దిశగా..: గత అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ, ఈసారి కనీసం 5 నుంచి 7 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పని చేసింది. ఇప్పుడు ట్రెండ్స్ దానికి అనుకూలంగా ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేరళలో కేవలం ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే కాకుండా, సీట్లను కూడా సాధించడం ద్వారా దక్షిణాదిలో తన పట్టును మరింత పెంచుకోవాలని కమలదళం భావిస్తోంది.

May 4, 2026, 09:54:09 IST

కేరళలో సంచలనం: వెనుకంజలో సీఎం పినరయి విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎల్డీఎఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మడమ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటే దాదాపు 700 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా యూడీఎఫ్ (UDF) కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.

కంచుకోటలో బీటలు..

కన్నూర్ జిల్లాలోని ధర్మడమ్ నియోజకవర్గం సీపీఎంకు పెట్టని కోట. 2021 ఎన్నికల్లో విజయన్ ఇక్కడ 45,000 పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తొలి రౌండ్లలోనే కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ ముందంజలోకి రావడంతో ఎల్డీఎఫ్ శ్రేణులు నిశ్చేష్టులయ్యారు. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో వెనుకబడటం అనేది కేరళ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మంత్రులదీ అదే పరిస్థితి..

కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, పినరయి విజయన్ మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ప్రముఖ నేతలు తమ నియోజకవర్గాల్లో పరాజయం దిశగా సాగుతున్నారు.

మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి ప్రస్తుతం 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్డీఎఫ్ గణనీయంగా తగ్గి 20-30 స్థానాలకే పరిమితమైంది.

May 4, 2026, 09:33:00 IST

పుదుచ్చేరిలో మళ్లీ ‘రంగస్వామి’ హవా? తొలి ట్రెండ్స్‌లో ఎన్డీయే ఆధిక్యం.. కాంగ్రెస్ వెనుకంజ

పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆరు ప్రధాన కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇందులో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏఐఎన్ఆర్సీ పది నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వి. వైద్యలింగం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి కేవలం ఐదు చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకే ఒక కూటమిగా (NDA) బరిలోకి దిగగా.. కాంగ్రెస్, డీఎంకే కలిసి 'ఇండియా' (INDIA) కూటమిగా తలపడుతున్నాయి. వీరితో పాటు ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీని ఇస్తుండటం విశేషం. అయితే, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే రంగస్వామి కూటమి మ్యాజిక్ ఫిగర్ 16 వైపు దూసుకుపోతోంది. భారీ భద్రత నడుమ కౌంటింగ్ కేందద్రపాలిత ప్రాంతంలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పుదుచ్చేరి పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు త్రీ-లేయర్ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంల లెక్కింపు వేగవంతం కావడంతో, మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎన్డీయే శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది, రంగస్వామి మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

May 4, 2026, 09:25:51 IST

కేరళలో యూడీఎఫ్‌ ముందంజ

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. 60 సీట్లలో ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్ కూటమి ఎల్‌డీఎఫ్ 23 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి.

May 4, 2026, 09:24:28 IST

తమిళనాడులో విజయ్ దూకుడు

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ముందంజలో ఉంది. డీఎంకే కావేరీ డెల్టా, చెన్నై ప్రాంతంలో దూకుడు ప్రదర్శిస్తుండగా, ఏఐడీఎంకే ఇక్కడ మూడోస్థానానికి పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టీవీకే 81 స్థానాల్లో, డీఎంకే 60 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

May 4, 2026, 09:10:13 IST

Bengal elections : పశ్చిమ బెంగాల్​పై బీజేపీ పట్టు

ఉదయం 9 గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో పశ్చిమ బెంగాల్​లో బీజేపీ లీడింగ్​లో ఉంది. 293 సీట్లల్లో కౌంటింగ్​ జరుగుతుండగా ఇప్పటివరకు 36 చోట్ల కమలదళం ముందంజలో ఉంది. అధికార టీఎంసీ 18 స్థానాల్లోనే లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​ ఇంకా ఖాతా తెరవలేదు. వామపక్షాలు 1 చోట ముందున్నాయి.

May 4, 2026, 08:56:57 IST

West Bengal elections : మమతపై సువెందు లీడ్

పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ- టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అదే సమయంలో భబనిపూర్​ నియోగకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువెందు అధికారి లీడింగ్​లో ఉన్నారు.

May 4, 2026, 08:46:58 IST

VIjay election result : ఆధిక్యంలో విజయ్..

తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్.. ఆధిక్యంలో ఉన్నారు.

May 4, 2026, 08:40:51 IST

Kerala election results : కేరళలో టఫ్ ఫైట్..

ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు.. కేరళలో యూడీఎఫ్, ఎల్​డీఎఫ్​ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రెండూ చరో 34 చోట్ల లీడింగ్​లో ఉన్నాయి. ఎన్డీఏ 3 స్థానాల్లో ముందుంది.

May 4, 2026, 08:23:06 IST

Election results 2026 : ఎర్లీ ట్రెండ్స్​ ఇలా..

8 గంటల 15 నిమిషాల వరకు ఉన్న ఎర్లీ ట్రెండ్స్​ ప్రకారం.. పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ 0 చోట్ల, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్​లో ఉన్నాయి.

తమిళనాడులో డీఎంకే 4 స్థానాల్లో, అన్నాడీఎంకే 2 చోట్ల, విజయ్​ టీవీకే 1 సీటులో లీడింగ్​లో ఉన్నాయి.

కేరళలో యూడీఎఫ్​ దూసుకెళుతోంది! 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార ఎల్​డీఎఫ్​ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 1 సీటులో లీడింగ్​లో ఉంది.

అసోంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది! ఇక్కడ కమలదళం ఇప్పటికే 7 చోట్ల లీడింగ్​లో ఉంది. ఏఐయూడీఎఫ్​ ఒక స్థానంలో ముందుంది.

పుదుచ్చెరి విషయానికొస్తే.. ఇక్కడ ఎన్డీఏ కూటమి 3 చోట్ల ముందుంది.

(గమనిక- ఇవి ప్రాథమిక రిపోర్టులు మాత్రమే. సమయం బట్టి మారుతుంటాయి.)

May 4, 2026, 08:00:57 IST

Election result : కౌంటింగ్ షురూ..

అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ఫలితాల కోసం యావత్​ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తొలుత బ్యాలెట్​ లెక్కింపు ఉంటుంది. 30 నిమిషాల అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.

May 4, 2026, 07:41:46 IST

Election counting : ఇంకొద్ది సేపట్లో..

అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలలో ఇంకొద్ది సేపట్లో, కట్టుదిట్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​ పేపర్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.

May 4, 2026, 07:20:42 IST

Kerala election results : కేరళ ప్రజలు ఎటువైపు?

సాధారణంగా కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే అది ఒక రికార్డు అవుతుంది. ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ కూటమి ఓడిపోతే, 1977 తర్వాత దేశంలోనే కమ్యూనిస్టులు ఎక్కడా అధికారంలో లేని పరిస్థితి వస్తుంది. బెంగాల్, త్రిపురలను ఇప్పటికే కోల్పోయిన వామపక్షాలకు కేరళే ఇప్పుడు ఆఖరి ఆశ.

May 4, 2026, 06:58:23 IST

Assam results 2026 : బీజేపీదే అసోం!

అసోంలో మొత్తం 124 సీట్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 64 స్థానాల్లో గెలవాలి. దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ కూడా బీజేపీయే గెలుస్తుందని తేల్చేశాయి.

May 4, 2026, 06:49:55 IST

Election results 2026 : కౌంటింగ్​ ప్రక్రియ ఎలా ఉంటుంది?

భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనల ప్రకారం, రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్​ఓ) పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కట్టుదిట్టంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. కౌంటింగ్ ఎక్కడ జరగాలి అనేది ఆయనే నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు కౌంటింగ్ సిబ్బందిని మూడు దశల 'రాండమైజేషన్' ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు కూడా కౌంటింగ్ హాల్‌లో ఉండవచ్చు.

May 4, 2026, 06:25:08 IST

Tamil Nadu Elections : విజయ్​ ప్రభావం ఎంత?

తమిళనాడు ఎన్నికల్లో ఫోకస్​ అంతా నటుడు విజయ్​పైనే ఉంది. ఈ దఫా ఎన్నికల్లో ఆయన ఎంత మేర ప్రభావం చూపించగలరు? అన్నది ఆసక్తిగా మారింది. ఎగ్జిట్​ పోల్స్​ అయితే, ఈసారి కూడా డీఎంకే కూటమిదే అధికారం అని తేల్చేశాయి.

May 4, 2026, 06:10:15 IST

Tamil Nadu election results : తమిళనాడు అసెంబ్లీ పరిస్థితి..

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్​ ఫిగర్ 118గా ఉంది.

May 4, 2026, 06:07:41 IST

West Bengal counting : మమతా వర్సెస్​ బీజేపీ

ఎప్పటిలానే ఈసారి కూడా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని గద్దె దించేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేసింది. ఎగ్జిట్​ పోల్స్​ కూడా ఈసారి కమలదళానిదే గెలుపు అని తేల్చేశాయి. మరి వాటి అంచనాలు నిజవుతాయా? లేదా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.

May 4, 2026, 06:06:17 IST

West Bengal election results : పశ్చిమ బెంగాల్​లో ఇలా..

పశ్చిమ బెంగాల్​లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కు 148గా ఉంది. అయితే ఒక నియోజకవర్గంలో రీ-పోలింగ్ కారణంగా ఈరోజు 293 స్థానాల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి.

May 4, 2026, 06:03:58 IST

Election counting : ఉదయం 8 గంటలకు కౌంటింగ్

ఎప్పటిలానే ఆయా ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత బ్యాలెట్​ పేపర్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఏదేమైనా మధ్యాహ్నం నాటికి ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

May 4, 2026, 06:02:34 IST

Assembly Election results : ఈరోజే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

దేశంలో దాదాపు 2 నెలలుగా జరుగుతున్న ఎన్నికల సమరానికి నేటితో ముగింపు పడనుంది! పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. దేశ రాజకీయాలను మార్చే సత్తా ఉన్న ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Home News Election results 2026 : భవానీపుర్‌‌లో మమతాబెనర్జీ ఓటమి.. తమిళనాడులో స్టాలిన్ కూడా!