ఆస్ట్రేలియాకు దిమ్మ దిరిగే షాక్.. టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లోనే ఇంటికి.. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దుతో సంచలనం
టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఈసారి లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో జింబాబ్వే 5 పాయింట్లతో సూపర్ 8కి దూసుకెళ్లడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. మంగళవారం (ఫిబ్రవరి 17) పల్లెకెలెలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టక తప్పలేదు. దీంతో జింబాబ్వే సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

మ్యాచ్ రద్దు.. జింబాబ్వేకు అదృష్టం
టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేకు అదృష్టం కలిసి వచ్చింది. ఆస్ట్రేలియాపై సంచలనం విజయం సాధించడంతోపాటు ఐర్లాండ్ తో మ్యాచ్ రద్దవడంతో ఏకంగా సూపర్ 8లోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో ఆస్ట్రేలియాకు నిరాశ తప్పలేదు.
ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఐర్లాండ్ కచ్చితంగా జింబాబ్వేను ఓడించి ఉండాల్సింది. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో జింబాబ్వే ముందంజ వేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే వెనుదిరగడం ఇది రెండోసారి. మొదటిసారి 2009లోనూ ఇలా జరిగింది.
ఆస్ట్రేలియా పతనానికి కారణాలు..
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా గాయం వల్ల మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ట్రావిస్ హెడ్ సారథ్యంలో ఐర్లాండ్‌పై గెలిచినా, జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆసీస్ కొంపముంచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్, హెడ్ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, ఆ తర్వాత బ్యాటింగ్ కుప్పకూలింది. పథుమ్ నిస్సంక సెంచరీతో శ్రీలంక విజయం సాధించి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టింది.
జింబాబ్వే సూపర్ 8 ఎంట్రీ.. భారత్‌తో పోరు
వర్షం ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లగా, జింబాబ్వేకు మాత్రం కలిసొచ్చింది. ఐసీసీ సీడింగ్స్ ప్రకారం జింబాబ్వే ఇప్పుడు ఆస్ట్రేలియా స్థానాన్ని భర్తీ చేసి.. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్న గ్రూపులో చేరింది.
సూపర్ 8లో భాగంగా జింబాబ్వే తన తదుపరి మ్యాచ్‌ను టీమిండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 26 అంటే వచ్చే గురువారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.
సూపర్ 8కి చేరడం ద్వారా జింబాబ్వే 2028లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వేదికగా జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. 2024లో ఉగాండా చేతిలో ఓడి క్వాలిఫై కాలేకపోయిన జింబాబ్వేకు ఇది గొప్ప పునరాగమనం అనే చెప్పాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


