ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ విద్యార్థులకు ఇబ్బందులే

ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై కోర్సులు చదివే విద్యార్థులు తమ భాగస్వాములను, పిల్లలను వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఈ కొత్త నిర్ణయం భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం.

Published on: Sep 17, 2026, 17:47:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరించే క్రమంలో వీసా నిబంధనలను విపరీతంగా కఠినతరం చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఆస్ట్రేలియాకు వచ్చే చాలామంది విదేశీ విద్యార్థులు తమ భాగస్వాములను (Spouse), పిల్లలను వెంట తీసుకురావడానికి అనుమతి నిరాకరించనున్నారు.

ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం
ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం

కఠినమైన నిబంధనలు తెచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని, వర్కింగ్ హాలిడే వీసాదారులకూ కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జనాభా పెరుగుదల, జీవన వ్యయం పెరగడం ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక వలసలను తగ్గించాలని ఒత్తిడి పెరుగుతోంది. 2028 నాటికి వార్షిక నికర వలసల సంఖ్యను 2,25,000 కు తగ్గించాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3,00,000గా ఉంది.

వీసా గడువు ముగిస్తే కఠిన చర్యలు

వీసా గడువు తీరిన తర్వాత కూడా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిని గుర్తించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 100 మంది అదనపు తనిఖీ అధికారులను (Compliance Officers) నియమిస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో మెల్‌బోర్న్‌లో వాడిన క్వారంటైన్ కేంద్రాన్ని, వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉంచే డిటెన్షన్ సెంటర్‌గా మార్చాలని యోచిస్తోంది.

టూరిస్ట్ వీసాలపై వచ్చే వారికి 'నో ఫర్దర్ స్టే' నిబంధనను వర్తింపజేస్తున్నారు. అంటే వారు ఆస్ట్రేలియాలో ఉంటూ మరో రకం వీసాకు (పార్ట్‌నర్ వీసా వంటివి) దరఖాస్తు చేసుకోవడం కుదరదు. అలాగే వర్కింగ్ హాలిడే వీసాలను పొడిగించుకోవడానికి బ్యాలెట్ విధానాన్ని తీసుకువస్తున్నారు.

విద్యార్థుల వీసాలపై ఆంక్షల ప్రభావం

స్టూడెంట్ వీసాలను పునరుద్ధరించుకోవాలనుకునే (Renew) విద్యార్థులు, తమ ప్రస్తుత అర్హత కంటే ఉన్నత స్థాయి కోర్సుల్లో చేరితేనే అనుమతి ఇస్తారు. అత్యధిక కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునే సదుపాయాన్ని రద్దు చేశారు.

అయితే పసిఫిక్ దీవులు, ఆగ్నేయాసియా దేశాల విద్యార్థులకు, అలాగే పీహెచ్‌డీ (PhD) చేసే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

భారతీయ విద్యార్థులపై పడే ప్రభావం

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న భారతీయ విద్యార్థులపై ఈ కొత్త నిబంధనల ప్రభావం పడనుంది. వివాహమైన విద్యార్థులు, పిల్లలు ఉన్నవారు కుటుంబంతో కలిసి వెళ్లడం ఇకపై సులభం కాదు.

అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే ఎలాంటి ముప్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు భవిష్యత్తులో వచ్చే వీసాలకే ప్రధానంగా వర్తిస్తాయి.

ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ విద్య అత్యంత కీలకమైనది. జూన్ 2025 నాటికి ఈ రంగం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 53.6 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు 38 బిలియన్ డాలర్లు) ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఎగుమతి చేసే రంగాల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది. అయినప్పటికీ, దేశంలో పెరిగిన వలసలను నియంత్రించేందుకు లేబర్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More