ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.
వీడ్కోలు ప్రసంగంలో ప్రేయసికి ప్రపోజ్ చేసిన ఎంపీ.. సభలో సందడి
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రైడ్ నియోజకవర్గ ఎంపీ జోర్డాన్ లేన్ తన వీడ్కోలు ప్రసంగంలో ప్రేయసి నటాలీకి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. సభలోని సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆమె అంగీకారం తెలపడంతో ఆ దృశ్యం రికార్డుల్లోకి ఎక్కింది.
సిడ్నీ: రాజకీయ నాయకుల వీడ్కోలు ప్రసంగాలు సాధారణంగా భావోద్వేగంతోనో, రాజకీయ విమర్శలతోనో సాగుతుంటాయి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఎంపీ తన చివరి ప్రసంగాన్ని జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యూ) పార్లమెంట్ సాక్షిగా తన పదేళ్ల ప్రేయసికి వివాహ ప్రతిపాదన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ శాసనసభలో రైడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ ఎంపీ జోర్డాన్ లేన్ గురువారం (నవంబర్ 19) తన వీడ్కోలు ప్రసంగం చేశారు. పదేళ్లకు పైగా తనతో ప్రేమలో ఉన్న నటాలీ పబ్లిక్ గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. ప్రసంగం చివర్లో లేన్ జేబులోంచి ఉంగరం బయటకు తీసి, మోకాళ్లపై కూర్చుని నటాలీ వైపు చూస్తూ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు '7 న్యూస్' (7NEWS) కథనం వెల్లడించింది.
సభలో హర్షధ్వానాలు.. రికార్డుల్లోకి 'అవును'
"స్పీకర్.. రైడ్ సభ్యుడిగా నా చివరి ప్రశ్న నా ప్రియతమ నటాలీని అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని లేన్ సభ వేదికగా ప్రశ్నించారు.
ఈ ఊహించని పరిణామంతో సభ ఒక్కసారిగా చప్పట్లు, హర్షధ్వానాలతో మారుమోగింది. అనంతరం లేన్ తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి, ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. నటాలీ అంగీకారాన్ని అధికారిక పార్లమెంట్ రికార్డులలో నమోదు చేయాలని ఆయన కోరారు.
"ఆమె 'అవును' అని చెప్పిన విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని కోరుతున్నాను" అని లేన్ పేర్కొన్నారు. "58వ పార్లమెంట్‌ను 'ప్రేమ పార్లమెంట్'గా గుర్తుంచుకుంటారు" అని ఈ వేడుకలో పాలుపంచుకున్న ఎన్ఎస్డబ్ల్యూ శాసనసభ స్పీకర్ గ్రెగ్ పైపర్ వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు వీడ్కోలు.. ప్రేమకు పట్టం
2027 మార్చిలో జరగనున్న ఎన్ఎస్డబ్ల్యూ రాష్ట్ర ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయడం లేదని ప్రకటించిన దాదాపు రెండు వారాల తర్వాత లేన్ ఈ వివాహ ప్రతిపాదన చేయడం విశేషం. 32 ఏళ్ల లేన్ తన వీడ్కోలు ప్రసంగంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ, జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమని అంగీకరిస్తూ, ప్రేమకు, రాజకీయాలకు మధ్య ఉన్న పోలికలను ప్రస్తావించారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించిన పలువురు లిబరల్ ఎంపీలలో లేన్ కూడా ఒకరని 'ది గార్డియన్' పేర్కొంది.
పిన్న వయస్కుడైన మేయర్ నుంచి ఎమ్మెల్యే వరకు..
ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంట్ అధికారిక ప్రొఫైల్ ప్రకారం, జోర్డాన్ లేన్ 2023 మార్చి 25న శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2017 నుంచి 2024 వరకు సిటీ ఆఫ్ రైడ్ కౌన్సిల్లో కౌన్సిలర్‌గా పనిచేశారు. 2022 జనవరిలో 27 ఏళ్ల వయసులోనే రైడ్ నగరానికి అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారని సిటీ ఆఫ్ రైడ్ అధికారిక ప్రకటన తెలిపింది.
సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన లేన్, రాష్ట్ర రాజకీయాల్లోకి రాకముందు దివ్యాంగుల హక్కుల పరిరక్షణ (డిజెబిలిటీ అడ్వకసీ), ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగాల్లో పనిచేసినట్లు 'ఏబీసీ న్యూస్' వెల్లడించింది.

E-Paper
