Adventure bike : బజాజ్ తొలి అడ్వెంచర్​ బైక్- ఇండియా లాంచ్​ ఎప్పుడు?

ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో త్వరలో తన తొలి అడ్వెంచర్ (ఏడీవీ) భారత బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ బైక్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 23, 2026, 10:45:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న బజాజ్ ఆటో కంపెనీ ఎట్టకేలకు అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది! పూర్తిగా ఆఫ్‌రోడ్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ బైక్‌కు సంబంధించిన రోడ్డు పరీక్షలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది 2026 చివరి నాటికి ఈ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

బజాజ్ అడ్వెంచర్ బైక్..
బజాజ్ అడ్వెంచర్ బైక్..

బ్రెజిల్ మార్కెట్‌లో తొలుత విడుదల కానున్న ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్.. ఇండియాలో ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

తమ సంస్థ నుంచి కొత్త ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ బైక్​ని ఆశించవచ్చని బజాజ్ బ్రెజిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాల్డైర్ ఫెరీరా ఇటీవలే తెలిపారు. ఇప్పటికే బ్రెజిల్‌లో పార్ట్స్ డెవలప్‌మెంట్, హోమోలోగేషన్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయని వివరించారు.

భారతీయ టెస్ట్ మ్యూల్స్ పరిశీలిస్తే, మన దేశ మార్కెట్ కూడా లాంచ్ ప్లాన్‌లో ప్రధాన భాగమని స్పష్టమవుతోంది.

బజాజ్ అడ్వెంచర్​ బైక్- డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

అడ్వెంచర్​ బైక్‌కు ‘బజాజ్ ట్రెక్కర్’ అనే పేరు పెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. అయితే ప్రొడక్షన్ పేరుపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి దీనిని కేవలం రాబోయే బజాజ్ ఏడీవీ అనే పిలుస్తున్నారు. ఈ బైక్ డిజైన్ సాంప్రదాయ అడ్వెంచర్ బైక్ తరహాలోనే ఉంటుంది. ఎత్తైన ఫ్రంట్ ఎండ్, బీక్-స్టైల్ మడ్ గార్డ్, ఫోర్క్ గైటర్లు, పొడవైన సింగిల్-పీస్ సీటు, పైకి ఉండే ఎగ్జాస్ట్ దీని ప్రత్యేకతలు.

టెస్టింగ్ బైక్‌లో స్పోక్ వీల్స్ కనిపిస్తున్నాయి. ఇవి ముందు భాగంలో సుమారు 19 అంగుళాలు, వెనుక భాగంలో 17 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రోడ్డుపై ప్రయాణం, తేలికపాటి ఆఫ్‌రోడ్ రైడింగ్ చాలా సులభంగా ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ అమర్చారు. రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఇచ్చారు. స్విచ్ చేయదగిన ఏబీఎస్ మోడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రానిక్ ప్యాకేజీపై బజాజ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బజాజ్ అడ్వెంచర్​ బైక్- ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉండొచ్చు?

ఇంజిన్ వివరాలను బజాజ్ గోప్యంగా ఉంచినప్పటికీ, పల్సర్ ఎన్250 మోడల్‌లో ఉన్న 249 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను దీనిలో వాడే బలమైన అవకాశాలు ఉన్నాయి. పల్సర్‌లో ఈ ఇంజిన్ 24.5 పీఎస్ పవర్​ని, 21.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది జత చేసి ఉంటుంది. అయితే అడ్వెంచర్ టూరింగ్‌కు తగినట్లుగా ఇంజిన్ మ్యాపింగ్, గేరింగ్‌లో బజాజ్ కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉంది.

భారత మార్కెట్లో ఈ బజాజ్​ తొలి అడ్వెంచర్ బైక్.. హీరో ఎక్స్‌పల్స్ 210, యెజ్డీ అడ్వెంచర్, సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి మోడళ్లతో పోటీపడనుంది. కాంపాక్ట్ సైజులో ఉండే ఈ ఇంజిన్ కారణంగా బజాజ్ ఈ బైక్ ధరను అత్యంత పోటీతత్వంతో ఉంచే అవకాశం ఉంది.

ఈ బజాజ్ అడ్వెంచర్​ బైక్ లాంచ్ డేట్, ఫీచర్లు, ధర సహా ఇతర వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More