Bajaj adventure bike : బైక్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! బజాజ్ నుంచి కొత్త అడ్వెంచర్ మోడల్..
Bajaj bikes : భారతీయ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సొంతంగా, సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. పూణె సమీపంలో జరుగుతున్న టెస్ట్ డ్రైవ్‌లో ఈ బైక్ మొదటిసారిగా కెమెరా కంటికి చిక్కింది. వివరాల్లోకి వెళితే..
భారతదేశ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో బజాజ్ బ్రాండ్ పేరుతో నేరుగా ఎలాంటి బైక్ అందుబాటులో లేదు. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ కేటీఎమ్ కంపెనీ భాగస్వామ్యంతో ఆ సంస్థకు చెందిన అడ్వెంచర్ సిరీస్ బైకులను బజాజ్ మనదేశంలోనే తయారు చేస్తోంది. ఇలాంటి బైకులను రూపొందించే సాంకేతికత, ప్లాట్‌ఫారమ్‌లు కంపెనీకి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు సొంతంగా అడ్వెంచర్ బైక్‌ను మాత్రం తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడనుందని తెలుస్తోంది. బజాజ్ నుంచి వస్తున్న సరికొత్త అడ్వెంచర్ బైక్‌కు సంబంధించిన స్పై షాట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

పూణె నగర పరిసరాల్లో ముసుగు (క్యామొఫ్లేజ్) కప్పిన ఒక సరికొత్త బైక్‌ను కంపెనీ టెస్టింగ్ చేస్తుండగా స్థానికులు గుర్తించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ బైక్‌ను ఒంటరిగా కాకుండా, కేటీఎమ్ అడ్వెంచర్ మోడల్స్, బజాజ్ పల్సర్ బైకులతో కలిపి గ్రూప్‌గా టెస్టింగ్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అభివృద్ధిలో చివరి దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న ఏ మోడల్‌తోనూ పోలిక లేని విధంగా ఈ కొత్త బైక్ డిజైన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుండటం విశేషం.
ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు పక్కా డిజైన్!
ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్ ఇంజిన్ సామర్థ్యం కంటే దాని ఓవరాల్ ప్యాకేజీ, డిజైన్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన బైక్ మంచి ఎత్తు (టాల్ స్టాన్స్), ముందు వైపు పొడవాటి ముక్కు లాంటి బీక్ డిజైన్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, పెద్దదైన 21-ఇంచుల ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఇవి కేవలం కంటికి అందంగా కనిపించడానికి పెట్టిన యాక్సెసరీలు కాదని, పక్కా ఆఫ్‌రోడ్ ప్రయాణాలను తట్టుకునేలా ఈ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిందని ఈ ఫీచర్లు చూస్తేనే అర్థమవుతోంది.
లాంగ్ రైడింగ్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ బైక్‌లో లాంగ్ టూరింగ్ ప్రయాణాలకు అవసరమైన సదుపాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైక్ వెనుక భాగంలో ఒక పెద్ద టాప్ బాక్స్ (లగేజీ ఉంచుకునే బాక్స్)ని అమర్చారు. అలాగే సుదీర్ఘ ప్రయాణాల్లో వెనుక కూర్చునే ప్యాసింజర్‌కు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఒకే పీస్‌తో కూడిన పొడవాటి సీటును ఇచ్చారు. రైడర్ కూర్చునే విధానం (రైడింగ్ ట్రయాంగిల్) కూడా ఎటూ వంగకుండా నిటారుగా, ఎంతో రిలాక్స్‌డ్‌గా ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకునే ఈ బైక్‌ను తయారు చేస్తున్నట్లు ఈ మార్పులు నిర్ధారిస్తున్నాయి.
పల్సర్ సిరీస్ పోలికలు..
ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్‌ని నిశితంగా గమనిస్తే ఇందులో ఉపయోగించిన కొన్ని భాగాలు మనకు బాగా తెలిసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా దీని స్వింగ్‌ఆర్మ్, వెనుక భాగం (టెయిల్ సెక్షన్) చూడటానికి బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్200ని పోలి ఉంది. అంతేకాకుండా పల్సర్ సిరీస్‌లో క్రమంగా వచ్చే నిలువు వరుసల ట్విన్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇందులోనూ కనిపిస్తున్నాయి. బజాజ్ తన ప్రస్తుత పల్సర్ హార్డ్‌వేర్‌ను ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌తో పంచుకుంటే గనుక, బైక్ ధరను మార్కెట్లో ఎవరూ ఊహించని విధంగా చాలా అందుబాటులో (అగ్రెసివ్ ప్రైసింగ్) ఉంచే అవకాశం ఉంటుంది.
ఇంజిన్ సామర్థ్యం ఎంత ఉండొచ్చు?
ఈ బజాజ్ కొత్త బైక్‌లో ఎలాంటి ఇంజిన్‌ను ఉపయోగించబోతున్నారనేది ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఒక అంచనా ప్రకారం.. బజాజ్ పల్సర్ ఎన్250లో ఉండే పవర్‌ట్రెయిన్ వెర్షన్‌ను వాడే అవకాశం ఉంది. ఇదే గనుక నిజమైతే మార్కెట్లో ఇప్పటికే ఉన్న హీరో ఎక్స్‌పల్స్ 210, సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250, యెజ్డీ అడ్వెంచర్ బైకులకు ఇది నేరుగా పోటీ ఇస్తుంది. అయితే బైక్ ఉన్న సైజు, దాని ప్రీమియం లుక్‌ను బట్టి ఇందులో కేటీఎమ్ ఆధారిత ఇంజిన్‌ను కూడా ఉపయోగించి ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఒకవేళ బజాజ్ గనుక కేటీఎమ్ ఇంజిన్ వైపు వెళ్తే, ఇది 350 సీసీ విభాగంలోకి అడుగుపెడుతుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440, రాబోయే హిమాలయన్ కొత్త మోడళ్లతో ఇది తలపడాల్సి ఉంటుంది. బైక్ బాడీవర్క్, ఫినిషింగ్ చూస్తుంటే ఇది ప్రారంభ దశ ప్రోటోటైప్‌లా కాకుండా, దాదాపు ప్రొడక్షన్ వెర్షన్ (మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న బైక్) లా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్ భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
బజాజ్ కంపెనీకి ఇప్పటికే కమ్యూటర్, స్పోర్ట్స్ స్ట్రీట్ బైక్స్, అలాగే కేటీఎమ్, ట్రయంఫ్ భాగస్వామ్యంతో ప్రీమియం విభాగాల్లో బలమైన పట్టు ఉంది. అయితే సొంత బ్రాండ్ పేరుతో అడ్వెంచర్ విభాగంలో మాత్రం ఇప్పటివరకు లోటు ఉంది, రాబోయే ఈ సరికొత్త మోడల్‌తో బజాజ్ ఆ లోటును కూడా భర్తీ చేయబోతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


