KTM duke 390 350cc : కేటీఎం నుంచి తక్కువ ధరకే 390 డ్యూక్, అడ్వెంచర్ బైక్స్- కొత్త వేరియంట్ల ఫీచర్లు..
KTM duke 390 : బజాజ్ ఆటో యాజమాన్యంలోని ప్రముఖ బైక్ బ్రాండ్ కేటీఎం.. భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు కీలక అడుగు వేసింది. తన పాపులర్ మోడల్స్ అయిన 390 డ్యూక్, 390 అడ్వెంచర్‌లలో సరికొత్త 350సీసీ వేరియంట్లను లాంచ్ చేసింది. ఆ వివరాలు..
KTM 350cc bikes : బజాజ్ ఆటో నేతృత్వంలోని కేటీఎం బ్రాండ్.. భారత్‌లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 399సీసీ ఇంజన్‌తో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ను అందించిన ఈ మోడల్స్‌లో.. ఇప్పుడు సరికొత్త 350సీసీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. దీని వెనుక ప్రధానంగా 'టాక్స్' వ్యూహం దాగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ల విశేషాలను ఇక్కడ చూసేయండి..

జీఎస్టీ మ్యాజిక్: భారీగా తగ్గిన ధరలు!
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్లపై 28 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు సెస్ విధిస్తారు. అయితే, కేటీఎం ఇప్పుడు తన ఇంజన్ సామర్థ్యాన్ని 350సీసీ పరిమితికి లోబడేలా రూపొందించడం వల్ల, ఈ బైక్‌లు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. దీనివల్ల బైక్ నాణ్యతలో గానీ, బ్రాండ్ వాల్యూలో గానీ మార్పు లేకుండానే ఎంట్రీ ప్రైస్‌ను గణనీయంగా తగ్గించగలిగారు.
కేటీఎం కొత్త బైక్స్- పవర్, పర్ఫార్మెన్స్..
కొత్త 350సీసీ ఇంజన్ ఉన్నప్పటికీ, కేటీఎం తన అసలైన పవర్‌ను మిస్ అవ్వకుండా జాగ్రత్త పడింది.
ఇంజన్: 350సీసీ సింగిల్ సిలిండర్.
పవర్: 41.5 హెచ్‌పీ పీక్ పవర్.
టార్క్: 33.5 ఎన్ఎం టార్క్.
ఇది సిటీ రోడ్లపై మెరుపు వేగంతో దూసుకెళ్లడానికి, హైవేలపై లాంగ్ రైడ్లకు పక్కాగా సరిపోతుంది.
కేటీఎం కొత్త బైక్స్- డిజైన్, హార్డ్‌వేర్: ఏమైనా మార్పులున్నాయా?
సాంకేతికంగా ఇంజన్ సామర్థ్యం తప్ప, డిజైన్ పరంగా ఈ బైక్‌లు తమ పాత వైభవాన్ని అలాగే కొనసాగిస్తున్నాయి.
కేటీఎం 390 డ్యూక్: ఇది అగ్రెసివ్ నేకెడ్ లుక్‌తో, షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బాడీ వర్క్‌తో ఆకట్టుకుంటుంది.
కేటీఎం 390 అడ్వెంచర్: ఇది ఆఫ్-రోడింగ్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్ ఉంది.
సస్పెన్షన్: ముందు భాగంలో 200 ఎంఎం ట్రావెల్ ఇచ్చే అడ్జస్టబుల్ యూఎస్డీ ఫోర్క్స్, వెనుక 205 ఎంఎం ట్రావెల్ ఇచ్చే అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. కఠినమైన దారుల్లో కూడా ఇది సాఫీగా సాగిపోతుంది.
కేటీఎం కొత్త బైక్స్- ధరల వివరాలు..
కొత్తగా లాంచ్ అయిన 350సీసీ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:
కేటీఎమ్ 390 డ్యూక్ (350సీసీ): రూ. 2,77,268
కేటీఎమ్ 390 అడ్వెంచర్ (350సీసీ): రూ. 2,80,905
గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న 399సీసీ హై-ఎండ్ మోడల్స్ (కేటీఎం 390 డ్యూక్ ఆర్, అడ్వెంచర్ ఎస్, ఎక్స్, అండ్ ఆర్) ఎటువంటి మార్పులు లేకుండా యధావిధిగా అమ్ముడుపోతాయి. కేవలం బడ్జెట్ ప్రియుల కోసం ఈ కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. కేటీఎం 350cc బైక్‌ను ఎందుకు లాంచ్ చేసింది?
భారత్‌లో 350cc కన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై పన్నులు ఎక్కువగా ఉంటాయి. జీఎస్టీ భారాన్ని తగ్గించి, బైక్ ధరను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడమే కేటీఎం ప్రధాన ఉద్దేశ్యం.
2. 350cc, 399cc మోడల్స్ మధ్య డిజైన్ తేడాలు ఉన్నాయా?
లేదు, డిజైన్, బాడీ వర్క్ పరంగా రెండు మోడల్స్ ఒకేలా ఉంటాయి. కేవలం ఇంజన్ సామర్థ్యం, ధరలో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది.
3. కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఆఫ్-రోడింగ్‌కు సరిపోతుందా?
ఖచ్చితంగా! ఇందులో ఉన్న అడ్జస్టబుల్ సస్పెన్షన్, 200 ఎంఎం కంటే ఎక్కువ ట్రావెల్ కారణంగా, ఇది బురద దారులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన బైక్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


