ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో ఘోరం: హిందూ వ్యాపారి దారుణ హత్య
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు మైమెన్‌సింగ్‌లో ఒక వృద్ధ హిందూ వ్యాపారిని దుండగులు దారుణంగా నరికి చంపారు. షాపులోనే హత్య చేసి నగదు ఎత్తుకెళ్లిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బంగ్లాదేశ్‌లో ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో అక్కడ మైనారిటీలపై దాడులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. మైమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. దేశంలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు పోలింగ్ జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

షాపులోనే ప్రాణాలు తీసిన దుండగులు
మృతుడిని 62 ఏళ్ల సుసేన్ చంద్ర సర్కార్‌గా గుర్తించారు. ఆయన మైమెన్‌సింగ్ జిల్లా త్రిశాల్ ప్రాంతంలోని సౌత్‌కంద గ్రామంలో నివసిస్తున్నారు. సుసేన్ చాలా కాలంగా 'భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్' పేరుతో బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బోగర్ బజార్ కూడలిలో ఉన్న తన దుకాణంలో ఆయన ఉండగా, దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
సుసేన్‌ను దారుణంగా నరికి చంపిన నిందితులు, ఎవరికీ అనుమానం రాకుండా షాపు షట్టర్లు దించేసి అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి ఎంతకీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ షట్టర్ తెరిచి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న సుసేన్ కనిపించారు. వెంటనే ఆయన్ని మైమెన్‌సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
లక్షలాది రూపాయల నగదు అపహరణ
తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని సుసేన్ కుమారుడు సుజన్ సర్కార్ వెల్లడించారు. "మేము చాలా కాలంగా బియ్యం వ్యాపారం చేస్తున్నాం. మాకు ఎవరితోనూ గొడవలు లేవు. నా తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన దుండగులు, షాపులో ఉన్న లక్షలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని త్రిశాల్ పోలీస్ స్టేషన్ చీఫ్ ముహమ్మద్ ఫిరోజ్ హొస్సేన్ తెలిపారు.
పెరుగుతున్న మైనారిటీలపై దాడులు
బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే మైమెన్‌సింగ్‌లో కొన్ని రోజుల క్రితం దీపు చంద్ర దాస్ అనే వస్త్ర పరిశ్రమ కార్మికుడిపై ఒక గుంపు దాడి చేసింది. దైవదూషణ పేరుతో అతడిని కొట్టి, సజీవ దహనం చేసిన ఘటన మరువక ముందే, వరుస హత్యోదంతాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యాపారి హత్య జరగడం స్థానిక మైనారిటీ వర్గాల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం అక్కడి శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


