బంగ్లాదేశ్‌లో దారుణం: హిందూ జర్నలిస్ట్ రాణా ప్రతాప్ కాల్చివేత.. ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువుల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యశోర్ జిల్లాలో జర్నలిస్ట్, వ్యాపారవేత్త అయిన రాణా ప్రతాప్ బైరాగిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చిచంపారు. గత మూడు వారాల్లోనే ఐదుగురు హిందువులు హత్యకు గురవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.

Published on: Jan 6, 2026, 12:53:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులపై హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా యశోర్ (Jashore) ప్రాంతంలో ఓ హిందూ వ్యాపారవేత్త, జర్నలిస్టును దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బంగ్లాదేశ్‌లో గత మూడు వారాల వ్యవధిలో హిందూ మతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.

బంగ్లాదేశ్‌లో దారుణం: హిందూ జర్నలిస్ట్ రాణా ప్రతాప్ కాల్చివేత (X/@SanaSheikhBD)
బంగ్లాదేశ్‌లో దారుణం: హిందూ జర్నలిస్ట్ రాణా ప్రతాప్ కాల్చివేత (X/@SanaSheikhBD)

ఎవరీ రాణా ప్రతాప్ బైరాగి?

హత్యకు గురైన రాణా ప్రతాప్ బైరాగి (38) యశోర్ జిల్లా కేశబ్‌పూర్ నివాసి. ఆయన నరైల్ నుంచి వెలువడే ‘దైనిక్ బీడీ ఖబర్’ (Dainik BD Khabar) అనే స్థానిక పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జర్నలిజంతో పాటు ఆయనకు మణిరాంపూర్‌లోని కొపాలియా బజార్‌లో ఒక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. గతంలో ఆయనపై కేశబ్‌పూర్, అభయ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి.

హత్య జరిగిందిలా..

సోమవారం సాయంత్రం 5:45 గంటల సమయంలో రాణా ప్రతాప్ తన ఐస్ ఫ్యాక్టరీలో పనిలో ఉండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు.

"దుండగులు రాణాను ఫ్యాక్టరీ బయటకు పిలిచి, మార్కెట్ పశ్చిమ వైపున్న ఒక సందులోకి తీసుకెళ్లారు. అక్కడ వారితో చిన్నపాటి వాగ్వాదం జరిగిన తర్వాత, నిందితులు రాణా తలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు" అని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు 'ది డైలీ స్టార్' వెల్లడించింది.

కాల్పుల అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో కొపాలియా మార్కెట్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

మతపరమైన కోణం ఉందా?

ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉన్నాయా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే, దేశంలో వరుసగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారి (OC) మహ్మద్ రాజీవుల్లా ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "హత్య వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియలేదు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More